సున్నీ, షియా ముస్లింల మధ్య ప్రధాన తేడాలేంటి?

సున్నీ, షియా ముస్లింల మధ్య ప్రధాన తేడాలేంటి?
ఇజ్రాయెల్-అమెరికా దేశాలు ఇరాన్‌పై దాడి చేసి ఆ దేశ సుప్రీం పాలకుడు ఖమేనీ సహా పలువురు కీలక నేతలను మట్టుబెట్టడంతో భారత్, పాకిస్థాన్‌తోపాటు పలు దేశాల్లోని షియా ముస్లింలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో సున్నీ, షియాల మధ్య వైరుధ్యాలను మరోసారి తెరపైకి వచ్చాయి. పలు ఇస్లాం దేశాలలో అంతర్గత ఘర్షణలకు, ముస్లిం దేశాల మధ్య ఘర్షణలకు సహితం ఈ విభేదాలే ప్రాతిపదికగా భావిస్తుంటారు.
 
మధ్యప్రాచ్యంలో ఆధిపత్యం కోసం సంఘర్షణల మూలాల విశ్లేషణలు, మొత్తం ముస్లిం ప్రపంచంలో ఉన్న సమకాలీన ఉద్రిక్తతల వెనుక ఉన్న ప్రాథమిక చోదక కారకంగా సున్నీలు, షియాల మధ్య చారిత్రక విభేదాన్ని వెల్లడిస్తాయి.  సున్నీ, షియా ముస్లింల మధ్య “1,400 సంవత్సరాల యుద్ధం” ఉనికిపై చర్చలు నేడు సర్వసాధారణం అవుతున్నాయి.
 
ప్రవక్త ముహమ్మద్ (స) మరణం తర్వాత ఇస్లామిక్ ఖలీఫా ప్రారంభ సంవత్సరాల్లో ఆయన చట్టబద్ధమైన వారసుడికి సంబంధించి సున్నీలు, షియాల మధ్య తేడాలు తలెత్తాయి అనడంలో సందేహం లేదు. అయితే,  షరియా సున్నీ, షియా వివరణల మధ్య కొన్ని విభేదాలు ఉన్నప్పటికీ, రెండు వైపుల నుండి పండితులు చాలా కాలంగా సంభాషణలో నిమగ్నమై శతాబ్దాలుగా ఒకరి మతపరమైన ఆలోచనను మరొకరు ప్రభావితం చేశారు.
 
ప్రపంచంలోని అతిపెద్ద మతాల్లో ఇస్లాం ఒకటి. అన్ని దేశాల్లో కలిపి 200 కోట్ల మంది ముస్లింలు ఉండగా, ప్రపంచ జనాభాలో వీరి వాటా దాదాపు 26 శాతంగా ఉంది. ఇస్లాంలో సున్నీ, షియా అనేవి రెండు ప్రధాన వర్గాలు. ఈ రెండు వర్గాల ప్రజలు అల్లాహ్‌ను దైవంగా ఆరాధిస్తారు. అయితే కొన్ని విషయాల్లో మాత్రం ఈ రెండు వర్గాల మధ్య తేడాలున్నాయి.
 
మహ్మద్ ప్రవక్త మరణం తర్వాత ఇస్లాం సమాజానికి నాయకుడిగా (ఖలీఫా) ఎవరు ఉండాలనే విషయంలో వచ్చిన విభజన కారణంగా సున్నీలు, షియాలు అనే రెండు వర్గాలు ఏర్పాటయ్యాయి. ప్రవక్త అనంతరం ఆయన సన్నిహితుడైన అబూ బకర్ (మహ్మద్ ప్రవక్త భార్య ఆయేషా తండ్రి) నాయకత్వాన్ని సున్నీలు సమర్థించారు. కర్బలా యుద్ధం తర్వాత సున్నీలు, షియాల మధ్య విభజన శాశ్వతంగా బలపడింది.

ప్రవక్త అల్లుడు, రక్తసంబంధీకుడు అయిన అలీ ఇబ్న్ అబీ తాలిబ్‌ ఆయన వారసుడిగా ఉండాలని కొందరు భావించారు. వీరినే షియా ముస్లింలు అంటారు. వీరు అలీని మొదటి ఇమామ్‌గా భావించారు. ముస్లింలలో మెజార్టీ ప్రజలు సున్నీ వర్గానికి చెందిన వారు. వీరు 85-90 శాతం ఉంటారు. షియాలు 10-15 శాతం వరకు ఉంటారు.

