భారత్ వద్ద కేవలం 25 రోజులకే సరిపడే ఆయిల్ నిల్వలు మాత్రమే ఉన్నాయని వస్తున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఈ సమాచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేస్తూ, దేశంలో ప్రస్తుతం తగినంత ముడి చమురు మరియు పెట్రోలియం నిల్వలు ఉన్నాయని తెలిపింది. ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం, భారత్ వద్ద సుమారు 4,000 కోట్ల లీటర్లకు సమానమైన దాదాపు 250 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు నిల్వలు ఉన్నాయి.
ఈ నిల్వలు దేశ అవసరాలను పూర్తిస్థాయిలో 7 నుంచి 8 వారాల వరకు తీర్చగలవని అధికారులు పేర్కొన్నారు. ఈ చమురు నిల్వలు ప్రధానంగా విశాఖపట్నం, మంగళూరు, పడూర్ ప్రాంతాల్లోని భూగర్భ నిల్వ కేంద్రాలు, ఆయిల్ టెర్మినళ్లలో భద్రంగా ఉంచినట్లు ప్రభుత్వం వివరించింది. అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో పరిస్థితి స్థిరపడటంతో భారతదేశ ఇంధన నిల్వల పరిస్థితి మెరుగుపడుతోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరగవని కూడా తెలిపాయి. ప్రాంతీయ పరిస్థితిపై ఇటీవలి సమీక్షలు స్థిరమైన ఇంధన సరఫరాలను నిర్వహించడంపై విశ్వాసాన్ని బలోపేతం చేశాయని కేంద్రం ధృవీకరించింది. దేశంలో ఇంధన సరఫరాపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని కూడా స్పష్టం చేసింది. అదేవిధంగా సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని ప్రజలను ప్రభుత్వం హెచ్చరించింది. అధికారిక వర్గాలు వెల్లడించే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని సూచించింది.
మరోవంక, హార్ముజ్ జలసంధిపై ఇరాన్ ఆంక్షలు విధించడంతో సోమవారం నుంచి ఇప్పటివరకు కేవలం తొమ్మిది నౌకలు మాత్రమే హార్ముజ్ జలసంధిని దాటగలిగాయి. అందులో భారత్కు చెందిన ‘పుష్పక్’ అనే ట్యాంకర్ కూడా ఉంది. ఈ నౌక పెట్రోలియం ఉత్పత్తులను భారత్కు తీసుకువస్తోంది. పుష్పక్’ ట్యాంకర్ భారత్కు చేరుకోవడంతో దేశంలో ఇంధన నిల్వలకు కొంత ఊరట లభించే అవకాశం ఉంది. అయితే జలసంధిపై కొనసాగుతున్న ఆంక్షలు ప్రపంచ చమురు సరఫరాపై మరింత ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మరోవంక, రష్యా నుంచి తాము చమురు కొనేందుకు ఏ దేశం అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని భారత్ స్పష్టం చేసింది. ఇప్పటికీ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించింది. ఇటీవల అమెరికాతో భారత్ కు వాణిజ్య ఒప్పందం కుదిరిన నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోలును ఆపేయాలని అమెరికా చెప్పిందని, దీనికి భారత్ కూడా అంగీకరించిందని ప్రచారం జరిగింది.
ఇదే సమయంలో రష్యా నుంచి చమురు కొనుగోళ్లు తగ్గినట్లు పలు నివేదికలు తెలిపాయి. కేంద్ర ప్రకటన ప్రకారం భారత్ ఆయిల్ కోసం ఏ ఒక్క దేశంపైనో, మార్గంపైనే ఆధారపడట్లేదు. 27-40 దేశాల నుంచి ఆయిల్ కొంటోంది. రష్యా నుంచి ఫిబ్రవరిలో కూడా ఆయిల్ దిగుమతి చేసుకుంది. ఇప్పటికీ భారత్ కు రష్యా అతిపెద్ద చమురు సరఫరాదారుగా ఉంది.

More Stories
భారత్ కు మరో రెండు ఎల్పీజీ నౌకలు
మందగించిన ఆర్థిక సూచికల వృద్ధి
గల్ఫ్ యుద్ధంతో ఇంధన సంక్షోభంతో పాటు ఎరువుల సంక్షోభం