మరో 10 రోజులు యుద్ధం కొనసాగితే అమెరికాకు ఇబ్బందులే?

మరో 10 రోజులు యుద్ధం కొనసాగితే అమెరికాకు ఇబ్బందులే?

ఇరాన్‌పై దాడులు మరో 10 రోజులకుపైగా కొనసాగితే అమెరికా మిస్సైళ్ల నిల్వలు తగ్గిపోయే అవకాశం ఉంటుందని పెంటగాన్‌ సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారంటూ అంతర్జాతీయ మీడియా ఒకటి తెలిపింది. అమెరికా ఇప్పటికే టోమాహాక్‌ ల్యాండ్‌ ఎటాక్‌ మిస్సైళ్లు, గగనతల రక్షణ వ్యవస్థల్లో వినియోగించే ఎస్‌ఎం-3 ఇంటర్‌సెప్టర్ల కొరతను ఎదుర్కొంటోందని ఆ అధికారి చెప్పారని కథనంలో పేర్కొంది.

ఇదే సమయంలో ఇరాన్‌పై ట్రంప్ సైనిక చర్యను పరిమితం చేసే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధ అధికారాలను కట్టడి చేయాలనే తీర్మానాన్ని అమెరికా సెనేట్ తిరస్కరించింది. దీనికి వ్యతిరేకంగా 53, అనుకూలంగా 47 ఓట్లు పడ్డాయి. అయితే, యుద్ధం కొన్ని వారాల కంటే ఎక్కువ కాలం కొనసాగితే భవిష్యత్తులో యుద్ధ అధికారాల తీర్మానానికి మద్దతు ఇవ్వడానికి మరి కొంతమంది సెనేటర్లు మొగ్గు చూపవచ్చని భావిస్తున్నారు. 

రాబోయే 24 గంటల్లో ఇరాన్‌పై దాడులకు అమెరికా పెద్ద సంఖ్యలో మిస్సైళ్లు, ఇంటర్‌సెప్టర్లను వినియోగించే అవకాశం ఉందని, దీంతో అమెరికా సైన్యం వద్దనున్న ఆయుధ నిల్వలు ఒక్కసారిగా తగ్గిపోతాయని అధికారి తెలిపారు.  అమెరికా ఇప్పటికే టోమాహాక్ ల్యాండ్ ఎటాక్ మిస్సైళ్లు, గగనతల రక్షణ వ్యవస్థల్లో వినియోగించే ఎస్ఎం-3 ఇంటర్‌సెప్టర్ల కొరతను ఎదుర్కొంటోందని ఆ అధికారి చెప్పారని కథనంలో సదరు మీడియా పేర్కొంది

యుద్ధ నౌకల నుంచి ప్రయోగించే ఇంటర్‌సెప్టర్ల కొరతను కూడా అమెరికా ఎదుర్కొంటోందని పేర్కొంది. అత్యంత కచ్చితత్వంతో భూతల లక్ష్యాలపై దాడులు చేసేందుకు వినియోగించే జాయింట్ డైరెక్ట్ ఎటాక్ మ్యూనిషన్స్ (జేడీఏఎం) వంటి ఆయుధాల కొరతను కూడా అమెరికా ఎదుర్కొనే అవకాశం ఉందని విశ్లేషించింది. వాస్తవానికి ఈ ఆయుధాలు, గగనతల రక్షణ వ్యవస్థలను స్వల్పకాలిక యుద్ధ అవసరాల కోసమే డిజైన్ చేశారని, దీర్ఘకాలిక యుద్ధాలకు ఇవి ప్రభావవంతంగా ఉపయోగపడవని రక్షణరంగ నిపుణులు చెబుతున్నారు.

