సుప్రీం లీడర్‌గా ఖమేనీ కుమారుడు ముజ్తబా

సుప్రీం లీడర్‌గా ఖమేనీ కుమారుడు ముజ్తబా
ఇరాన్ కొత్త సుప్రీం నేత‌గా అయ‌తుల్లా ఖ‌మేనీ కుమారుడు మోజ్తాబా హుసేన్ ఖ‌మేనీ ఎన్నిక‌య్యారు. ఇజ్రాయిలీ మీడియా ఈ విష‌యాన్ని పేర్కొన్న‌ది.  88 మంది మత గురువులతో కూడిన ‘అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్’ మండలి ముజ్తబా ఖమేనీను సుప్రీం లీడర్‌గా ఎన్నుకుంది.  ఖమేనీ మరణం తర్వాత గత కొన్ని రోజులుగా రహస్యంగా జరిగిన చర్చల అనంతరం, ముజ్తబా ఖమేనీని అత్యున్నత నేతగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు.  
 
ఈ నియామకంలో ఇరాన్ అత్యంత శక్తివంతమైన సైనిక విభాగం ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. సైనిక నాయకత్వం నుంచి వచ్చిన ఒత్తిడి, ప్రస్తుత యుద్ధ వాతావరణంలో స్థిరమైన నాయకత్వం అవసరమనే కారణంతో ముజ్తబా వైపు మత పెద్దలు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.  36 ఏళ్ల పాటు ఇరాన్ సుప్రీం నేత‌గా కొన‌సాగిన ఖ‌మేనీ గ‌త శ‌నివారం అమెరికా-ఇజ్రాయెల్ ద‌ళాలు జ‌రిపిన దాడిలో మృతిచెందిన విష‌యం తెలిసిందే.

1969లో మషాద్ నగరంలో అలీ ఖమేనీకి రెండో కుమారుడుగా జన్మిచిన.మొజ్తాబా వ‌య‌సు 56 ఏళ్లు. త‌న తండ్రి ఖ‌మేనీ అడుగుజాడ‌ల్లో రాజ‌కీయ‌, మ‌త‌ప‌ర‌మైన వ్య‌వ‌స్థ‌ల‌ను ఆయ‌న న‌డిచారు. ఆయ‌న‌కు అయిదుగురు సోద‌రులు ఉన్నారు. టెహ్రాన్‌లో ఉన్న అలావి ఉన్న‌త పాఠ‌శాల‌లో ఆయ‌న చ‌దువుకున్నారు. ఆ తర్వాత ఖోమ్‌లో మోజ్తాబా మ‌త‌ప‌ర‌మైన విద్య నేర్చుకున్నారు. 

1980లలో జరిగిన ఇరాన్-ఇరాక్ యుద్ధంలో ముజ్తబా స్వయంగా పాల్గొని సైనికుడిగా సేవలు అందించారు. దీనివల్ల ఆయనకు ఐఆర్‌జీసీ కమాండర్లతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన ఒక మధ్యస్థాయి షియా మత గురువు. అయితే, సుప్రీం లీడర్ కావడానికి అవసరమైన అత్యున్నత మతపరమైన హోదా (అయతొల్లా) ఆయనకు ఇవ్వడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 2019లో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ముజ్తబాపై ఆర్థిక ఆంక్షలు విధించింది. తన తండ్రి తరపున అనధికారికంగా పాలనా యంత్రాంగాన్ని నడిపిస్తున్నారని ఆరోపణలు చేసింది.

సాధారణంగా షియా మత సంప్రదాయంలో తండ్రి తర్వాత కుమారుడు పీఠం ఎక్కడాన్ని మతపెద్దలు అంతగా ఇష్టపడరు. ‘వారసత్వ పాలన’కు వ్యతిరేకంగా ఇరాన్ ఇస్లామిక్ విప్లవం వచ్చింది. రాచరిక వ్యవస్థను అంతం చేయడానికి 1979లో విప్లవం జరిగింది. ఖమేనీ కుమారుడికి పట్టం కట్టడం అనేది విప్లవ ఆశయాలకు విరుద్ధమని ‘అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్’ మండలిలోని కొందరు మతపెద్దలు ముజ్తబా ఎన్నికను వ్యతిరేకించినట్లు తలుస్తోంది. 
వాస్తవానికి ఖమేనీ కూడా తన కుమారుడి పేరును వారసుల జాబితాలో చేర్చలేదు. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్ చరిత్రలో ఇది రెండో నాయకత్వ మార్పు మాత్రమే కావడం గమనార్హం. 1989 నుంచి ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఉన్న ఖమేనీ మరణం తర్వాత ఈ నియామకం జరిగింది.