ప్రముఖ జర్నలిస్ట్, మాజీ దౌత్యవేత్త, మాజీఎంపి హరికృష్ణన్ దువా (88) మరణించారు. మూడు వారాల క్రితం అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆయన బుధవారం మధ్యాహ్నం మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. హెచ్.కె.దువా 1937, జులై1న జన్మించారు. భారతీయ జర్నలిజంలో ఒక మహోన్నత వ్యక్తి అయిన దువా తన సంపాదకీయ స్వాతంత్ర్యం, పదునైన రాజకీయ అంతర్దృష్టికి విస్తృతంగా గౌరవించబడ్డారు.
తన కెరీర్‌లో భాగంగా హిందుస్థాన్ టైమ్స్ (1987-94), ఇండియన్ ఎక్స్‌ప్రెస్ (1994-96) ఎడిటర్ ఇన్ చీఫ్‌గా, టైమ్స్ ఆఫ్ ఇండియా (1997-98), ది ట్రిబ్యూన్ (2003-09) లకు ఎడిటోరియల్ అడ్వైజర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఇద్దరు ప్రధానులు వాజ్‌పేయి, హెఛ్.డి.దేవగౌడ్‌లకు మీడియా సలహాదారుగా వ్యవహరించారు. విదేశీ వ్యవహారాలు, జాతీయభద్రతపై చర్చల్లో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు.
డెన్మార్క్‌లో భారత రాయబారిగా (2001-2003) కూడా పనిచేశారు. జాతీయ భద్రతా సలహాబోర్డు సభ్యుడిగా ఉన్నారు. 2009లో, ఆయన రాజ్యసభకు నామినేట్ అయ్యారు, అక్కడ ఆయన మీడియా స్వేచ్ఛ, ప్రజా విధానంపై చర్చలకు దోహదపడ్డారు. విదేశీ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ, హోంమంత్రిత్వశాఖకు సంబంధించిన కన్సల్టేటివ్ కమిటీ సహా అనేక ఉన్నతస్థాయి పార్లమెంటరీకమిటీల్లో కూడా భాగస్వామిగా వ్యవహరించారు.
పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు, మీడియా ప్రముఖులు ఆయన మృతి పట్ల ఘనంగా నివాళులు అర్పించారు. దువాను సూత్రప్రాయమైన ఎడిటర్‌గా, ప్రజాస్వామ్య విలువల దృఢమైన రక్షకుడిగా గుర్తుచేసుకుంటూ సంతాపం తెలిపారు. పద్మభూషణ్‌తో పాటు పంజాబ్ యూనివర్శిటీ, కురుక్షేత్ర యూనివర్శిటీ డి.లిట్ (ఆనర్ )బిరుదును ప్రదానం చేశాయి. గురువారం లోధిరోడ్‌లోని శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.

More Stories
భారత చేరుకున్న ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్
సోషల్ మీడియాలో ఫేక్ కంటెంట్.. శ్రీనగర్ ఎంపీ, మాజీ మేయర్‌పై కేసు
క్రియాశీల రాజకీయాల్లోకి నితీష్ కుమారుడు నిశాంత్