‘‘అమెరికా తయారు చేస్తున్న ఇంటర్‌సెప్టర్ల సంఖ్య కంటే, ఇరాన్ తయారుచేస్తున్న మిస్సైళ్ల సంఖ్యే ఎక్కువగా ఉంది. ఇరాన్ ప్రతినెలా 100కుపైగా మిస్సైళ్లను తయారు చేస్తోంది. కానీ ప్రతినెలా కేవలం ఆరు నుంచి ఏడు ఇంటర్ సెప్టర్లు మాత్రమే తయారవుతాయి’’ అని ఇటీవలే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పేర్కొనడం గమనార్హం.

ఆయుధ ఉత్పత్తిని వేగవంతం చేయాలని భావిస్తున్న డోనాల్డ్‌ ట్రంప్‌ శుక్రవారం ముఖ్యమైన రక్షణ కాంట్రాక్టర్లతో శ్వేతసౌధంలో సమావేశం కాబోతున్నారు. లాక్‌హీడ్‌ మార్టిన్‌, రేథియాన్‌ పేరెంట్‌ వంటి ప్రముఖ కంపెనీలు, ఆయుధ సరఫరాదారులు ఈ భేటీకి హాజరవుతారని సమాచారం.. చర్చలు అధికారికంగా కాకుండా ప్రయివేటుగా జరుగుతున్నందున పేర్లు వెల్లడించడానికి అధికారులు నిరాకరించారు. 

ఇరాన్‌ ఆపరేషన్‌ ఎక్కువగా ఆయుధాలపైనే ఆధారపడి ఉన్నందున వాటి నిల్వలను అత్యవసరంగా పెంచుకోవాలని ట్రంప్‌ ప్రభుత్వం భావిస్తోంది. గాజాలో ఇజ్రాయిల్‌ సైనిక చర్యల నేపథ్యంలో అమెరికా అనేక బిలియన్‌ డాలర్ల విలువ కలిగిన ఆయుధాలను నిల్వ చేసుకుంది. అయితే ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంలో ఇజ్రాయిల్‌ కంటే అమెరికాయే పెద్ద ఎత్తున క్షిపణులను ప్రయోగిస్తోంది. 

ఆయుధ నిల్వలు అడుగంటుతుండడంతో తయారీ మార్కెట్లపై ఒత్తిడి తెచ్చి, ఉత్పత్తిని పెంచేలా చేయడమే ఈ సమావేశం ఉద్దేశంగా కనిపిస్తుంది. ఇటీవల జరిగిన ఘర్షణలలో ఉపయోగించిన ఆయుధాల స్థానంలో కొత్త వాటిని సమకూర్చుకునేందుకు యాభై మిలియన్‌ డాలర్లు కేటాయించాలని రక్షణ శాఖ సహాయ మంత్రి స్టీవ్‌ ఫెయిన్‌బర్గ్‌ కోరుతున్నారు.

ఒకవేళ ట్రంప్ చెప్పినట్టుగా ఇరాన్‌తో సైనిక ఘర్షణ నాలుగైదు వారాల పాటు కొనసాగితే, అమెరికా యుద్ధం మొత్తం ఖర్చు రూ.19.37 లక్షల కోట్లకు చేరుతుందని అమెరికా రక్షణ రంగ అధ్యయన సంస్థ పెన్ వార్టన్ బడ్జెట్ మోడల్‌కు చెందిన నిపుణుడు కెంట్ స్మెట్టర్స్ తెలిపారు. 2023 అక్టోబరు 7 నుంచి ఇప్పటివరకు ఇజ్రాయెల్‌కు రూ.2 లక్షల కోట్ల సైనిక సహాయాన్ని అమెరికా అందించింది. ఈ వ్యవధిలో యెమన్, ఇరాన్ దాడుల నుంచి ఇజ్రాయెల్‌ను కాపాడటానికి అమెరికా సొంతంగా దాదాపు రూ.1 లక్ష కోట్ల సైనిక వ్యయాన్ని చేసింది. అంటే గత రెండున్నర ఏళ్లలో ఇజ్రాయెల్ రక్షణ కోసం అమెరికా దాదాపు రూ.3 లక్షల కోట్ల దాకా ఖర్చు పెట్టింది.