మార్చి 6 నుంచి 8 వరకు ఇంద్రకీలాద్రిపై ‘మహా కుంభాభిషేకం’

మార్చి 6 నుంచి 8 వరకు ఇంద్రకీలాద్రిపై ‘మహా కుంభాభిషేకం’

బెజవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఆలయంలో పన్నెండేళ్లకు (పుష్కర కాలం) ఒకసారి మాత్రమే వచ్చే అత్యంత అరుదైన, పవిత్రమైన క్రతువు ‘మహా కుంభాభిషేకం’ను ఆగమ శాస్త్రోక్తంగా ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు మూడు రోజుల పాటు కన్నుల పండువగా జరగనుంది. దైవిక శక్తిని తిరిగి మేల్కొలిపి, ఆలయానికి పునర్జీవం పోసే ఈ మహా కుంభాభిషేక వేడుకల కోసం ఇంద్రకీలాద్రి సర్వాంగ సుందరంగా సిద్ధమైంది.

మహా కుంభాభిషేకానికి హిందూ ధర్మంలో, ఆగమ శాస్త్రాల్లో ఎంతో విశిష్ఠత ఉంది. దేవాలయాల్లో ప్రతిష్ఠించిన మూలవిరాట్ (విగ్రహాలు) ఎంతో శక్తివంతమైనవి. అయితే నిత్యం జరిగే పూజలు, అభిషేకాలు, లక్షలాది మంది భక్తుల తాకిడి వల్ల కాలక్రమేణా ఆ విగ్రహాలు తమ దైవిక శక్తిని కొంతమేర కోల్పోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. 

సరిగ్గా 12 ఏళ్లకు ఒకసారి ఆ దైవిక శక్తిని, చైతన్యాన్ని తిరిగి విగ్రహాల్లోకి నింపే పవిత్ర ప్రక్రియే ఈ ‘కుంభాభిషేకం’. మన శరీరానికి ధ్యానం ఎంత అవసరమో, ప్రాణశక్తిని నిలపడానికి ఆలయానికి ఈ క్రతువు అంతే ప్రాణాధారం అని వేద పండితులు వివరిస్తున్నారు. ఈ మూడు రోజుల పాటు ఇంద్రకీలాద్రిపై యజ్ఞం చేయడం ద్వారా గాలిని శుద్ధి చేస్తారు. హోమం ద్వారా అగ్నిని పవిత్రం చేస్తారు. 

మంత్రోచ్ఛారణల ద్వారా ఆకాశాన్ని (శూన్యాన్ని) శుద్ధి చేస్తారు. ఇలా చేయడం వల్ల ఆలయ పరిసరాల్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి, సానుకూల శక్తి వెల్లివిరుస్తుంది. ఈ ఘట్టం ఈనెల 6వ తేదీ ఉదయం నుంచి అధికారికంగా ప్రారంభమవుతుంది. తొలిరోజు విఘ్నేశ్వరుడికి విశేష పూజలు చేస్తారు. అనంతరం పుణ్యాహవచనం, దీక్షాధారణ చేపడతారు. అంకురార్పణ, అగ్ని ప్రతిష్ఠాపనతో యజ్ఞశాల కార్యక్రమాలు శాస్త్రోక్తంగా మొదలవుతాయి.