హార్మూజ్ జలసంధి మూసివేతతో భారత్ పై పిడుగు!

హార్మూజ్ జలసంధి మూసివేతతో భారత్ పై పిడుగు!

* భారతీయులు ఉన్న ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడి, యుద్ధ ప్రమాద బీమా రద్దు

ప్రతీకార దాడులకు దిగిన ఇరాన్ పలు ముస్లిం దేశాలపైనా విరుచుకుపడుతుండటంతో మధ్య ఆసియాలో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. ఇరాన్, యూఏఈ దాడుల నేపథ్యంలో హార్మూజ్ జలసంధిని ఇరాన్ దళాలు మూసివేయడంతో దాని ప్రభావం భారత్‌పై పడే అవకాశాలు ఉన్నాయిర ప్రపంచ చమురు రవాణాలో ఎక్కువ శాతం ఈ హర్మూజ్ జలసంధి నుంచే జరుగుతుండగా, ఇప్పుడు దాన్ని మూసివేయడం ప్రపంచ దేశాలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.
 
ప్రపంచ చమురు సరఫరాలకు, భారత్‌ చమురు దిగుమతులకు కీలకమైన హొర్ముజ్‌ జలసంధి మార్గంలో ముడి చమురు ట్యాంకర్ల రాకపోకలు స్తంభించాయి. కాగా, ఒమన్ తీరానికి సమీపంలోని హార్ముజ్ జలసంధి గుండా వెళ్తున్న చమురు నౌకపై ఇరాన్ దాడి చేసింది. పలావు జెండాతో ఉన్న చమురు నౌక ఒమన్‌లోని ముసాండం ద్వీపకల్పాన్ని దాటుతుండగా దాడి జరిగింది. 
 
ఈ దాడిలో కనీసం నలుగురు గాయపడినట్లు ఒమన్ సముద్ర భద్రతా కేంద్రం తెలిపింది.  స్కైలైట్ నౌకలో మొత్తం 20 మంది సిబ్బంది ఉండగా, వారిలో  15 మంది భారతీయులు, ఐదుగురు ఇరానియన్లు ఉన్నారని వెల్లడించింది. దాడి విషయం తెలిసిన వెంటనే సిబ్బందిని నౌక నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చామని వెల్లడించింది.
 
కాగా హార్ముజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాకు ఒక వ్యూహాత్మక మార్గం. 161 కిలోమీటర్ల పొడవు, 33 కిలోమీటర్ల వెడల్పు ఉండే హొర్ముజ్‌ జలసంధి ఇరాన్‌కు దక్షిణాన ఉంది.  పర్షియల్‌ గల్ఫ్‌, ఒమన్‌ గల్ఫ్‌లను కలిపే ఓ కీలకమైన సముద్ర మార్గమైన దీని ద్వారా ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 20 శాతం రవాణా జరుగుతున్నది. 
 
ఇరాన్‌, ఒమన్‌ సరిహద్దులో ఉన్న ఈ ఇరుకైన మార్గం మూసివేత ప్రపంచ చమురు ధరలపై తీవ్ర ప్రభావం చూపగలదు. ఈ జలసంధిపై మరోసారి తన ఆధిపత్యాన్ని ప్రకటించిన ఇరాన్‌ దీన్ని మూసివేస్తామని తాజాగా హెచ్చరించింది.  గతంలో కూడా అనేక సందర్భాల్లో ఈ జలసంధిని అడ్డుకునే సామర్థ్యం తమకు ఉందని ఇస్లామిక్‌ దేశం ప్రకటించింది. 
 
అయితే గడచిన 40 ఏండ్లలో ఎన్నడూ అటువంటి దుస్సాహసానికి ఇరాన్‌ పూనుకోలేదు. కాని  రెండు వారాల  క్రితం అణు కార్యక్రమంపై అమెరికాతో చర్చలు కొనసాగుతున్న తరుణంలో ఫిబ్రవరి 17న జలసంధిని తాత్కాలికంగా మూసివేయాలని ఇరాన్‌ నిర్ణయించింది.
 
