మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధం ఇప్పుడు భారత ఇంధన రంగాన్ని తాకింది. ఇరాన్ డ్రోన్ దాడుల కారణంగా ఖతార్ తన ఎల్‌ఎన్‌జి ఉత్పత్తిని నిలిపివేయడంతో, భారత్‌కు అందాల్సిన గ్యాస్ సరఫరాలో భారీ అంతరాయం ఏర్పడింది. ఇరాన్ జరిపిన డ్రోన్ దాడుల వల్ల ఖతార్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద ఎగుమతి కేంద్రం దెబ్బతింది. దీంతో భద్రతా కారణాల దృష్ట్యా ఉత్పత్తిని నిలిపివేశారు.
దీంతో భారత దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 32 కోట్ల మంది ఎల్‌పిజి వినియోగదారులపై తీవ్ర ప్రభావం పడనుందని స్పష్టమవుతోంది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఎల్‌పిజి కొనుగోలుదారు అయిన భారత్, తన అవసరాల కోసం 90 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఇందులో అత్యధిక భాగం హార్ముజ్ జలసంధి గుండానే రావాల్సి ఉండటంతో, ప్రస్తుతం అక్కడ రవాణా నిలిచిపోవడం భారత ఇంధన భద్రతకు పెను సవాలుగా మారిందని బ్లూమ్‌బర్గ్ ఓ రిపోర్ట్‌లో వెల్లడించింది.
ప్రస్తుతం దేశంలో కేవలం 30 రోజులకు సరిపడా గ్యాస్ నిల్వలు మాత్రమే ఉన్నాయని ఓ అధికారి తెలిపారు. పారిశ్రామిక అవసరాలకు వాడే ఎల్‌ఎన్‌జి సరఫరాలో ఇప్పటికే 50 శాతం వరకు కోత విధించినట్లు తెలుస్తున్నది. యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధి గుండా నౌకల ప్రయాణం ప్రమాదకరంగా మారింది. దీంతో పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జి కి చెందిన నౌకలు ఖతార్ పోర్టులకు చేరుకోలేకపోతున్నాయి.
భారతదేశానికి గ్యాస్ సరఫరాలో దాదాపు 40 శాతం కోత పడింది. దీనివల్ల నగర గ్యాస్ పంపిణీ (సిజిడి) కంపెనీలు, భారీ పరిశ్రమలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. మరోవంక, కాంట్రాక్ట్ రేటు కంటే రెండింతలు ఎక్కువ ధరకు స్పాట్ మార్కెట్ నుండి గ్యాస్ కొనాల్సి రావడంతో, ఎల్‌ఎన్‌జి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇది వినియోగదారులను ఎలక్ట్రిక్ వాహనాల (ఈవి) వైపు మళ్లేలా చేయవచ్చు.
ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఒప్పంద బాధ్యతలను నెరవేర్చలేమని పేర్కొంటూ పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జి, ఖతార్ ఎనర్జీ పరస్పరం ‘ఫోర్స్ మేజర్’ నోటీసులు జారీ చేసుకున్నాయి. తమ ట్యాంకర్లయిన దిశా, రాహి, అసీమ్లను పంపడం సాధ్యం కాదని పెట్రోనెట్ స్పష్టం చేసింది. గ్యాస్ కొరత వల్ల ఎరువుల ఉత్పత్తి, విద్యుత్ కేంద్రాలు, రవాణా రంగంపై ఒత్తిడి పెరుగుతుంది. ప్రత్యామ్నాయ మార్గాల కోసం భారత్ ప్రయత్నిస్తున్నప్పటికీ, ఖతార్‌పై ఉన్న భారీ ఆధారపడటం ఇప్పుడు సవాలుగా మారింది.
More Stories
భారత్ కు మరో రెండు ఎల్పీజీ నౌకలు
మందగించిన ఆర్థిక సూచికల వృద్ధి
గల్ఫ్ యుద్ధంతో ఇంధన సంక్షోభంతో పాటు ఎరువుల సంక్షోభం