అమరికా యుద్ధ విమానం కూల్చివేత..చమురు దిగ్గజం మూసివేత

అమరికా యుద్ధ విమానం కూల్చివేత..చమురు దిగ్గజం మూసివేత
* నెతన్యాహు కార్యాలయం లక్ష్యంగా దాడులు!                          * ఓ భారతీయు మెరైన్‌ సిబ్బంది మృతి

అమెరికా సైనిక యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు ఇరాన్ తెలిపింది. అమెరికా ఎఫ్-15 యుద్ధ విమానం కువైట్ గగనతలంలో కూలిపోయింది. విమానం కూలిపోయే ముందు పైలట్ విమానంలో నుండి బయటకు వెళ్లాడని అంతర్జాతీయ మీడియా నివేదిస్తుంది. పైలట్ స్వల్పంగా గాయపడినట్లు సమాచారం. విమాన ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు విడుదలయ్యాయి. 

ఇరాన్ ఒకేసారి ఇజ్రాయిల్, గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా వైమానిక స్థావరాలపై క్షిపణులను ప్రయోగించడం ద్వారా తన దాడులను కొనసాగిస్తోంది. ప్ర‌తిదాడుల‌కు దిగిన ఇరాన్‌ను వ‌దిలిపెట్టేది లేద‌ని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ ప్రకటించిన నేప‌థ్యంలో అమెరికాతో చ‌ర్చ‌లు నిర్వ‌హించేందుకు ఇరాన్ తిర‌స్క‌రించిన‌ట్లు తెలుస్తోంది.  అయితే, సోమవారం ఉదయం మూడు అమెరికా ఫైటర్‌ జెట్లను కువైట్‌ వైమానిక రక్షణ దళాలు పొరపాటున కాల్చివేసినట్లు పెంటగాన్ వెల్లడించింది. దీనిని ఫ్రెండ్లీ ఫైర్‌ ఘటనగా అభివర్ణించింది.

ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) సోమవారం తెలిపింది. ‘ఆశ్చర్యకరమైన’ క్షిపణి దాడి చేసినట్లు పేర్కొంది. ఇజ్రాయెల్ వైమానిక దళ కమాండర్ ఉన్న ప్రదేశాన్ని కూడా లక్ష్యంగా చేసుకుని మిసైల్‌ ఎటాక్‌ చేసినట్లు వెల్లడించింది. తమ దాడుల తర్వాత నెతన్యాహుకు సంబంధించిన సమాచారం అస్పష్టంగా ఉన్నదని ఇరాన్ ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ ప్రకటనను ఇజ్రాయిల్ ఖండించింది.

సౌదీ అరేబియా ప్రభుత్వ చమురు దిగ్గజం ఆరామ్‌కో తన రాస్ తనూరా శుద్ధి కర్మాగారాన్ని డ్రోన్ ఢీకొట్టడంతో మూసివేసిందని సోమవారం పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడికి ప్రతిస్పందనగా టెహ్రాన్ ఈ ప్రాంతం అంతటా ప్రారంభించిన దాడుల మూడవ రోజు ఇది స్పష్టంగా కనిపించింది. గల్ఫ్ తీరంలో ఉన్న రాస్ తనూరా కాంప్లెక్స్, రోజుకు 550,000 బ్యారెళ్ల సామర్థ్యం కలిగిన మధ్యప్రాచ్యంలో అతిపెద్ద శుద్ధి కర్మాగారాలలో ఒకటి. సౌదీ ముడి చమురుకు కీలకమైన ఎగుమతి టెర్మినల్‌గా పనిచేస్తుంది.

కువైట్లోని అమెరికా రాయబార కార్యాలయం సమీప ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని మిస్సైల్స్ ప్రయోగించింది. ఈ నేపథ్యంలో ఎంబసీ సిబ్బంది అమెరికా పౌరులను బయటకు రావొద్దని హెచ్చరించారు. మినా అల్ అహ్మది ప్రాంతంలోని చమురు శుద్ధి కర్మాగారం వద్ద కూడా పేలుళ్లు సంభవించినట్లు తెలుస్తోంది. ప్రత్యక్ష సాక్షుల కథనాల ప్రకారం యూఎస్ ఎంబసీ సమీపంలో పొగలు ఎగసిపడినట్లు కనిపించిందని వార్తా సంస్థలు తెలిపాయి.

లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ జరిపిన భీకర వైమానిక దాడుల్లో హెజ్‌బొల్లాకు చెందిన అత్యంత కీలక నేత మహమ్మద్‌ రాడ్‌ మరణించినట్లు సౌదీ అరేబియాకు చెందిన ప్రముఖ వార్తా సంస్థ ‘అల్‌ అరేబియా’ పేర్కొంది. హెజ్‌బొల్లా రాజకీయ, సైనిక విభాగాల్లో కీలక పాత్ర పోషించే రాడ్‌ మృతి ఆ సంస్థకు కోలుకోలేని దెబ్బగా భావిస్తున్నారు.

ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకుని అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఇస్లామిక్ రిపబ్లిక్‌లో ఇప్పటివరకు కనీసం 555 మంది మరణించారని ఇరానియన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ సోమవారం తెలిపింది. యుద్ధంలో ఇప్పటివరకు 131 నగరాలు దాడికి గురయ్యాయని సొసైటీ తెలిపింది. ఒమన్ తీరంలో ఆయిల్‌ ట్యాంకర్‌పై జరిపిన డ్రోన్ దాడిలో ఆయిల్‌ ట్యాంకర్‌లో మంటలు చెలరేగి భారతీయుడైన మెరైన్‌ సిబ్బంది మరణించినట్లు ఒమన్ ధృవీకరించింది.