రెండు దశాబ్దాల క్రితం జరిగిన జర్నలిస్టు రామ్ చందర్ ఛత్రపతి హత్య కేసులో జీవితకాల జైలుశిక్ష అనుభవిస్తున్న డేరా బాబాగా పేరొందిన డేరా సచ్చా సౌదీ చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ పంజాబ్- హర్యానా హైకోర్టు శనివారం తీర్పునిచ్చింది. ఈ కేసులో గతంలో కింది కోర్టు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను హైకోర్టు రద్దు చేసింది. రామ్ రహీమ్ తరపు న్యాయవాది జితేందర్ ఖురానా ఈ విషయాన్ని వెల్లడించారు.
2002 లో హర్యానాకు చెందిన జర్నలిస్టు రామ్ చందర్ ఛత్రపతిపై కాల్పులు జరగడం, ఆపై చికిత్స పొందుతూ ఆయన మరణించడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. డేరా ఆశ్రమంలో జరిగే అకృత్యాలను వెలుగులోకి తెచ్చినందుకే ఆయనను హత్య చేశారనే ఆరోపణలు నాడు వెల్లువెత్తాయి. ఈ కేసును సుదీర్ఘంగా విచారించిన సిబిఐ ప్రత్యేక కోర్టు, 2019లో గుర్మీత్ రామ్ రహీమ్ సహా మరో ముగ్గురిని దోషులుగా నిర్ధారిస్తూ, యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
అయితే ఈ తీర్పును సవాలు చేస్తూ, డేరా బాబా హైకోర్టును ఆశ్రయించారు. ఈరోజు జరిగిన విచారణలో సాక్ష్యాధారాల లోపాలున్నాయని ధర్మాసనం పేర్కొంది. ఆరోపణలు నిరూపితం కాలేదని స్పష్టం చేస్తూ, కేసు నుంచి విముక్తి కల్పించింది. ఈ హత్య కేసులో నిర్దోషిగా విడుదలైనప్పటికీ, రామ్ రహీమ్ సింగ్ ప్రస్తుతానికి జైలులోనే కొనసాగనున్నారు. తన ఆశ్రమంలోని ఇద్దరు సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో 2017లో ఆయనకు 20 ఏళ్ల కారాగార శిక్ష విధించారు.
ప్రస్తుతం ఆయన హర్యానాలోని రోహ్తక్ జిల్లా సునారియా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. కాగా రామ్ రహీమ్ సింగ్‌కు హర్యానా ప్రభుత్వం పదే పదే పెరోల్ మంజూరు చేయడంపై గత కొంతకాలంగా తీవ్ర విమర్శలు వ్యుక్తమవుతున్నాయి. ఎన్నికల సమయంలోనే ఆయనకు పెరోల్ లభించడం వెనుక రాజకీయ ప్రయోజనాలున్నాయని ప్రతిపక్షాలు, సిక్కు మత సంస్థలు ఆరోపించాయి.
తాజా తీర్పుతో డేరా బాబా అనుచరులు హర్షం వ్యక్తం చేస్తుండగా, జర్నలిస్టు ఛత్రపతి కుటుంబ సభ్యులు మాత్రం తీవ్ర నిరాశకు లోనయ్యారు. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ, సుప్రీం కోర్టును ఆశ్రయించే యోచనలో వారు ఉన్నట్లు తెలుస్తుంది.

More Stories
అమెరికా దాడికి ముందే ఇరాన్ యుద్ధనౌకకు భారత్ ఆశ్రయం
సివిల్స్ 2025లో టాపర్గా డాక్టర్ అనూజ్ అగ్నిహోత్రి
కర్ణాటకలో పిల్లల సోషల్ మీడియా వాడకంపై నిషేధం