పొరుగదేశమైన బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. తాజాగా కూమిల్లా ప్రాంతంలో పూజ చేస్తున్న హిందువుల బృందంపై శనివారం గుర్తుతెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. అకస్మాత్తుగా హిందువుల గుంపుపై బాంబులు విసిరారు. దాంతో వారు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. ఈ బాంబు దాడిలో ఆ పూజా కార్యక్రమానికి హాజరైన పలువురు గాయపడ్డారు. ఈ విషయాన్ని అక్కడి మీడియా వర్గాలు వెల్లడించాయి.
ఈ దాడిలో గాయపడిన పూజారి కేశవ్ చక్రవర్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలుళ్లు సంభవించడంతో అక్కడున్న ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనతో ఆలయం పరిసరాల్లో తీవ్ర కలకలం నెలకొంది. పేలుళ్ల వల్ల అక్కడ ఉన్న పలువురు భక్తులు గాయపడినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని వెంటనే సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
దాడి జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిసర ప్రాంతాలను పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలిస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. దాడి వెనుక ఉన్న కారణాలు, కుట్ర కోణం వంటి అంశాలపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. ఇటీవల బంగ్లాదేశ్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో హిందూ సమాజంపై దాడులు పెరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
2024 ఆగస్టులో షేక్ హసీనా పదవీచ్యుతుడైనప్పటి నుండి బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు పెరిగాయి. 2026 ప్రారంభంలో మైనారిటీ గ్రూపులు 2,000 కంటే ఎక్కువ సంఘటనలను నమోదు చేశాయి. వీటిలో హత్యలు, దేవాలయాల విధ్వంసం, అత్యాచారాలు, ఆస్తుల స్వాధీనం ఉన్నాయి. డిసెంబర్ 2025, జనవరి 2026 మధ్య మాత్రమే కనీసం 15 మంది హిందువులు హత్యకు గురయ్యారు. చాలా సంఘటనలు దైవదూషణ ఆరోపణలు, దోపిడీ లేదా ఫిబ్రవరి 2026 ఎన్నికలకు ముందు ఇస్లామిస్ట్ సమీకరణకు సంబంధించినవి.

More Stories
ఇరాన్‌పై గ్రౌండ్ ఆపరేషన్ కు ట్రంప్ సమాలోచనలు
పశ్చిమాసియా ఘర్షణలపై పీ-5 దేశాల భేటీకి రష్యా పిలుపు
భారత్, చైనా ప్రత్యర్థులు కాదు, భాగస్వాములు కావాలి