పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఇరాన్-ఇజ్రాయెల్ పోరులో అగ్రరాజ్యం అమెరికాకు కోలుకోలేని దెబ్బ తగిలింది. జోర్డాన్‌లో మోహరించిన అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన మిసైల్ డిఫెన్స్ రాడార్ వ్యవస్థను ఇరాన్ క్షిపణులు ధ్వంసం చేశాయి. జోర్డాన్‌లోని కీలకమైన మువాఫ్ఫక్ సల్టి ఎయిర్ బేస్ లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో ఏఎన్-టీపీవై-2 రాడార్ పూర్తిగా నాశనమైనట్లు తాజా శాటిలైట్ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి.
యుద్ధం ప్రారంభమైన తొలి రోజుల్లోనే ఈ విధ్వంసం జరిగినట్లు అమెరికా రక్షణ శాఖ అధికారులు ఇప్పుడు ధృవీకరిస్తున్నారు. ఏఎన్-టీపీవై-2 రేడార్‌ను థాడ్ క్షిపణి బ్యాటరీగా వాడుతారు. శత్ర దేశ క్షిపణులు, డ్రోన్ల రాకలను ఈ రేడార్ పసికట్టి మిస్సైల్ వ్యవస్థకు సమాచారం ఇస్తుంది. అయితే జోర్డాన్, సౌదీ అరేబియా, యూఏఈ దేశాల్లో ఉన్న అమెరికా మిస్సైల్ ఇంటర్‌సెప్టార్ రేడార్ కేంద్రాలను ఇరాన్ ధ్వంసం చేసినట్లు శాటిలైట్ ఇమేజ్‌ల ద్వారా అంచనా వేస్తున్నారు.
సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్‌బేస్ వద్ద ఉన్న రేడార్ వ్యవస్తను ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. దీంతో పాటు యూఏఈలోని సదర్, రువాయిస్‌లో ఉన్న అమెరికా రేడార్లు కూడా ధ్వంసమైనట్లు శాటిలైట్ పిక్స్ ద్వారా భావిస్తున్నారు. టార్గెట్ దిశగా వస్తున్న బాలిస్టిక్ క్షిపణులను రేడార్లు పసికట్టడం వల్లే యాంటీ మిస్సైల్ వ్యవస్థ యాక్టివేట్ అవుతుంది.
ఈ రాడార్ ధ్వంసం కావడం అనేది అమెరికాకు కేవలం ఆర్థిక నష్టం మాత్రమే కాదు, వ్యూహాత్మకంగా పెద్ద షాక్. సుమారు 300 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 2,500 కోట్లు) విలువైన ఈ రాడార్, అమెరికా గర్వకారణంగా చెప్పుకునే ‘థాడ్’ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్‌లో అతి ముఖ్యమైన భాగం. శత్రువుల బాలిస్టిక్ క్షిపణులను అవి లక్ష్యాన్ని చేరుకోకముందే అంతరిక్షంలోనే గుర్తించి, వాటిని కూల్చివేయడంలో ఈ రాడార్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది అందుబాటులో లేకపోవడంతో గల్ఫ్ ప్రాంతంలో అమెరికా, దాని మిత్రదేశాల రక్షణ వలయంలో పెద్ద రంధ్రం పడినట్లయింది.
ఎఫ్‌డీడీ డిప్యూటీ డైరెక్టర్ ర్యాన్ బ్రాబ్స్ట్ అభిప్రాయం ప్రకారం, థాడ్ రాడార్‌ను దెబ్బతీయడం అనేది ఇరాన్ సాధించిన అతిపెద్ద సైనిక విజయం. ప్రస్తుతం అమెరికా సైన్యం వద్ద ఇలాంటి రాడార్లు కేవలం ఎనిమిది మాత్రమే ఉన్నాయని, వీటిని భర్తీ చేయడానికి అదనపు రాడార్లు లేకపోవడం అగ్రరాజ్యానికి పెద్ద సమస్యగా మారింది. రెండు యూఏఈ దగ్గర, ఒకటి సౌదీ అరేబియా వద్ద ఉన్నాయి. ఇక ఇరాన్‌కు సుమారు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న జోర్డాన్‌లోని సాల్టి ఎయిర్‌బేస్‌లో కూడా ఓ థాడ్ బ్యాటరీ ఉన్నది.
థాడ్ రేడార్ సిస్టమ్‌ను ఏఎన్-టీపీవై-2గా పిలుస్తారు. ఇది ట్రాన్స్‌పోర్టబుల్ రేడార్. రేథియాన్ కంపెనీ దీన్ని ఉత్పత్తి చేస్తున్నది. సుమారు 50 కోట్ల బిలియన్ల ఖరీదైన రేడార్ వ్యవస్థ అమెరికా వద్ద ఉన్నట్లు తెలుస్తోంది.ఈ గ్యాప్‌ను పూడ్చడం అంత తేలికైన పని కాదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పరిస్థితి విషమిస్తుండటంతో అమెరికా రక్షణ కేంద్రం పెంటాగాన్ అప్రమత్తమైంది. కొత్త రాడార్ల ఉత్పత్తిని యుద్ధ ప్రాతిపదికన వేగవంతం చేయాలని రక్షణ రంగ సంస్థలను ఆదేశించింది.
ఇప్పటికే ఖతార్‌లోని మరో రాడార్ స్టేషన్‌పై కూడా దాడులు జరిగినట్లు వార్తలు వస్తుండటంతో, గల్ఫ్ ప్రాంతంలో తమ ఆస్తులను కాపాడుకునేందుకు అమెరికా కొత్త వ్యూహాలను రచిస్తోంది. ఈ రాడార్ వ్యవస్థ పునరుద్ధరణకు చాలా సమయం పట్టే అవకాశం ఉండటంతో, అప్పటివరకు ఇరాన్ క్షిపణులను అడ్డుకోవడం అమెరికాకు పెను సవాలుగా మారనుంది.

More Stories
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ ఇక లేనట్టే!
ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రసారాలకు బాంగ్లాదేశ్ గ్రీన్ సిగ్నల్
ఫైళ్లకే పరిమితమైన ప్రాజెక్టులను పట్టాలెక్కించాం