యుద్ధంలో అమెరికాకు గంటకు రూ 375 కోట్ల ఖర్చు

యుద్ధంలో అమెరికాకు గంటకు రూ 375 కోట్ల ఖర్చు
ఇరాన్‌పై అమెరికా ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీ మొదలుపెట్టి గురువారానికి(మార్చి 5) 100 గంటలు పూర్తయింది. అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్‌ డాటాను ఉటంకిస్తూ ఇరాన్‌-కాస్ట్‌-టిక్కర్‌. కాం తెలిపిన వివరాల ప్రకారం మార్చి 6వ తేదీ నాటికి ప్రస్తుత యుద్ధం ఖర్చు 500 కోట్ల డాలర్లు(రూ. 45,000 కోట్లు). గత శనివారం ప్రారంభమైన యుద్ధం కోసం రోజుకు సగటున 100 కోట్ల డాలర్లను (రూ. 9,000 కోట్లు) అమెరికా ఖర్చు చేసినట్లు యుద్ధ వార్‌ కాస్ట్‌ ట్రాకర్‌ ప్లాట్‌ఫామ్‌ వెల్లడించింది. 
 
దీన్ని బట్టి సెకన్‌కు 11,574 డాలర్టు(రూ. 10.41 లక్షలు), గంటకు 1,16,66,667 డాలర్లు(రూ. 375 కోట్లు) అమెరికా ఖర్చు చేస్తున్నట్లు అర్థం చేసుకోవాలి. యుద్ధం కొనసాగితే వారానికి 300 కోట్ల డాలర్లను ప్రభుత్వ ఖజానా నష్టపోవలసి వస్తుందని ఇజ్రాయెల్‌ ఆర్థిక శాఖ వెల్లడించినట్లు టైమ్స్‌ ఆఫ్‌ ఇజ్రాయెల్‌ తెలిపింది.

అమెరికాలోని వాషింగ్టన్‌కు చెందిన సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (సీఎస్ఐఎస్) అనే సంస్థ నివేదిక ప్రకారం యుద్ధం మొదలైన మొదటి 100 గంటల్లోనే అమెరికా 3.7 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. అలాగే ఈ వారం రోజులపాటు సగటున రోజుకు 900 మిలియన్ డాలర్లు ఖర్చైంది. అంటే మన కరెన్సీలో రోజుకు రూ.8,300 కోట్ల వరకు ఖర్చవుతుంది.

అల్‌జజీరా కథనం మేరకు అమెరికా, ఇజ్రాయెల్‌ కలసి సంయుక్తంగా ఇరాన్‌పై రెండు సార్లు(2025 జూన్‌లో ఒకసారి, 2026 ఫిబ్రవరిలో మరోసారి) దాడులు చేశాయి. ఇందుకోసం అమెరికా ప్రభుత్వం దాదాపు 3,37,700 కోట్ల డాలర్లు(రూ. 3.03 లక్షల కోట్లు) ఖర్చు పెట్టింది. శత్రు దేశాల క్షిపణి దాడులను అడ్డుకునే ఇజ్రాయెల్‌ ఐరన్‌ డోమ్‌ క్షిపణి ప్రయోగించిన ప్రతిసారీ దాదాపు 40,000 డాలర్ల నుంచి 50,000 డాలర్లు ఖర్చు అవుతుందని అంచనా. 
 
భారీ దాడుల సమయంలో దీని నిర్వహణ వ్యయం లక్ష డాలర్ల నుంచి లక్షన్నర డాలర్ల వరకు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీ మొదటి 24 గంటల్లోనే దాదాపు 77.9 కోట్ల డాలర్లు(రూ. 7,011 కోట్లు) అమెరికా ఖర్చు చేసినట్లు తుర్కియేకు చెందిన వార్తాసంస్థ అనదోలు వెల్లడించింది. ఇరాన్‌పై దాడి చేయడానికి ముందు అమెరికా తన సైనిక సంపత్తిని ఇరాన్‌ చుట్టూ మోహరించింది. ఈ సన్నాహక దశ కోసం భారీ మూల్యాన్నే అమెరికా చెల్లించవలసి వచ్చింది.

ఇరాన్‌ చుట్టూ యుద్ధ విమానాలను మోహరించడానికి అమెరికా ప్రభుత్వానికి అదనంగా రూ. 5,670 కోట్లు ఖర్చు అయి ఉంటుందని అల్‌జజీరా అంచనా వేసింది. యుద్ధం మొదలు కావడానికి ముందు భూమి, ఆకాశం, సముద్రంపైన సైనిక బలగాలను మోహరించడానికి అమెరికాకు రోజువారీ నిర్వహణ ఖర్చు 65 లక్షల డాలర్లు(రూ.58.5 కోట్లు)గా సెంటర్‌ ఫర్‌ న్యూ అమెరికన్‌ సెక్యూరిటీస్‌ ఎస్టిమేషన్‌ని ఉటంకిస్తూ టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది.

