రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారంనాడు నార్త్ బెంగాల్లో 9వ అంతర్జాతీయ సంతాలి సదస్సును ప్రారంభించారు. అయితే తన పర్యటనలో పలు ప్రోటోకాల్ ఉల్లంఘనలు చోటుచేసుకోవడంపై ఆమె ఆసంతృప్తి వ్యక్తం చేశారు. తనను కలవడానికి ముఖ్యమంత్రిగానీ, ఇతర మంత్రులుగానీ రాలేదని రాష్ట్రపతి అసంతృప్తి వ్యక్తం చేయగా, ఆమె బీజేపీ వారు చెప్పినట్టు మాట్లాడుతున్నారని మమతా బెనర్జీ ఆరోపించారు.
డార్జిలింగ్ జిల్లాలో ఏర్పాటు చేసిన 9వ అంతర్జాతీయ సంతాల్ సమ్మేళనాన్ని ప్రారంభించేందుకు ఆమె రాష్ట్రానికి వచ్చారు. అయితే ఇరుకుగా ఉందన్న కారణంతో చివరి నిమిషంలో సమావేశ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం మార్చివేసిందని రాష్ట్రపతి అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను ఆ స్థలాన్ని చూశానని, అక్కడ అయిదు లక్షల మంది కూర్చోవచ్చని చెప్పారు. ‘ఇది చాలా విచారకరం’ అని వ్యాఖ్యానించారు. సమావేశాన్ని బిధాన్నగర్ నుంచి గోసాయిపూర్‌కు మార్చడాన్ని తప్పుపట్టారు.
భద్రతా కారణాల పేరుతో బిధాన్నగర్లో జరగాల్సిన సదస్సు వేదకను బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్ సమీపంలోని గోసాయిపూర్‌కు మార్చడం, వేదక చిన్నది కావడంతో గిరిజన కమ్యూనిటీకి చెందిన వారు పెద్దసంఖ్యలో రాలేకపోవడం వంటివి చోటుచేసుకున్నాయి. విమానాశ్రయంలో రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, ఆమె మంత్రులు దూరంగా ఉండిపోయారు. రాష్ట్రపతికి సిలిగురి మేయర్ దేవ్ స్వాగతం పలికారు.
సభా వేదిక మార్పుపై ద్రౌపది ముర్ము మాట్లాడుతూ, ఇక్కడకు రావడం చాలా ఈజీగానే వచ్చానని, అయితే జనసమ్మర్ధం ఎక్కువగా ఉంటుందనే కారణంగా వేదికను మార్చినట్టు అధికార యంత్రాంగం చెప్పిందని తెలిపారు. “రాష్ట్రపతి వచ్చి జనసమర్ధం లేని చోట ఈవెంట్లో పాల్గొని వెళ్లిపోతారని వారు అనుకుని ఉంటారు. వాళ్ల ఆలోచన ఏమిటో నాకు తెలియదు. ఈ పరిణామం చాలా బాధాకరంగా ఉంది” అంటూ ఆమె అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి తన అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేసినప్పటికీ ముఖ్యమంత్రి విషయంలో ఆచితూచి మాట్లాడారు.
మమతా బెనర్జీ తన చిన్న చెల్లెలని, తాను కూడా బెంగాల్ కూతుర్నేనని చెబుతూ ఏదో కారణం వల్ల ఆమెకు (మమతాబెనర్జీ) తనపై కోపం వచ్చి ఉండవచ్చని పేర్కొన్నారు. ఆమెపై తానెలాంటి ఫిర్యాదు చేయదలచుకోలేదని చెప్పారు. అందరూ బాగుండాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పారు. ఉత్తర బెంగాల్లో ఆదివాసీలు, గోర్ఖాలు, రాజ్‌బన్షీలు, బెంగాలీలు కలిసిమెలసి ప్రశాంతంగా జీవిస్తుండటం, సామాజిక సామరస్యం చాటుకోవడంపై రాష్ట్రపతి ప్రశంసలు కురిపించారు. రాష్ట్రపతి తన పర్యటన సందర్భంగా స్థానిక గిరిజనులతో సంభాషించారు.
