భారత చేరుకున్న ఫిన్‌లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్

భారత చేరుకున్న ఫిన్‌లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్

ఫిన్‌లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ భారత్ లో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం మధ్యాహ్నం ఆయన ఢిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఆధ్వర్యంలోని బృందం ఘన స్వాగతం పలికింది. గార్డ్ ఆఫ్ ఆనర్‌ లభించింది. స్టబ్‌తోపాటు ఫిన్‌లాండ్‌కు చెందిన పలువురు కీలక నేతలు, అధికారులు కూడా ఇండియా చేరుకున్నారు.

స్టబ్ తన పర్యటన సందర్భంగా భారత్ తో కీలక ఒప్పందాలు చేసుకుంటారు. పలు అంశాలపై చర్చలు జరపనున్నారు. ముఖ్యంగా ద్వైపాక్షిక సంబంధాలు, వ్యాపారం, వాణిజ్యం, సాంకేతిక రంగంలో సహకారం వంటి అంశాల్లో ఒప్పందాలు జరుగుతాయి. స్టబ్స్  ఈ చర్చల్లో భాగంగా గురువారం ప్రధాని నరేంద్ర మోదీతో చర్చలు జరుపుతారు. 

అలాగే, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్‌తో కూడా సమావేశమవుతారు. స్టబ్స్‌ భారత్ లో పర్యటిస్తున్న సందర్భంగా ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. స్టబ్స్‌కు స్వాగతం పలుకుతున్నట్లు తెలిపారు. స్టబ్స్ పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి ఉపయోగపడుతుందని, గురువారం ఆయనను కలుసుకునేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు. 

భారత పర్యటనపై స్టబ్ కూడా ప్రత్యేకంగా స్పందించారు. భారత పర్యటనపై హర్షం వ్యక్తం చేశారు. ఇక్కడ ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ములను కలుసుకోబోతున్నట్లు వెల్లడించారు. గురువారం సాయంత్రం మీడియాతో మోదీ, స్టబ్ మాట్లాడుతారు.  గురువారం సాయంత్రం రైసినా డైలాగ్‌ ప్రారంభ సమావేశంలో అలెగ్జాండర్‌ స్టబ్‌ ముఖ్య అతిథిగా పాల్గననున్నారు.  శుక్రవారం ముంబయిలో వ్యాపారవేత్తలతో సమావేశం కానున్నారు. 

ఫిన్‌లాండ్ ప్రధాని పెట్టెరి ఒర్పో ఇటీవలే న్యూఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సదస్సులో పాల్గొన్నారు. ఇక భారత్, ఫిన్‌లాండ్ ల మధ్య చాలాకాలంగా స్నేహపూర్వక సంబంధాలున్నాయని భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ తెలిపారు.