సోష‌ల్ మీడియాలో ఫేక్ కంటెంట్.. శ్రీన‌గ‌ర్ ఎంపీ, మాజీ మేయ‌ర్‌పై కేసు

సోష‌ల్ మీడియాలో ఫేక్ కంటెంట్.. శ్రీన‌గ‌ర్ ఎంపీ, మాజీ మేయ‌ర్‌పై కేసు

సోషల్‌మీడియాలో తప్పుడు కంటెంట్‌ను ప్రసారం చేశారనే ఆరోపణలపై నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్‌సి) ఎంపి అగా సయ్యద్‌ రుహుల్లా మొహదీ, శ్రీనగర్‌ మాజీ మేయర్‌ జునైద్‌ అజీమ్‌ మట్టులపై కేసు నమోదైంది.  ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయేల్ ద‌ళాలు జ‌రిపిన దాడిలో సుప్రీంనేత ఖ‌మేనీ మృతిచెందిన సందర్భంగా  ఆ దాడుల‌ను, ఖ‌మేనీ మృతిని ఖండిస్తూ శ్రీన‌గ‌ర్‌లో నిర‌స‌న‌లు చోటుచేసుకున్నాయి. 

దానికి సంబంధించిన ఓ ఫేక్ వీడియోను ఎంపీ ఆఘా స‌య్య‌ద్ త‌న ఎక్స్ అకౌంట్‌లో పోస్టు చేశారు. భయాన్ని సృష్టించడం, శాంతిభద్రతలకు విఘాతం కల్పించడం, చట్టవిరుద్ధ కార్యకలాపాలను ప్రేరేపించే ఉద్దేశ్యంతో డిజిటల్‌, సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తప్పుడు, కల్పిత, తప్పుదారి పట్టించే కంటెంట్‌ను ప్రసారం చేశారన్న విశ్వసనీయ సమాచారం ఆధారంగా వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

ఈ కంటెంట్‌ వక్రీకరించిన కథనాల వ్యాప్తిని, ధృవీకరించని సమాచారాన్ని ప్రతిబింబిస్తుందని, శాంతిభద్రతలకు విఘాతం కల్పించడం, సామాజిక అసమానతకు కారణమని పేర్కొన్నారు. శ్రీనగర్‌లోని సైబర్‌ పోలీస్‌స్టేషన్‌లో బిఎన్‌ఎన్‌ఎస్‌ సెక్షన్లు 197(1)(డి), 353(1)(బి)కింద రెండు ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులపై దర్యాప్తు చేపట్టామని పేర్కొన్నారు. 

అధికారిక‌, న‌మ్మ‌ద‌గిన వ్య‌క్తుల నుంచి ప్ర‌జ‌లు త‌మ వ‌ద్ద ఉన్న స‌మాచారాన్ని స‌రిచూసుకోవాల‌ని పోలీసులు పేర్కొన్నారు. అయితే, ఈ దేశ పౌరుడిగా పోలీసుల దురాగతాలకు, చట్టాల ఉల్లంఘనకు వ్యతిరేకంగా, తన హక్కులను కాపాడుకునేందుకు, రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం కోసం చివరి రక్తపు బట్టువరకు పోరాడతానని ఎన్‌సి ఎంపి మెహదీ తెలిపారు. 

జమ్ముకాశ్మీర్‌ పోలీసులు, యంత్రాంగంలోని కొందరు తన భద్రతను తగ్గించడం, ఫేస్‌బుక్‌ ఖాతాను నిలిపివేయడం ద్వారా వారి దురాగతాలను ప్రపంచానికి తెలియకుండా చేయవచ్చని భావిస్తున్నారని, ఈ చర్య హాస్యాస్పదమని విమర్శించారు. అమెరికా -ఇజ్రాయిల్‌ సంయుక్త వైమానిక దాడిలో ఖమేనీ హత్యపై తన ప్రకటన కారణంగా భద్రతను ఉపసంహరించుకున్నారని మాజీ మేయర్‌ మట్టు తెలిపారు.