ప్రజల పక్షాన, న్యాయం కోసం ప్రశ్నించే గళాన్ని ఎవరూ అణచివేయలేరని పేర్కొంటూ కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి ఖమ్మం నుంచే నాంది అని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రాంచందర్ రావు స్పష్టం చేశారు. పేదల హక్కుల కోసం బీజేపీ రాజీలేని పోరాటం చేస్తుందని ప్రకటించారు. ఖమ్మం జిల్లా లో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల వల్ల నిరాశ్రయులై, ఖమ్మం అంబేద్కర్ భవన్‌లో ఏర్పాటు చేసిన ఆశ్రయ కేంద్రంలో తలదాచుకుంటున్న బాధిత కుటుంబాలను ఆయన ఆదివారం పరామర్శించారు.
వారు పడుతున్న కన్నీటి వేదన, మాటలకందని ఆవేదన ప్రస్తుత ప్రభుత్వ క్రూరత్వానికి సజీవ సాక్ష్యాలని తెలిపారు. తొలి క్షణం నుండి బాధితులకు కొండంత అండగా నిలబడి, వారికి ఆశ్రయ కేంద్రంలో నిరంతర అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న ఖమ్మం జిల్లా బీజేపీ కార్యవర్గ సభ్యులకు, నాయకులకు, కార్యకర్తలకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ఖమ్మం జిల్లా, ఖమ్మం అర్బన్ వెలుగుమట్లలో కలెక్టరేట్ కార్యాలయం సమీపంలోని 147, 148, 149 సర్వే నంబర్ల భూదాన్ భూముల్లో గత అనేక సంవత్సరాలుగా, దాదాపు 2013-14 నుంచి, సుమారు 100 గజాల చొప్పున భూమి తీసుకుని దాదాపు 600 పేద కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ కుటుంబాలు కూలీ పనులు, హమాలీ పనులు చేస్తూ పైసా పైసా కూడబెట్టుకుని, కొందరు బంగారం అమ్ముకుని తమ సొంత సంపాదనతో ఇక్కడ ఇళ్లు కట్టుకుని జీవనం కొనసాగిస్తున్నారు. వారి పిల్లలు కూడా ఇక్కడే చదువుకుంటున్నారు.
ఈ 600 కుటుంబాల్లో దాదాపు 1,800 మంది ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు. గతంలో ఈ భూములపై కోర్టులో కేసులు నడుస్తున్న సమయంలో అనేక సార్లు స్టేటస్ కో ఆదేశాలు జారీ అయ్యాయి. ఎవిక్షన్ చేయొద్దని, జోక్యం చేసుకోవద్దని కోర్టు స్పష్టంగా చెప్పినా కూడా నోటీసులు ఇచ్చారు. అయితే భూదాన్ బోర్డు, రెవెన్యూ శాఖ సమగ్ర విచారణలో నకిలీ పత్రాలు, అక్రమ కేటాయింపులు వెలుగులోకి వచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం దారుణం అని రామచందర్ రావు విమర్శించారు.
ఆ పేరుతో ఇక్కడ పేద ప్రజలపై దాడి చేసి, వారిని వేధించి, వారు కట్టుకున్న కలలను కూల్చివేసి రోడ్డున పడేయడం ఏం మానవత్వం? రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విధంగా వ్యవహరించే అధికారం ఎవరు ఇచ్చారు? అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేతిలో గడ్డపార వేసుకుని తిరుగుతున్నట్టుగా పేద ప్రజల ఇళ్లను కూలగొడుతున్నారని పేర్కొంటూ ఇది ప్రజల పట్ల అమానుష వైఖరి అని మండిపడ్డారు.
బీజేపీ నాయకులు అక్కడే అన్నదానం కార్యక్రమం నిర్వహించి, రోడ్డున పడిన కుటుంబాలకు తక్షణ భరోసా కల్పించారు. రియల్ ఎస్టేట్ వ్యాపార ప్రయోజనాల కోసం పేద ప్రజల ఇళ్లను కూల్చివేయడం పూర్తిగా సరికాదని ఆయన హెచ్చరించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పును సరిదిద్దుకొని ఇక్కడే పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాలని, ఇందిరమ్మ ఇళ్ల పేరుతో అయినా గూడు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో కూడా 2023లో ఇక్కడి కుటుంబాలను నిర్వాసితులను చేయాలని ప్రయత్నాలు జరిగాయని చెబుతూ పేదలకు గూడు ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని స్పష్టం చేసారు. పేదలకు గూడు, విద్య, కూడు కల్పించాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వానిదే అని తేల్చి చేశారు.
More Stories
ప్రపంచం, ఇరాన్ పై ఖమేనీ మరణం ప్రభావం!
హార్మూజ్ జలసంధి మూసివేతతో భారత్ పై పిడుగు!
అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ ప్రతీకార దాడులు