ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ పోరులో భారత్ గెలిచింది. ఇంగ్లండ్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో టీమ్ ఇండియా 7 పరుగుల తేడాతో గెలుపొంది ప్రపంచకప్ ఫైనల్‌కు వరుసగా రెండోసారి దూసుకెళ్లింది. జాకబ్ బెథెల్ వీరోచిత సెంచరీ భారత్‌ను ఒక దశలో భయపెట్టినప్పటికీ, బూమ్రా- పాండ్యా 18, 19 ఓవర్లను సంయమనంతో వేయడంతో టీమిండియాకు విజయం దక్కింది.
దీంతో ఆదివారం అహ్మదాబాద్‌లో న్యూజిలాండ్‌తో జరగనున్న టైటిల్ పోరులో భారత్ తలపడనుంది. టాస్ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన భారతజట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 253పరుగుల భారీస్కోర్ నమోదు చేసినా.. టీమిండియాకు ఆషామాషీగా ఏం విజయం దక్కలేదు. ఇంగ్లండ్ ఓపెనర్ బేథెల్(105; 48బంతుల్లో 8ఫోర్లు, 7సిక్సర్లు) చివరి వరకు పోరాడుతూనే ఉన్నాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా.. బేథెల్ పోరాటం ఆగలేదు.
ఇంగ్లండ్ విజయానికి చివరి ఓవర్లో 30పరుగులు కావల్సిన దశలో బేథెల్ రనౌటవ్వడం, ఆ తర్వాత బంతికి ఒక్క పరుగే రావడంతో టీమిండియాకు విజయం ఖాయమైంది. కాని చివరి 3బంతులను జోఫ్రా ఆర్చర్ సిక్సర్లు కొట్టినా.. అప్పటికే టీమిండియాకు గెలుపు లాంచనమే అయ్యింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సంజు శాంసన్‌కు దక్కింది.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ కెప్టెన్ బట్లర్ నిర్ణయం బెడిసి కొట్టింది.
యువ ఓపెనర్ అభిషేక్ శర్మ(9) నిరాశపరిచినా.. వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ మరోసారి అదరగొట్టాడు. నిర్ణయాత్మక సూపర్-8 మ్యాచ్‌లో విండీస్‌పై అద్భుత ఇన్నింగ్స్ ఆడి టీమిండియాను సెమీస్‌కు చేర్చడంలో కీలకపాత్ర పోషించిన సంజు.. ఇంగ్లండ్ బౌలర్లకూ చుక్కలు చూపించాడు. కేవలం 42బంతుల్లోనే 8ఫోర్లు, 7భారీ సిక్సర్లతో 89పరుగులు చేసి టీమిండియా భారీస్కోర్‌కు దోహదపడ్డాడు.
ఆ తర్వాత ఇషాన్ కిషన్ (39: 18బంతుల్లో 4ఫోర్లు, 2సిక్సర్లు)తో కలిసి శాంసన్ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు ఏకంగా 97 పరుగులు జోడించారు. శివమ్ దూబే 25 బంతుల్లో 4 సిక్సర్లతో 43 పరుగులు చేయగా.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 11 పరుగులకే వెనుదిరిగాడు. చివర్లో హార్దిక్ పాండ్యా, యువ సంచలనం తిలక్ వర్మ విధ్వంసం సృష్టించారు.
హార్దిక్ 12 బంతుల్లో 27 పరుగులు చేయగా, తిలక్ వర్మ కేవలం 7 బంతుల్లోనే 3 భారీ సిక్సర్లతో సహా 21 పరుగులతో రాణించాడు. జోఫ్రా ఆర్చర్‌కి తోడు విల్ జాక్స్, ఆదిల్ రషీద్ చెరో రెండు వికెట్లు తీశారు. దీంతో భారతజట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి ఏకంగా 253 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. టీమిండియా బౌలర్లు హార్దిక్ పాండ్యాకు రెండు, బుమ్రా, ఆర్ష్‌దీప్, అక్షర్, వరుణ్‌కి ఒక్కో వికెట్ దక్కాయి.

More Stories
బెంగాల్ గవర్నర్ .. తెలంగాణ గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా
ఎనిమిది వారాలకు ముడి చమురు, పెట్రోలియం నిల్వలు
ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్