కాకినాడ జిల్లాలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనంలో 21 మంది మృతి చెందారు. పేలుడు ధాటికి పంటపొలాల్లోకి మృతదేహాలు ఎగిరిపడ్డాయి. మృతుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్లు సమాచారం. శనివారం సామర్లకోట మండలంలోని వేట్లపాలెం, జి.మేడపాడు మధ్య బాణసంచా తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించడంతో 21 మంది సజీవదహనం అయినట్లు తెలుస్తోంది.
పేలుడు ధాటికి మృతదేహాలు ఎగిరిపడినట్లు స్థానికులు తెలిపారు. భారీ ఎత్తున మంటలు ఎగసిపడడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. పేలుడు శబ్దాలు సుమారు 5 కిలోమీటర్ల మేర వినిపించాయని స్థానికులు తెలిపారు. శబ్దం తీవ్రతకు పక్క గ్రామంలో ఉన్న ప్రైవేటు పాఠశాలలో స్లాబ్‌కు పగుళ్లు వచ్చాయి.
అడబాల వీరబాబు అనే వ్యక్తి పొలాల్లో చదును చేసి బాణసంచా తయారీ కేంద్రం నిర్వహిస్తున్నారు. వరిపొలాల మధ్య ఎవరూ రాలేని ప్రాంతంలో ఈ బాణసంచా కేంద్రం నిర్వహిస్తున్నారు. ఇక్కడ రోజూ 25 నుంచి 30 మందికి పైగా కార్మికులు పని చేస్తున్నారు. వీరిలో ఎక్కువగా మహిళలే ఉన్నారు. శనివారం కూడా అధిక సంఖ్యలో మహిళలు బాణసంచా తయారీలో పాల్గొన్నట్లు తెలుస్తుంది.
మధ్యాహ్నం తర్వాత బాణసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటనం సంభవించింది. దాదాపు గంటకుపైగా పేలుళ్లు కొనసాగినట్లు స్థానికులు చెబుతున్నారు. పరిమితికి మించి బాణసంచా తయారుచేయడం వల్లే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. పేలుళ్లు సంభవించినప్పుడు భూకంపం వచ్చినంతగా శబ్ధం విన్నట్లు స్థానికులు చెబుతున్నారు.
పేలుళ్ల కారణంగా చుట్టుపక్కల గ్రామాలు భయాందోళనకు గురయ్యారు. ఐదు గ్రామాల పరిధిలో దట్టమైన పొగ అలుముకుంది. స్థానికులు పేలుడు సంభవించిన ప్రాంతానికి చేరుకునే సరికి చాలామంది అగ్నికి ఆహుతయ్యారు. శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. కొందరి మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి. 21 మంది చనిపోయినట్లు నిర్దారించారు.
వేట్లపాలెంలోని బాణసంచా కర్మాగారంలో జరిగిన దుర్ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీముర్ము, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌లు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో పలువురు చనిపోయారన్న విషయం అత్యంత దుఃఖాన్ని కల్గించిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ‘ఎక్స్’లో వేర్వేరుగా పేర్కొన్నారు.
కాకినాడ జిల్లాలో పేలుడు ఘటన చాలా బాధాకరమని ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు క్షతగాత్రులకు రూ.50 వేలు పరిహారం ప్రకటించారు.
విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేట్లపాలెం ప్రమాద ఘటన తెలిసిన వెంటనే అక్కడి నుంచి బయల్దేరి వచ్చారు బాణసంచా పేలుడు ఘటన జరిగిన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. చంద్రబాబు వెంట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, స్థానిక కూటమి ప్రజాప్రతినిధులు ఉన్నారు. మృతుల వివరాలు, క్షతగాత్రుల సమాచారాన్ని చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, సహాయకచర్యలను ముమ్మరం చేయాలని అధికారులకు సీఎం సూచనలు చేశారు. తరువాత కాకినాడ జీజీహెచ్‌కు బయలుదేరి అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సీఎం పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, క్షతగాత్రుల్లో 9 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. ఈ ఘటనకు బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేస్తున్నట్లు చెప్పారు. విచారణ పూర్తయ్యాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.
పేలుడు పదార్థాల వద్ద జాగ్రత్తలు తీసుకోవడంలో నిర్వాహకులు విఫలమయ్యారని చెబుతూ ఈ తరహా ఘటనలు మరోసారి జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాధ్యులైన వ్యక్తుల ఆస్తులు కూడా జప్తు చేసి బాధిత కుటుంబాలకు సాయం చేస్తామని స్పష్టం చేశారు. కొందరు వ్యక్తులు పదేళ్లుగా ఇక్కడ పని చేస్తున్నారని చెప్పారు. అనుమతి లేకుండా బాణసంచా తయారు చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

More Stories
స్వదేశీ భావజాలం పునరుజ్జీవనంకై “రన్ ఫర్ స్వదేశీ”కి శ్రీకారం
ఆఫ్ఘన్ లో భార్యను కొట్టడంకన్నా జంతువులకు హాని కలిగిస్తే ప్రమాదం
తిరుమలలో ప్రయోగాత్మకంగా “శ్రీవారి ముడుపు పత్రం పథకం”