15 ఏళ్ల యువతిపై ట్రంప్ లైంగిక వేధింపులు?

15 ఏళ్ల యువతిపై ట్రంప్ లైంగిక వేధింపులు?

* తాజా ఎప్స్టీన్ ఫైల్స్లో తీవ్రమైన ఆరోపణలు

తాను 13 నుంచి 15 ఏళ్ల మధ్య వయసులో ఉన్న సమయంలో ఎప్‌స్టీన్‌ తనను న్యూయార్క్‌ లేదా న్యూజెర్సీ ప్రాంతాలకు తీసుకెళ్లి ట్రంప్‌కు పరిచయం చేశాడని, ఆ తర్వాత ట్రంప్‌ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఓ మహిళ చేసిన ఆరోపణలు తాజాగా అమెరికాలో కలకలం రేపుతున్నాయి.  ఎప్స్టీన్ సెక్స్‌ కుంభకోణానికి సంబంధించిన అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన మరిన్ని ఫైళ్లల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై తీవ్ర ఆరోపణలు ఉన్నట్లు వెల్లడైంది. 
న్యాయశాఖ విడుదల చేసిన తాజా పత్రాల ప్రకారం, ఒక మహిళ 2019లో ఎఫ్బీఐ అధికారులకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక ఆరోపణలు చేసింది. ఆమె వివరాల ప్రకారం, ట్రంప్‌ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, తనను బలవంతం చేయడానికి ప్రయత్నించాడని ఎఫ్‌బీఐ అధికారులకు తెలిపింది. ఆ సమయంలో తనను కాపాడుకోవడానికి ట్రంప్‌ను నోటితో కొరికినట్లు కూడా పేర్కొన్నట్లు పత్రాల్లో నమోదు చేశారు. 
ఆ ఘటన తర్వాత ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దని తనకు, తన కుటుంబ సభ్యులకు బెదిరింపు కాల్స్‌ వచ్చాయని ఆమె చెప్పినట్లు వెల్లడైంది.  ట్రంప్‌పై వచ్చిన ఆరోపణలతో కూడిన అంశాలను డిపార్ట్‌మెంట్ ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టిందా? అని డెమొక్రాట్లు దర్యాప్తు చేస్తుండగా ఈ ఫైళ్లు బయటకు వచ్చాయి. 2019లో ఎప్స్టీన్ అరెస్టు తర్వాత ఫైళ్లలో ఉన్న మహిళ చట్ట అమలు సంస్థకు ముందుకు వచ్చింది. ట్రంప్ తన జుట్టును లాగి తలపై కొట్టడం ద్వారా తనపై శారీరకంగా దాడి చేశాడని ఆమె చెప్పింది. 

ట్రంప్, ఎప్స్టీన్ ఇద్దరూ తనను దుర్వినియోగం చేశారని కూడా ఆమె చెప్పింది. తనకు 13 ఏళ్ల వయసులో హిల్టన్ హెడ్ ఐలాండ్‌లో ఎప్స్టీన్ తనపై దాడి చేశాడని ఆమె ఆరోపించింది. ఈ సంఘటన 1984 ప్రాంతంలో జరిగింది. అప్పట్లో సేకరించిన పలు ఫిర్యాదులు, ఇంటర్వ్యూలు, వాంగ్మూలాలను పరిశీలించిన తర్వాత మొత్తం 47 వేలకుపైగా పత్రాలను తాజాగా విడుదల చేసినట్లు తెలిపారు. 

అయితే ఈ కేసులోని కొన్ని పత్రాలపై భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నట్లు అధికారులు చెప్పారు. గతంలో విడుదలైన కొన్ని ఎప్‌స్టీన్‌ ఫైళ్లలో ఈ మహిళ చేసిన ఆరోపణలు నిర్ధారణ కాలేదని, కొన్ని వర్గాలు వాటిని అసత్యంగా పేర్కొన్నాయని తెలిపారు.  అందుకే ఆ వివరాలను  తుది పరిశీలన పూర్తయిన తర్వాతే తాజా పత్రాలను ప్రజలకు అందుబాటులో ఉంచినట్లు న్యాయశాఖ వెల్లడించింది. 

మరోవైపు ఈ ఆరోపణలను ట్రంప్ ఖండించారు. తనకు ఎప్‌స్టీన్‌ ఫైళ్లతో ఎలాంటి సంబంధం లేదని ఆయన గతంలో పలుమార్లు స్పష్టం చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ఆయన పేర్కొన్నారు.