ఇరాన్‌ చవకైన డ్రోన్లను అడ్డుకునేందుకు అమెరికా ఖరీదైన క్షిపణులను ప్రయోగిస్తున్నది. యుద్ధం ప్రారంభమైన తొలి నాలుగు రోజుల్లో ఇరాన్‌ దాదాపు 2,000 డ్రోన్లను ఇజ్రాయెల్‌పై ప్రయోగించినట్లు అమెరికా తెలిపింది. షహీద్‌ వంటి రూ.18 లక్షలు ఖరీదైన ఇరాన్‌ డ్రోన్‌ను కూల్చివేసేందుకు అమెరికా రూ.36 కోట్లు విలువైన పాట్రియాట్‌ పీఏసీ-3 క్షిపణిని ఉపయోగిస్తున్నదని బిటిన్నింగ్‌ ఎడ్యుకేషనల్‌ ప్లాట్‌ఫామ్‌ సహ వ్యవస్థాపకుడు కషీఫ్‌ పేర్కొన్నారు.

ఇప్పటికే వాడిన ఆయుధాల స్థానంలో కొత్తవి రూపొందించేందుకు భారీగా ఖర్చవుతుంది. అదనంగా 3.1 బిలియన్ డాలర్లు అవసరం. రోజుకు 758 మిలియన్ డాలర్ల విలువైన ఆయుధాల్ని యుద్ధంలో వినియోగిస్తున్నారు. ఫైటర్ విమానాల కోసం కూడా భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.  నాలుగు రోజుల్లోనే పెద్ద మొత్తంలో మిలిటరీ ఎక్విప్‌మెంట్‌ను కోల్పోయింది. వ్యూహాత్మకంగా దాడులు చేస్తున్న ఇరాన్‌ తన సమీప దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటున్నది.

ఈ క్రమంలో ఈ నాలుగు రోజుల వ్యవధిలోనే సుమారు 200 కోట్ల డాలర్ల విలువైన మిలిటరీ ఎక్విప్‌మెంట్‌ ఇరాన్‌ దాడుల్లో నాశనమైందని అంచనా వేస్తున్నారు.  ఖతార్‌లోని అల్‌ ఉదేయిద్‌ ఎయిర్‌ బేస్‌ వద్ద అమెరికా ఒక ముందస్తు హెచ్చరిక రాడార్‌ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రంలోని ఏఎన్‌/ఎఫ్‌పీఎస్‌–132 ఎర్లీ వార్నింగ్‌ రాడార్‌ వ్యవస్థపై ఇరాన్‌ క్షిపణి దాడి చేసిందని ఖతార్‌ అధికారులు ధృవీకరించారు. ఈ రాడార్‌ విలువ సుమారు 1.1 బిలియన్‌ డాలర్లుగా అంచనా వేస్తున్నారు.

ఆదివారం కువైట్‌ వైమానిక రక్షణ వ్యవస్థ పొరపాటున అమెరికాకు చెందిన మూడుs ఎఫ్‌–15 స్ట్రైక్‌ ఈగిల్‌ యుద్ధ విమానాలను కూల్చేసినట్టు వార్తలు వచ్చాయి. ఈ ఘటనలో ఆరుగురు పైలట్లు ప్రాణాలతో బయటపడగలిగారు. ఈ మూడు విమానాలు  సుమారు 282 మిలియన్‌ డాలర్లు ఉంటాయని అంచనా. 

బహ్రెయిన్‌లో అమెరికా నేవీ బేస్‌పై దాడి మరో దాడిలో బహ్రెయిన్‌ రాజధాని మనామాలోని అమెరికా నేవీకి చెందిన యునైటెడ్‌ స్టేట్స్‌ ఫిఫ్త్‌ ఫ్లీట్‌ ప్రధాన కార్యాలయాన్నిలక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తున్నది. ఈ దాడిలో రెండు కమ్యూనికేషన్‌ టెర్మినల్స్‌, పలు భారీ భవంతులు ధ్వంసం అయ్యాయని సమాచారం. వీటిని ఏఎన్‌/జీఎస్‌సీ–52బీ సాట్‌కామ్‌ టెర్మినల్స్‌గా గుర్తించారు. 

ఈ ఖర్చు రక్షణ శాఖకు కేటాయించిన బడ్జెట్‌కు అదనం కావడంతో కోసం అమెరికా రక్షణ శాఖ మళ్లీ నిధుల కోసం అమెరికన్ కాంగ్రెస్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఇప్పటికే అమెరికా ప్రజల్లో ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, చమురు ధరల పెరుగుదల, జీవన వ్యయం పెరగడం వంటి వాటిపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ పరిణామాలు ట్రంప్‌కు రాజకీయంగా ఇబ్బందిగా మారొచ్చనేది విశ్లేషకుల అంచనా.

ఒకవేళ యుద్ధం ముగిసినా శాంతి పరిరక్షణ కార్యకలాపాలు, పునర్నిర్మాణ చర్యలు, యుద్ధంలో గాయపడిన సైనికుల సంరక్షణ వంటి దీర్ఘకాలిక ఒప్పందాల కారణంగా ఒక్కోసారి దశాబ్దాల పాటు వ్యయాన్ని ప్రభుత్వాలు భరించాల్సి ఉంటుంది.