ఖతార్ లో చిక్కుకుపోయిన భారతీయులకు తాత్కాలిక వీసా 

ఖతార్ లో చిక్కుకుపోయిన భారతీయులకు తాత్కాలిక వీసా 
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్న నేపథ్యంలో ఖతార్లోని ప్రవాస భారతీయులకు దోహాలోని భారత రాయబార కార్యాలయం వీసా, ట్రాన్సిట్, ప్రయాణాల విషయాల్లో చాలా అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా ఖతార్లో చిక్కుకుపోయిన భారతీయులకు సౌదీ అరేబియా మీదుగా ప్రయాణించేందుకు తాత్కాలిక ట్రాన్సిట్ వీసా సౌకర్యాన్ని కల్పించేందుకు రిజిస్ట్రేషన్ లింక్ను అందుబాటులోకి తెచ్చింది.

ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ జారీ చేసిన ప్రకటనను కూడా ఇండియన్ ఎంబసీ ఊటంకించింది. గడువు ముగిసిన లేదా ముగియనున్న అన్ని రకాల ఎంట్రీ వీసాలను నెలపాటు పొడిగించినట్లు పేర్కొంది. అయితే ఇది 2026 ఫిబ్రవరి 28 నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. పరిస్థితులను బట్టి దీనిని మరింత పొడింగించే అవకాశం ఉంది.

అత్యవసర పరిస్థితుల్లో ఖతార్ నుంచి సౌదీ అరేబియాలకు వెళ్లేందుకు ‘సాల్వా’ అనే భూసరిహద్దు మార్గం ఉంది. ప్రస్తుతం అది తెరిచే ఉందని భారతీయులకు రాయబార కార్యాలయం సమాచారం అందించింది. అమెరికా, బ్రిటన్ లేదా స్కెంజెన్ వీసాలను (కనీసం ఒక్కసారైనా వాడి ఉండాలి) కలిగి ఉన్న భారతీయులు సౌదీ అరేబియాలో ‘వీసా ఆన్ అరైవల్’ పొందవచ్చని తెలిపింది. 

ఇతరులు మాత్రం నిర్ణీత నియమాలు, ప్రక్రియల ప్రకారం సౌదీ వీసాకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ సమయంలో ఖతార్కు వచ్చిన విమాన టికెట్లు, సౌదీ నుంచి బయటకు వెళ్లేందుకు ఉన్న కన్ఫార్మ్డ్ టికెట్ కాపీలను సమర్పించాల్సి ఉంటుంది. అయితే సాల్వా భూ సరిహద్దు వరకు, అక్కడి నుంచి విమానాశ్రయం వరకు వెళ్లేందుకు ప్రయాణ ఏర్పాట్లను అభ్యర్థులే చేసుకోవాల్సి ఉంటుంది. 

ఈ ప్రక్రియకు కనీసం 48 గంటల సమయం పడుతుందని భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా భారతీయులు అందరూ సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని, అనవసర ప్రయాణాలు మానుకోవాలని భారత రాయబార కార్యాలయం కోరింది. ముఖ్యంగా కిటికీలు, బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండాలని ఖతార్ అధికారులు జారీ చేసిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని సూచించింది.