ఇలా ఉండగా, మధ్యప్రాచ్యంలో పనిచేస్తున్న నౌకలకు యుద్ధ ప్రమాద బీమాను రద్దు చేస్తూ భీమా కంపెనీలు నోటీసులు జారీ చేశాయి. ఇది అమెరికా,  ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడులు ప్రారంభించిన వేంటనే సముద్ర ప్రమాదంలో తీవ్ర పెరుగుదలను సూచిస్తుందని బీమా వర్గాలు తెలిపాయి. ప్రధాన కంటైనర్ క్యారియర్లు హార్ముజ్ జలసంధి నుండి ఓడలను నిలిపివేసాయి లేదా మళ్లించాయి. సూయజ్ కాలువ నుండి రాకపోకలను మళ్లించాయి.
 
ఈ ప్రాంతంలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతీకార దాడుల తర్వాత ఉద్రిక్తతలు పెరిగాయి. సోమవారం మార్కెట్లు తిరిగి తెరవడానికి ముందే బీమా సంస్థలు రద్దు నోటీసులను సమర్పించడానికి చేసిన అరుదైన చర్య ముగుస్తున్న సంక్షోభం వేగం, తీవ్రతను నొక్కి చెబుతుంది. యుద్ధం చాలా కాలం పాటు కొనసాగితే బీమా ఖర్చులు పెరుగుతాయని బీమా వర్గాలు తెలిపాయి. 
 
గల్ఫ్‌లో ప్రయాణించే నౌకలకు యుద్ధ ప్రమాద ప్రీమియంలు ఇవి నౌక  భర్తీ విలువలో దాదాపు 0.25% ఉండగా, ఇప్పుడు 50% వరకు పెరుగుతాయని అంచనా వేస్తున్నట్లు ఒక నివేదిక తెలిపింది. $100 మిలియన్ల నౌకకు బీమా ఖర్చులు ప్రయాణానికి $250,000 నుండి $375,000 వరకు పెరుగుతాయని అర్థం.

ఒకవేళ హొర్ముజ్‌ జలసంధిని పూర్తిగా మూసివేసిన పక్షంలో భారత్‌కు సరఫరా అయ్యే మొత్తం చమురు దిగుమతుల్లో 50 శాతానికి పైగా నిలిచిపోయే అవకాశం ఉంది. ఈ మార్గం ద్వారా భారత్‌కు జరుగుతున్న చమురు సరఫరా ప్రతినెలా పెరుగుతూ పోతున్నది. ఈ ఏడాది ఫిబ్రవరి 24 వరకు ప్రతి రోజు 26 లక్షల బ్యారెళ్ల చమరును గల్ఫ్‌ దేశాల నుంచి భారత్‌ దిగుమతి చేసుకుంది. 

ప్రధానంగా ఇరాన్‌, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్‌ నుంచి ఈ జలసంధి ద్వారా ప్రతిరోజు సుమారు 26 లక్షల బ్యారెళ్ల చమురు దిగుమతులు భారత్‌కు జరుగుతున్నట్లు కమోడిటీ ట్రాకింగ్‌ సంస్థ కెప్లెర్‌కు చెందిన పరిశోధనా విశ్లేషకుడు సుమిత్‌ రితోలియా పేర్కొన్నట్లు మనీ కంట్రోల్‌ వెల్లడించింది. ఈ జలసంధిని ఒకరోజు అడ్డగిస్తే బ్రెంట్‌(బెంచ్‌మార్కు) ముడి చమురు ధరలు 120 డాలర్ల నుంచి 150 డాలర్ల మధ్య చేరుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఫిబ్రవరి 20 నాటికి బ్యారెల్‌ ముడిచమురు ధర 66 డాలర్లుగా ఉంది. 

ఘర్షణలు మరింత విస్తృతమై చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడిన పక్షంలో భారత్‌ ప్రత్యామ్నాయ మార్గాలైన సౌదీ అరేబియాకు చెందిన వెస్ట్‌ పైప్‌లైన్ల నుంచి ఎర్ర సముద్రానికి, యూఏఈకి చెందిన అబు దాబి క్రూడ్‌ ఆయిల్‌ పైప్‌లైన్‌(ఉజైరా) ద్వారా చమురును దిగుమతి చేసుకోవచ్చు. అయితే ఈ పైప్‌లైన్ల సామర్థ్యం పరిమితమని,మనీ కంట్రోల్‌ పేర్కొన్నది.