సముద్ర మార్గాల్లో చిక్కుకుపోయిన 37 భారత నౌకలు

సముద్ర మార్గాల్లో చిక్కుకుపోయిన 37 భారత నౌకలు

పశ్చిమ ఆసియాలో అమెరికా, ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగడం, ప్రపంచ రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధి మూతపడటంతో అంతర్జాతీయ షిప్పింగ్ మార్గాల్లో రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పర్షియన్ గల్ఫ్, ఒమన్ గల్ఫ్ ప్రాంతాల్లో సుమారు 37 భారత నౌకలు నిలిచిపోయాయి. వీటిలో 1,109 మంది నావికులు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపారు.

వీటిలో కొన్ని నౌకలు ముడి చమురు,  ఎల్‌ఎన్‌జి ని భారతీయ ఓడరేవులకు రవాణా చేస్తున్నాయి. మరికొన్ని గల్ఫ్ దేశాల నుంచి పెట్రోలియం ఉత్పత్తులను తీసుకొచ్చేందుకు వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ ఆయా కంపెనీలతో క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతూ పరిస్థితిని సమీక్షిస్తోంది. 

భారతీయ నావికుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవల పశ్చిమాసియాలో తలెత్తిన ఘర్షణల కారణంగా ముగ్గురు భారతీయ నావికులు మరణించారు. భారత్ తన చమురు అవసరాల్లో ఎక్కువ భాగం గల్ఫ్ దేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది.  ఈ క్రమంలో పర్షియన్ గల్ఫ్, ఒమన్ గల్ఫ్ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన 37 నౌకల్లో అత్యధిక శాతం ముడి చమురును, ఎల్ఎన్జీని తీసుకొస్తున్నాయి. మరికొన్ని నౌకలు పెట్రోలియం ఉత్పత్తులను తీసుకురావడానికి గల్ఫ్ దేశాల వైపు వెళ్తుండగా మధ్యలోనే నిలిచిపోయాయి. 

ఈ నౌకల రాకపోకలు ఆగిపోవడం వల్ల రాబోయే రోజుల్లో దేశీయంగా ఇంధన ధరలపై ప్రభావం పడే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సముద్ర మార్గాల్లో తీవ్రతను గమనించిన కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. కేంద్ర షిప్పింగ్, ఓడరేవుల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. 

ఈ సమావేశంలో నౌకాయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో క్విక్ రెస్పాన్స్ టీమ్ను ఏర్పాటు చేశారు. ఇది వివిధ అథారిటీల మధ్య సమన్వయం చేస్తూ, నావికులు, వారి కుటుంబాలకు అవసరమైన సహాయాన్ని ఈ టీమ్ అందించనుంది.డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ (డీజీఎస్) నిరంతరం షిప్పింగ్ కంపెనీలతో టచ్‌లో ఉంటూ నౌకల కదలికలను ట్రాక్ చేస్తుంది. 

నావికుల కుటుంబాల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లను రిక్రూట్‌మెంట్ అండ్ ప్లేస్‌మెంట్ సర్వీస్ లైసెన్సీల (ఆర్పీఎల్ఎస్) అందుబాటులోకి తెచ్చారు. కేంద్రం నౌకాదళాన్ని కూడా అప్రమత్తం చేసింది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో భారత వాణిజ్య నౌకలకు రక్షణ కల్పించేందుకు ‘ఆపరేషన్ సంకల్ప్’ వంటి చర్యలను వేగవంతం చేసే ఆలోచనలో ఉంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్, గల్ఫ్ దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు.