భారత్‌ కప్‌ కొడితే పలు రికార్డులు తధ్యం

భారత్‌ కప్‌ కొడితే పలు రికార్డులు తధ్యం

నెల రోజుల నుంచి అభిమానులను అలరిస్తున్న టి20 ప్రపంచకప్‌ టైటిల్‌ పోరుకు రంగం సిద్ధమైంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే టైటిల్‌కోసం భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు తలపడనున్నాయి. ఈ ట్రోఫీని సూర్యకుమార్‌యాదవ్‌ నేతృత్వంలోని భారతజట్టు గెలిస్తే పలు రికార్డులను నెలకొల్ప నుంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్‌ ఈ టైటిల్‌ గెలిస్తే వరుసగా రెండోసారి ఈ టైటిల్‌ను కైవసం చేసుకున్నట్లవుతుంది. 

అలాగే మూడుసార్లు ఈ టైటిల్‌ను గెలిచిన జట్టునూ నిలవనుంది. ఆతిథ్య హోదాలో టైటిల్‌ సాధించిన జట్టుగానూ రికార్డు నెలకొల్పనుంది. 2007 నుంచి ఇప్పటివరకు 9 టి20 ప్రపంచకప్‌ టోర్నీలు జరగ్గా వీటిలో ఒక్కసారి కూడా ఆతిథ్య జట్టు టైటిల్‌ గెలిచిన దాఖలాలు లేవు. అలాగే వరుసగా రెండుసార్లు టైటిల్‌ కొట్టిన జట్టు ఏదీ లేదు. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్‌ వేదికగా ఆదివారం జరిగే ఫైనల్లో టీమిండియా టైటిల్‌ గెలిచి పలు రికార్డును నమోదు చేయాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

టీమిండియా టైటిల్‌ను సాధిస్తే మూడుసార్లు టి20 ప్రపంచకప్‌ టైటిల్‌ నెగ్గిన తొలి జట్టుగానూ రికార్డుపుటల్లోకెక్కనుంది. ఇప్పటివరకు భారత్‌, ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌ జట్లు రెండేసిసార్లు టైటిళ్లను సాధించగా, శ్రీలంక, పాకిస్తాన్‌, ఆస్ట్రేలియా ఒక్కో సారి మాత్రమే ఈ టైటిల్‌ను కైవసం చేసుకున్నాయి.  ఇక న్యూజిలాండ్‌ జట్టు టి20 ప్రపంచకప్‌ ఫైనల్‌కు చేరడం ఇదే రెండోసారి మాత్రమే. ఇంతకుముందు 2021లో ఫైనల్‌కు చేరినా ఆస్ట్రేలియా చేతిలో ఓడి రన్నరప్‌కే పరిమితమైంది.

భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు ఇప్పటి వరకు 30 టి20ల్లో ముఖాముఖి తలపడగా, భారత్‌ 18మ్యాచుల్లో న్యూజిలాండ్‌ 11మ్యాచుల్లో విజయం సాధించాయి. ఒక మ్యాచ్‌ టై కాగా, స్వదేశంలో టీమిండియా 11 మ్యాచుల్లో గెలిస్తే,కివీస్‌ 4 టి20ల్లో విజయం సాధించింది.  న్యూజిలాండ్‌ గడ్డపై భారత్‌ 7, భారత గడ్డపై న్యూజిలాండ్‌ 5 మ్యాచుల్లో సత్తా చాటాయి. తటస్థ వేదికల్లో కివీస్‌ 2 మ్యాచ్‌లు గెలిచింది. ఇక టి20 ప్రపంచకప్‌లో ఈ రెండు జట్లు మూడుసార్లు తల పడగా,  మూడు సందర్భాల్లోనూ కివీస్‌దే విజయం.

డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారతజట్టు తడబడుతూనే ఫైనల్‌కు చేరింది. ఈ టోర్నీకి ముందు టి20 ఫార్మాట్‌లో విధ్వంస బ్యాటింగ్‌తో చెలరేగిన అభిషేక్‌ శర్మ మెగా టోర్నీలో ఒక్కసారిగా ఫామ్‌ కోల్పోయాడు. ఇక మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌ పరిస్థితి కూడా అంతే దారుణంగా ఉంది. మరోవైపు శివమ్‌ దూబే బంతితో ధారాళంగా సమర్పించుకుంటున్నాడు. ఇలాంటి సమస్యలు మన జట్టును వేధిస్తున్నాయి. 

సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్సీలో ఇప్పటి వరకు సిరీస్‌ కోల్పోని టీమ్‌ఇండియా అదే పంథాను కొనసాగించేందుకు అడుగులు వేస్తున్నది. అయితే కివీస్‌ రూపంలో బలమైన ప్రత్యర్థి ఉండటం టీమ్‌ఇండియాకు ఒకింత ప్రతికూలంగా కనిపిస్తున్నది. సెమీస్‌లో ఇంగ్లాండ్‌పై 253 పరుగుల భారీ స్కోర్‌ చేసినా, గెలిచింది కేవలం 7పరుగుల తేడాతోనే. ఇది భారత శిబిరాన్ని కలవరపాటుకు గురి చేస్తోంది.

మరోవైపు సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై భారీ విజయంతో న్యూజిలాండ్‌ రెట్టించిన ఉత్సాహంతో ఫైనల్‌లో అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో తుదిపోరులో ప్రత్యర్ధి జట్టును ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు.