బెంగాల్ గవర్నర్ .. తెలంగాణ గవర్నర్‌గా శివప్రతాప్‌ శుక్లా

బెంగాల్ గవర్నర్ .. తెలంగాణ గవర్నర్‌గా శివప్రతాప్‌ శుక్లా
 
* తెలంగాణ సహా 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ గవర్నర్లు మారారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ తన పదవికి రాజీనామా చేయగా, తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవిని అక్కడకు పంపారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్‌ వర్మను మహారాష్ట్ర గవర్నర్ గా బదిలీ చేయడంగా, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్  శివప్రతాప్‌ శుక్లాను తెలంగాణకు బదిలీ చేశారు. కేంద్రం తెలంగాణ సహా 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. 

ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వినయ్‌ కుమార్‌ సక్సేనాను లద్దాఖ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా నియమితులయ్యారు. కేరళ గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌ను తమిళనాడు గవర్నర్‌గా, లద్దాఖ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కవీందర్‌ గుప్తాను హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌గా నియమించారు. ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా తరణ్‌ జిత్‌ సంధూను నియమించారు. త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి జిష్ణుదేవ్‌ వర్మను 2024లో తెలంగాణ గవర్నర్‌గా నియమించిన విషయం తెలిసిందే. 

కాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన శివప్రతాప్‌ శుక్లా యుపిలో కల్యాణ్‌సింగ్, రామ్‌ప్రకాశ్‌ గుప్తా, రాజ్‌నాథ్‌ల ప్రభుత్వాల్లోనూ మంత్రిగా పని చేశారు. ప్రధాని మోదీ తొలి మంత్రివర్గంలో ఆర్థిక శాఖ సహాయమంత్రిగా పని చేశారు. 2023 నుంచి హిమాచల్‌ గవర్నర్‌గా ఉన్న శుక్లాను ఇప్పుడు తెలంగాణకు బదిలీ చేశారు.  నాగాలాండ్ గవర్నర్ గా నందకిశోర్ యాదవ్,  బిహార్ గవర్నర్ గా రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అతా హస్నైన్ లను నియమించారు.

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ మరికొద్ది రోజుల్లో వెలువడనున్న వేళ జరిగిన ఈ మార్పుపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. సీవీ ఆనంద్‌ బోస్‌ రాజీనామాపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన మమత.. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఒత్తిడి వల్లే ఆయన ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. 

అలాగే, తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవికి బెంగాల్‌ బాధ్యతలు అప్పగించినట్టు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా నుంచి తనకు సమాచారం అందిందని తెలిపారు. కానీ, ఆర్‌ఎన్‌ రవి నియామకం అంశంలో కేంద్రం తమతో సంప్రదింపులు జరపలేదని విమర్శించారు. కేంద్రం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని మమత మండిపడ్డారు. 

కాగా, 2022 నవంబరు 17న పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనంద్‌ బోస్‌ మూడున్నరేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. మరోపక్క, తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవికి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య కొంతకాలంగా దూరం పెరిగింది. గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించడం లేదంటూ తమిళనాడులోని అధికార పార్టీ వర్గాలు ఆరోపణలు చేస్తున్నాయి. 

“గవర్నర్ తొలగింపు, కొత్త గవర్నర్ నియామకంలో కేంద్ర మంత్రి నన్ను సంప్రదించలేదు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. సహకార విధానానికి కేంద్రం తగిన గౌరవం, ప్రాధాన్యం ఇవ్వాలి. రాష్ట్రాల గౌరవాన్ని కాపాడాలి’’ అని మమత వ్యాఖ్యానించారు. ఇక.. గవర్నర్‌గా రాజీనామా చేసిన సీవీ ఆనంద బోస్ పశ్చిమ బెంగాల్‌లో మూడున్నరేళ్లు సేవలందించారు.

తన రాజీనామా విషయంపై ప్రముఖ ఆంగ్ల మీడియాతో మాట్లాడిన ఆనంద బోస్, “అవును, నేను రాజీనామా చేశాను. బెంగాల్ గవర్నర్‌గా మూడున్నరేళ్లు పనిచేశాను. అంతే సరిపోతుంది అనిపించింది” అని చెప్పారు. అయితే ఆకస్మికంగా రాజీనామా చేయడానికి గల అసలు కారణాలేమిటన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. రాజకీయ ఒత్తిళ్లు ఏమైనా ఉన్నాయా? లేక వ్యక్తిగత కారణాల వల్లనా? అన్న అంశాలపై కూడా ఆయన స్పందించలేదు.

కాగా, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కవిందర్ గుప్తా కూడా గురువారం తన రాజీనామాను సమర్పించారు. గుప్తా ఈ ప్రాంతం మూడవ లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమితులయ్యారు. దాదాపు ఒక సంవత్సరం పాటు ఆ పదవిలో పనిచేశారు. జూలై 18, 2025న ఆయన ప్రమాణ స్వీకారం చేశారు.