సున్నీలు, షియాలు ఇద్దరూ ఖురాన్‌ను, అల్లాహ్‌ను నమ్ముతారు. అయితే ఆచార వ్యవహారాల్లో మాత్రం కొద్దిగా తేడాలుంటాయి.
సున్నీలు రోజుకు ఐదుసార్లు వేర్వేరు సమయాల్లో నమాజ్ చేస్తారు. ఈ సమయంలో వీరు చేతులు కట్టుకొని ఉంటారు. షియాలు కూడా ఐదుసార్లు నమాజ్ చేయాలి. కానీ వీరు కొన్నిసార్లు మధ్యాహ్నం-సాయంత్రం, రాత్రి-అర్ధరాత్రి నమాజ్‌లను కలిపి మూడుసార్లు నమాజ్ చేస్తారు. ప్రార్థన చేసే సమయంలో వీరు చేతులు వదిలేస్తారు. 
చేతులు కట్టుకోవడం వల్ల నమాజ్‌కు భంగం వాటిల్లుతుందని వీరు భావిస్తారు. షియాలు నుదుటిని నేలను తాకించే చోట మట్టి బిళ్ల (తుర్బా)ను ఉంచుతారు.
అలాగే అజాన్ ఇచ్చే సమయంలో సున్నీలు, షియాల మధ్య కొద్దిపాటి తేడాలుంటాయి. సున్నీలు ఆమీన్ చెబితే, షియాలు ఆమీన్ చెప్పరు. అలాగే సున్నీలు, షియాల మసీదుల్లోనూ నిర్మాణపరంగా స్వల్ప తేడాలుంటాయి. భారతదేశంలో సున్నీలు, షియాలు ఒకరి మసీదుకు మరొకరు వెళ్తుంటారు. కానీ నమాజ్ మాత్రం తమ తమ పద్ధతుల్లో చేస్తారు. సున్నీలలో ఇమామ్ అంటే మసీదులో ప్రార్థన చేయించే వ్యక్తి మాత్రమే.
కానీ షియాల్లో మాత్రం ఇమామ్ అంటే దైవిక జ్ఞానం ఉన్న పవిత్ర నాయకుడు. షియాల్లో మసీదులో ప్రార్థన చేయించే వ్యక్తిని మౌలానా లేదా ఆలిమ్ అని పిలుస్తారు. 
షియాలు మహ్మద్ ప్రవక్త వారసులైన 12 మంది ఇమామ్‌లను పూజిస్తారు. షియాలకు మొహర్రం అనేది అత్యంత ముఖ్యమైనది. మహ్మద్ ప్రవక్త మనవడు కర్బలా యుద్ధంలో వీరమరణం పొందగా, ఆయన మరణాన్ని తలుచుకుంటూ షియాలు శోకాతప్త ప్రదర్శనలు చేస్తారు. సున్నీలు సైతం దీన్ని గౌరవిస్తారు కానీ అంత తీవ్రంగా స్మరించరు.
 

సున్నీ, షియా ఇరు వర్గాల ప్రజలు షరియా చట్టం ప్రకారం నిఖాను పవిత్రమైన ఒప్పందంగా భావిస్తారు. అయితే షియా వర్గంలో ముతా నిఖాను అనుమతిస్తారు. ముతా నిఖా అంటే ఓ రకంగా కాంట్రాక్ట్ వివాహం. నిర్దిష్ట గడువు ముగిసిన తర్వాత ఆ పెళ్లి రద్దవుతుంది. అలాగే నిఖాకు సాక్షుల విషయంలోనూ సున్నీ, షియాల మధ్య కొద్దిపాటి తేడాలున్నాయి.

