గల్ఫ్ దేశాల్లో భారతీయులు తీసుకొచ్చేందుకు కేంద్రం యత్నం

గల్ఫ్ దేశాల్లో భారతీయులు తీసుకొచ్చేందుకు కేంద్రం యత్నం
ఇరాన్‌, అమెరికా-ఇజ్రాయెల్ సైనిక ఘర్షణ నేపథ్యంలో చాలా పశ్చిమాసియా దేశాలు తమ గగనతలాన్ని మూసివేశాయి. ఈ జాబితాలో ఇరాన్, ఇజ్రాయెల్‌తో పాటు ఇరాక్, సిరియా, ఖతర్, బహ్రయిన్, కువైట్ ఉన్నాయి. ఇక పాక్షికంగా గగనతలాన్ని మూసివేసిన దేశాల జాబితాలో యూఏఈ, సౌదీ అరేబియా, జోర్డాన్ ఉన్నాయి. 
 
ఇరాన్, ఇరాన్ సమర్ధిత మిలిటెంట్లు అరబ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలతో పాటు ఎయిర్ పోర్టులు, హోటళ్లపైనా డ్రోన్లు, మిస్సైళ్లతో దాడులు చేస్తున్నారు. దీంతో దుబాయ్, అబుదాబి, దోహా సహా గల్ఫ్ దేశాల్లోని చాలా ఎయిర్‌పోర్టులను మూసివేశారు. 1,000కిపైగా విమాన సర్వీసులను రద్దు చేశారు. దీనివల్ల ప్రతిరోజు సగటున 90వేల మంది ప్రయాణికుల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. 
 
ఈ నేపథ్యంలో వేలాది మంది భారతీయులు గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయారు. వీరిలో ఉద్యోగాలు చేస్తున్నవారు, టెక్ నిపుణులు, విద్యార్థులు, పర్యాటకులు ఉన్నారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో యుద్ధం విస్తరిస్తున్న తరుణంలో అక్కడున్న భారతీయుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.  పశ్చిమాసియా దేశాల్లోని భారతీయుల భద్రత అంశాన్ని తొలుత కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటి.
 
కర్ణాటక, రెండు తెలుగు రాష్ట్రాలు సహితం ఈ విషయమై కేంద్రాన్ని అప్రమత్తం చేశాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అత్యవసర కార్యకలాపాల కేంద్రం ద్వారా 24 గంటల హెల్ప్ లైన్‌ను నిర్వహిస్తున్నాయి.  పశ్చిమాసియాలో సైనిక ఘర్షణ, భారతీయ పౌరుల భద్రతపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన భద్రతా కేబినెట్ కమిటీ (సీసీఎస్) సమీక్షా సమావేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. 
 
ఈ పరిణామాల వల్ల ప్రభావితం అవుతున్న భారతీయ పౌరులకు సహాయం చేయడానికి అవసరమైన, ఆచరణీయమైన చర్యలు చేపట్టాలని సంబంధిత విభాగాలన్నింటినీ ఆదేశాలు జారీచేసింది. గల్ఫ్ దేశాల మీదుగా రాకపోకలు సాగించే భారతీయ ప్రయాణికులు ఎదుర్కొంటున్న సవాళ్లు, ప్రాంతీయ భద్రత, వాణిజ్య కార్యకలాపాలపై పడే ప్రభావాలపైనా ఈ సమావేశంలో చర్చించారు.
 
తాను ఇంగ్లండ్‌‌లోని బర్మింగ్‌హామ్‌కు వెళ్తుండగా దుబాయ్ ఎయిర్‌పోర్టులో ఇరుక్కుపోయానంటూ ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. కొన్ని గంటల క్రితం ఎయిర్‌పోర్టు సమీపంలో ఒక పేలుడు జరిగిందని ఆమె తెలిపారు.