అసోంలో భారత వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానం సుఖోయ్ ఎస్‌యూ- 30 ఫైటర్ జెట్ గాల్లో ఎగురుతుండగా గురువారం సాయంత్రం రాడార్‌తో సంబంధాలు తెగిపోయినట్టు భారత వాయు సేన అధికారులు వెల్లడించారు. దీనిని గుర్తించేందుకు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు తెలిపారు. ఇందుకోసం వైమానిక దళం రంగంలోకి దిగింది. ఈ విమానం మారుమూల పర్వత ప్రాంతంలో కూలిపోయినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై వైమానిక దళం ఎక్స్ (ట్విట్టర్)లో స్పందించింది. విమానం ఆచూకీ గల్లంతయ్యిందని, గాలింపు కొనసాగుతుందని తెలిపింది. కర్బీ అంగలాంగ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. జోర్హాట్ నుంచి బయలుదేరిన ఈ జెట్ చోకిహోలా కింద ఉన్న నిలిప్ బ్లాక్ సమీపంలో కూలిపోయి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఈ సంఘటన సాయంత్రం 7.42 గంటల ప్రాంతంలో జరిగిందని భావిస్తున్నారు.
స్థానికుల ప్రకారం సాయంత్రం అయిన కొద్దిసేపటికే ఎత్తైన కొండ నుంచి శక్తివంతమైన పేలుడు లాంటి శబ్దం వినిపించింది. ఆ శబ్దం చాలా పెద్దగా ఉందని, కొండల మీదుగా ప్రతిధ్వనించడంతో భయభ్రాంతులకు గురైనట్టు చెప్పారు. పేలుడు శబ్దం విన్న తర్వాత తాము ఇళ్ల నుంచి బయటకు వచ్చి, విమానం కూలిపోయి ఉంటుందని భయపడ్డామని తెలిపారు. విమానం కూలిపోయినట్టు శబ్దం వచ్చిన కొండ ప్రాంతం నుంచి పొగలు రావడం చూశామని కొందరు చెబుతున్నారు.
అయితే, విమానం కూలిపోయినట్టు అనుమానిస్తున్న ప్రదేశం రిమోట్ ఏరియా కావడంతో చేరుకోవడానికి తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. అందులోని పైలట్ సురక్షితంగా ఉన్నారా? లేదా? అనేది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా, 1980లలో రష్యా అభివృద్ధి చేసిన సుఖోయ్ 30 ఎంకేఐ విమానాలు భారత వైమానిక దళానికి వెన్నెముకగా ఉన్నాయి. ఎస్ యు-30 ఎంకెఐ స్క్వాడ్రన్లను ఈశాన్య ప్రాంతంలో భారత వాయుసేన మోహరించింది. ఎస్‌యూ 30sల తొలి డెలివరీ 1997లో రష్యా అందజేసింది. ప్రస్తుతం వీటిని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఉత్పత్తి చేస్తోంది. భారత వైమానిక దళం వద్ద 250కిపైగా ఫైటర్ జెట్లు ఉన్నాయి.

More Stories
2000 కిలోమీటర్ల రేంజ్ ఖొర్రమ్‌షార్ క్షిపణి ప్రయోగించిన ఇరాన్
వాట్సప్‌చాట్‌ల్లో క్రూరత్వం ఆధారంగా విడాకులు ఇవ్వలేం
టీమిండియా అంతర్జాతీయ మ్యాచ్‌ల షెడ్యూల్