షియా మౌలానాలు తలపాగాను ధరిస్తారు. ప్రవక్త వంశానికి చెందిన వారు (సయ్యద్) నల్లని తలపాగా ధరిస్తే, ఇతరులు తెల్లని తలపాగా ధరిస్తారు. అలాగే సున్నీ ఇమామ్‌లు తెలుపు రంగు తలపాగా లేదా టోపీ ధరిస్తారు. మొహర్రం నెలలో ఇమామ్ హుస్సేన్ త్యాగాన్ని స్మరిస్తూ షియాలు నలుపు రంగు దుస్తులు ధరిస్తారు.  సున్నీ వర్గాని చెందిన పురుషులు తెలుపు, ఆకుపచ్చ రంగు దుస్తులకు ప్రాధాన్యం ఇస్తారు. ఇరు వర్గాలకు చెందిన మహిళలు హిజాబ్ ధరిస్తారు. షియాల ప్రాబల్యం ఉండే ఇరాన్ లాంటి దేశాల్లో మహిళలు తల నుంచి పాదాల వరకు కప్పి ఉంచే నల్లటి వస్త్రం (చాదర్)ను ధరిస్తారు.

 
ప్రపంచంలో అత్యధికంగా షియా ముస్లింలు ఉన్న దేశం ఇరాన్. ఈ దేశంలో 90 శాతం మందికిపైగా షియా ముస్లింలే. దానికి పొరుగున ఉన్న ఇరాక్‌లోనూ షియాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అలాగే బహ్రెయిన్, అజర్ బైజాన్ దేశాల్లోనూ షియాలే మెజార్టీ. అంతే కాకుండా భారత్, పాకిస్థాన్, లెబనాన్, యెమెన్, కువైట్ తదితర దేశాల్లోనూ షియా జనాభా చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు.

సున్నీ, షియాలు కాకుండా సుఫీ, అహ్మదీయ, ఇబాదీ, వహాబీ లాంటి వర్గాలు కూడా ఇస్లాంలో ఉన్నాయి. దర్గాలు, ఖవ్వాలీలు సుఫీయిజంలో భాగం. ప్రేమతో అల్లాను చేరుకోవచ్చని సూఫీలు నమ్ముతారు. ఇబాదీలు ఒమన్‌లో మెజార్టీ వర్గం. ఇస్లాంను అత్యంత కఠినమైన, ప్రాచీనమైన విధానంలో అనుసరించాలని వహాదీలు కోరుకుంటారు.

సున్నీలు, షియాలు ఇద్దరూ మహ్మద్, అహ్మద్, ముస్తఫా లాంటి పేర్లను పెట్టుకుంటారు. కానీ షియా వర్గానికి చెందిన వారు 12 మంది ఇమామ్‌ల పేర్లను, వారి కుటుంబ సభ్యుల పేర్లను పెట్టుకోవడానికి ఇష్టపడతారు. అలీ, హుస్సేన్, జాఫర్, రిజా, నఖీ, ఫాతిమా, జైనబ్ మొదలైన పేర్లు షియా ముస్లింల్లో ఎక్కువగా ఉంటాయి.

 
సయ్యద్ అనే పేరు ఇరువర్గాల వారు పెట్టుకుంటారు. అయితే షియాల్లో సయ్యద్ అనే పేరుకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. నఖ్వీ, రిజ్వీ, జైదీ అనేవి షియా ఉప వర్గాలను లేదా ఇమామ్‌ల వంశక్రమాన్ని సూచిస్తాయి. అలాగే సున్నీలు మహ్మద్ ప్రవక్త పేరుతోపాటు ఆయన ప్రధాన అనుచరులైన అబూ బకర్, ఉమర్, ఉస్మాన్‌ల పేర్లను కూడా పెట్టుకుంటారు. 
 
సిద్దిఖీ, ఫారుఖీ, ఉస్మానీ అనేవి వరుసగా అబూ బకర్ సిద్ధిఖీ, ఉమర్ ఫారూఖ్, ఉస్మాన్ గనీల వంశం లేదా వారిని అనుసరించే వారు అని సూచిస్తుంది. ఇవి సున్నీల్లో మాత్రమే కనిపిస్తాయి. ఆయిషా, అబ్దుల్లా అబ్దుర్ రెహ్మా్న్ తదితర పేర్లు సున్నీల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఆయిషా అనేది మహ్మద్ ప్రవక్త భార్య పేరు. ఈ పేరును షియాలు సాధారణంగా పెట్టుకోరు.