మరోవంక, దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ ఇలాంటి పరిణామాలు గతంలో ఎప్పుడూ జరగలేదని అంటూ విస్మయం వ్యక్తం చేశారు. సిగ్గుచేటని విమర్శించారు. ప్రజాస్వామ్యం. గిరిజనుల సాధికారితపై విశ్వాసం ఉన్నవారు నిరాశ చెందారని వ్యాఖ్యానించారు. గిరిజన జాతికి చెందిన రాష్ట్రపతికి బాధ కలిగించడంపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని విమర్శించారు. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని హద్దులను దాటిందని, రాష్ట్రపతిని అగౌరవ పరిచిందఅంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
“ఇది సిగ్గుచేటు , అపూర్వమైనది. ప్రజాస్వామ్యం, గిరిజన వర్గాల సాధికారతపై నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ నిరుత్సాహపడ్డారు. స్వయంగా గిరిజన సమాజానికి చెందిన రాష్ట్రపతిజీ వ్యక్తం చేసిన బాధ, వేదన భారతదేశ ప్రజల మనస్సులలో అపారమైన విచారాన్ని కలిగించింది” అని ప్రధాని మోదీ ఎక్స్ లో ఒక పోస్ట్‌లో రాశారు. “పశ్చిమ బెంగాల్‌లోని టిఎంసి ప్రభుత్వం నిజంగా అన్ని పరిమితులను దాటింది. రాష్ట్రపతికి జరిగిన ఈ అవమానానికి వారి పరిపాలన బాధ్యత వహిస్తుంది” అని ఆయన హెచ్చరించారు.
కాగా, ద్రౌపది ముర్ము రాక సందర్భంగా మమతా బెనర్జీ రాష్ట్రపతి కార్యాలయానికి ఉన్న గౌరవాన్ని దిగజార్చారని బీజేపీ మండిపడింది. ఇది టీఎంసీ ప్రభుత్వ నిర్వహణా వైఫల్యాన్ని చాటుతుందని పార్టీ నేత అమిత్ మాలవీయ ధ్వజమెత్తారు.
ఇలా ఉండగా, కోల్‌కతాలో ఓటరు జాబితా ఎస్ఐఆర్ కు వ్యతిరేకంగా రెండు రోజులుగా నిరసన నిర్వహిస్తున్న మమతా బెనర్జీ, రాష్ట్రపతి వ్యాఖ్యలకు ప్రతిస్పందిస్తూ, ఆ ప్రకటనలు రాజకీయ స్వభావం కలిగి ఉన్నాయని కొట్టిపారేసారు. “మీ పదవికి సరిపోని ప్రకటనలు చేయవద్దని నేను వినయంగా రాష్ట్రపతిని అభ్యర్థిస్తున్నాను. మీరు ఈరోజు ఒక సంఘం గురించి మాట్లాడారు. బెంగాల్‌లోని మిగిలిన సంఘాల గురించి మీరు మాట్లాడలేదు. మీకు రాజకీయాలు ఎలా ఆడాలో తెలుసు” అని ఆమె విచారం వ్యక్తం చేశారు.
బీజేపీ సలహాల మేరకు ఆమె మాట్లాడుతున్నారని పేర్కొంటూ మణిపూర్, ఛత్తీ్‌సగఢ్‌లలో గిరిజనులపై అత్యాచారాలు జరిగినా ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఆమెను ఆహ్వానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎవరూ వెళ్లలేదనడం సరికాదని చెప్పారు. ‘‘ఆ సమావేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం లేదు. దానిని ఎవరు నిర్వహిస్తున్నారో, నిధులు ఎవరు ఇచ్చారో కూడా తెలియదు’’ అని మమత వ్యాఖ్యానించారు.

More Stories
పుదుచ్చేరిలో ఎన్డీయేకు స్వల్ప ఆధిక్యం
అనేక సవాళ్లను సృష్టించిన పశ్చిమాసియా యుద్ధం
దలైలామాను మర్యాదపూర్వకంగా కలిసిన దత్తాత్రేయ హోసబలే