హార్ముజ్‌ లో భారత్ నౌకలకు, రష్యా దిగుమతులకు మార్గం

హార్ముజ్‌ లో భారత్ నౌకలకు, రష్యా దిగుమతులకు మార్గం
 
పశ్చిమాసియాలో ఇరాన్‌ కు, ఇజ్రాయెల్‌ -అమెరికా బలగాలకు మధ్య  దాడులు, ప్రతిదాడులతో మధ్యప్రాచ్యం దద్దరిల్లుతున్న సమయంలో ముడి చమురు దిగుమతులకు గల అడ్డంకులు భారత్ కు దాదాపుగా తొలిగిపోయాయి. ఒక వంక హార్ముజ్‌ జలసంధిలో భారత నౌకలపై ఆంక్షలు లేవని ఇరాన్ స్పష్టం చేయగా, మరో వంక 30 రోజుల పాటు రష్యా ఉంది చమురు దిగుమతులకు అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
 
భారతదేశానికి పెద్ద ఉపశమనం కలిగించేలా, అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ శుక్రవారం ట్రెజరీ డిపార్ట్‌మెంట్ తాత్కాలికంగా 30 రోజుల మినహాయింపు జారీ చేసినట్లు ప్రకటించారు. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచ ఇంధన మార్కెట్లను స్థిరీకరించడానికి ప్రయత్నిస్తున్నందున అమెరికా నుండి ఈ చర్య వచ్చింది.
 
భారతదేశం అమెరికాకు ముఖ్యమైన భాగస్వామి అని, న్యూఢిల్లీ అమెరికా చమురు కొనుగోళ్లను పెంచుతుందని తాము పూర్తిగా అంచనా వేస్తున్నామని. ఈ తాత్కాలిక చర్య ప్రపంచ ఇంధనాన్ని కట్టడి చేసేందుకు ఇరాన్ చేసిన ప్రయత్నం వల్ల కలిగే ఒత్తిడిని తగ్గిస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు.  “ప్రపంచ మార్కెట్లోకి చమురు ప్రవహించేలా చేయడానికి, భారత రిఫైనర్లు రష్యన్ చమురును కొనుగోలు చేయడానికి ట్రెజరీ డిపార్ట్‌మెంట్ తాత్కాలికంగా 30 రోజుల మినహాయింపును జారీ చేస్తోంది. భారతదేశం అమెరికాకు ముఖ్యమైన భాగస్వామి” అని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ ఎక్స్ లో ఒక పోస్ట్‌లో తెలిపారు.

ప్రపంచంలో ఇంధన సరఫరాకు జీవానాడి లాంటి హార్ముజ్‌ జలసంధిని మూసివేస్తూ,   శత్రుదేశాల నౌకలు ప్రపంచ చమురు వాణిజ్యానికి కీలకమైన షిప్పింగ్ మార్గమైన హార్ముజ్‌ జలసంధిని దాటేందుకు ప్రయత్నిస్తే పేల్చేస్తామని ఇప్పటికే ఇరాన్‌ హెచ్చరించింది. అంతకుముందే అమెరికాకు అనుకూలంగా ఉండే పలావు దేశానికి చెందిన జెండాతో వెళ్తున్న ఓ చమురు నౌకపై ఇరాన్ దాడి చేసింది.  ఆ నౌకలో 15 మంది భారతీయులు, నలుగురు ఇరానీలు ఉండగా ఇద్దరు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. పలువురికి గాయాలయ్యాయి. 

ఇరాన్‌ హెచ్చరికలు, దాడుల నేపథ్యంలో పలు చమురు నౌకలు అనుమతి కోసం హార్ముజ్‌ జలసంధికి రెండు వైపుల నిలిచిపోయాయి. ఈ క్రమంలో ఇరాన్‌ చైనా చమురు నౌకలు హార్ముజ్‌ జలసంధి గుండా వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నట్లు బుధవారం ప్రకటించింది.  యుద్ధం మొదలైనప్పటి నుంచి చైనా తమకు అనుకూలంగా ఉన్నందున తాము ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.

ఈ క్రమంలో గురువారం భారత చమురు నౌకలకు హార్ముజ్‌ జలసంధిని దాటేందుకు ఇరాన్‌ అనుమతి ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే అక్కడ వేచి ఉన్న 37 భారత నౌకలు, 1109 మంది నావికులు జలసంధిని దాటే అవకాశం లభించినట్లవుతుంది.   కాగా, హార్ముజ్ జలసంధిని అమెరికా, ఇజ్రాయెల్, ఐరోపా, ఇతర పాశ్చాత్య మిత్రదేశాల నౌకలకు మూసివేస్తున్నట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జిసి) ప్రకటించింది.

సంఘర్షణ సమయాల్లో ఇరాన్ మార్గాన్ని నియంత్రించడానికి అనుమతించే అంతర్జాతీయ చట్టాలను ఈ సందర్భంగా ఉటంకించింది.  ఇరాన్ హార్ముజ్ జలసంధి గుండా వెళ్ళకుండా భారత నౌకలను నిరోధించదని ఇది సూచిస్తుంది. ఈ పరిణామం ధృవీకరించబడితే, ఈ పరిణామం న్యూఢిల్లీకి గణనీయమైన ఉపశమనం కలిగించవచ్చు.