పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న నేపథ్యంలో ఈ యద్ధ ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కలిగే ఆర్థిక నష్టాన్ని ఇప్పుడే అంచనా వేయడం సాధ్యం కాదని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) మంగళవారం స్పష్టం చేసింది. పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతలను అత్యంత నిశితంగా గమనిస్తున్నట్లు పేర్కొంది.
ఉద్రిక్తతల వల్ల వాణిజ్యం, ఆర్థిక కార్యకలాపాల్లో అంతరాయాలు, ఇంధన ధరల పెరుగుదల, మార్కెట్లలో అస్థిరతను తాము గమనించినట్లు పేర్కొంది. ప్రస్తుతం పరిస్థితి అత్యంత వేగంగా మారుతోందని, ఇది ఇప్పటికే అనిశ్చితిలో ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మరింత ఇబ్బందుల్లోకి నెట్టినట్లు ఐఎంఎఫ్ స్పష్టం చేసింది. ఈ యుద్ధం ఎంత కాలం కొనసాగుతుందనే దానిపై ఎంత నష్టం జరుగుతుందనేది ఆధారపడి ఉంటుందని పేర్కొంది.
ఇప్పటికే రష్యా- ఉక్రెయిన్ యుద్ధం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు పశ్చిమ ఆసియాలో అస్థిరత ఏర్పడటంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణానికి దారితీసే అవకాశం ఉంది. ఎర్ర సముద్రం, ఇతర కీలక జలమార్గాల ద్వారా జరిగే సరుకు రవాణాకు ఆటంకాలు కలుగుతున్నాయని ఐఎంఎఫ్ తన నివేదికలో చెప్పింది.
దీనివల్ల రవాణా ఖర్చులు పెరిగి, సరఫరా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు, ఆర్థిక సంస్థలు ఈ పరిణామాల పట్ల ఆందోళన చెందుతున్నాయి.
ఇరాన్‌కు చైనా మద్దతు
అమెరికా, ఇజ్రాయెల్ దాడులు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్‌కు చైనా మద్దతు ప్రకటించింది. ఇరాన్, చైనా విదేశాంగ మంత్రులు అబ్బాస్ అరాగ్చి, వాంగ్ యి మంగళవారం ఫోన్‌లో చర్చలు జరిపారు. అనంతరం వాంగ్ యి మీడియాతో మాట్లాడారు. ఇరాన్ తన సార్వభౌమత్వాన్ని, భద్రతను, ప్రాంతీయ సమగ్రత, చట్టబద్ధమైన హక్కులను కాపాడుకోవడానికి చైనా మద్దతు ఇస్తుందని తెలిపారు. ఇరాన్‌లో మిలిటరీ ఆపరేషన్లను వెంటనే నిలిపేయాలని అమెరికా, ఇజ్రాయెల్‌లకు విజ్ఞప్తి చేశారు.
కాగా, మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలను కొంత వరకైనా నివారించే విషయంలలో మధ్యవర్తిత్వం వహించేందుకు రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ ముందుకొచ్చారు. నాలుగు అరబ్ దేశాల నేతలతో ఆయన టెలిఫోన్‌లో సంభాషించారు. ఉద్రిక్తతల నివారణకు ఇరాన్‌తో తనకున్న సంబంధాలను ఉపయోగించుకుంటానని వారికి తెలిపారు.
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ జరుపుతున్న దాడుల కారణంగా పశ్చిమాసియా దేశాలే కాకుండా అరబ్ దేశాలు కూడా అణ్వాయుధాల సముపార్జనకు ప్రయత్నిస్తాయని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్‌రోవ్ హెచ్చరించారు. ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అణ్వాయుధ వ్యాప్తికి దోహదపడతాయని, అప్పుడు పరిస్థితి మన చేతుల్లో ఉండదని తెలిపారు.

More Stories
వరుసగా నాలుగో రోజు కూడా భీకర పోరు
దెబ్బతిన్న ఇరాన్ అణుశుద్ధి కర్మాగారం.. అధ్యక్ష భవనంపై దాడి
ఐఆర్జీసీ కమాండ్ కంట్రోల్ సెంటర్ల ధ్వంసం