కర్ణాటకలో పిల్లల సోషల్ మీడియా వాడకంపై నిషేధం

కర్ణాటకలో పిల్లల సోషల్ మీడియా వాడకంపై నిషేధం
కర్ణాటకలోని 16 ఏళ్లలోపు పిల్లల సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధిస్తున్నట్టు ముఖ్యమంత్రి సిద్దరామయ్య వెల్లడించారు. పిల్లలు మొబైల్ ఫోన్ వ్యసనం బారినపడకుండా అడ్డుకోవడానికే ఈ ముందుజాగ్రత్త చర్యను చేపడుతున్నట్లు తెలిపారు. శుక్రవారం ఉదయం కర్ణాటక విధాన సౌధలో 2026-2027 ఆర్థిక సంవత్సరానికి రూ.4.48 లక్షల కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ, కేంద్ర ప్రభుత్వం కర్ణాటకకు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. 

భారత రాజ్యాంగం నిర్దేశించిన సమాఖ్య వ్యవస్థను కేంద్ర సర్కారు పాటించడం లేదని పేర్కొంటూ విభిన్న సంస్కృతులకు నెలవైన భారతదేశం వికాస పథంలో పయనించాలంటే సహకార సమాఖ్య వ్యవస్థను పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. కర్ణాటక ప్రభుత్వ డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.  11జీ మోడల్ ఎకానమీ అనే వైవిధ్యమైన, బలమైన, సుస్థిర అభివృద్ధి నమూనాను కర్ణాటక రాష్ట్ర సర్కారు తయారు చేసిందని ఆయన తెలిపారు.

వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న 56,432 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే ప్రక్రియను ఈ ఏడాది మొదలుపెట్టామని వెల్లడించారు. సిద్ధరామయ్య రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇది 17వ సారి. కర్ణాటకలో ఎక్కువసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నేతగా ఆయన రికార్డును సొంతం చేసుకున్నారు.  ఇక భారతదేశంలో ఎక్కువసార్లు రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నేతల జాబితాలో రెండో స్థానంలో నిలిచారు.

భారతదేశం పురోగతిని సాధిస్తున్న అన్ని రంగాల్లోనూ మెజారిటీ వాటాను కర్ణాటక అందిస్తోందని సీఎం సిద్ధరామయ్య తెలిపారు.  కేంద్ర ప్రభుత్వానికి అత్యధిక పన్ను ఆదాయాన్ని కూడా తమ రాష్ట్రమే అందిస్తోందని, అయినా కర్ణాటక సంక్షేమాన్ని, వికాసాన్ని కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తోందని విమర్శించారు.  15వ ఆర్థిక సంఘం తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వ ఆదాయ పంపిణీ ఫార్ములా అన్యాయంగా ఉందని, దీనివల్ల రాష్ట్రానికి ప్రత్యేక గ్రాంట్లు రావడం లేదని ధ్వజమెత్తారు. 

కేంద్ర ప్రభుత్వం అకస్మాత్తుగా జీఎస్‌టీ రేట్లను హేతుబద్ధీకరించడంతో రాష్ట్ర ఆదాయం ఒక్కసారిగా తగ్గిపోయిందని సీఎం తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కర్ణాటక జీఎస్‌టీ వసూళ్లు ఏకంగా రూ.10వేల కోట్లు తగ్గిపోయాయని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇవి రూ.15వేల కోట్ల దాకా తగ్గిపోతాయని వెల్లడించారు.  ఈ ఒడిదుడుకులు ఎదురైనా, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ సమీకరణ వ్యవస్థ బలంగా ఉండటం వల్ల ఖజానాపై పెద్దగా ప్రభావం పడలేదని స్పష్టం చేశారు.

బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రి పేరు శాంతవేరి గోపాలగౌడగా మార్పు, ఆవులు కొనడానికి రూ.40 వేల ప్రోత్సాహకం, వైష్ణోదేవి యాత్రికులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి రూ.5వేల సాయం, బౌద్ధ సన్యాసులకు నెలకు రూ.6వేల జీతం, జైన్, బౌద్ధ, సిక్కు వర్గాల అభివృద్ధికి రూ.100 కోట్ల గ్రాంట్ వంటి పలు నిర్ణయాలు ప్రకటించారు.