సౌందరరాజన్ కు ఆర్ఎస్ఎస్, వి హెచ్ పి, బిజెపి అశ్రునివాళి

సౌందరరాజన్ కు ఆర్ఎస్ఎస్, వి హెచ్ పి, బిజెపి అశ్రునివాళి

చిలుకూరు బాలాజీ దేవస్థాన ప్రధాన అర్చకులు, బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ ఎం.వి. సౌందరరాజన్ పరమపదించారు అనే  వార్త అత్యంత బాధాకరం అని పేర్కొంటూ వారి మృతి పట్ల రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) తెలంగాణ తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తోంది. సౌందరరాజన్ గారు కేవలం ఆలయ అర్చకులు మాత్రమే కాదని, వారు ఒక గొప్ప పండితులు, విద్యావేత్త, అసాధారణమైన న్యాయ నిపుణులు అని తెలంగాణ ప్రాంత సంఘచాలక్
బర్ల సుందర్ రెడ్డి నివాళులు అర్పించారు.
 
చిలుకూరు బాలాజీ ఆలయానికి నేడున్న దేశవ్యాప్త గుర్తింపు వెనుక ఆయన కృషి వెలకట్టలేనిదని చెబుతూ ఆలయాల నిర్వహణలో ప్రభుత్వ జోక్యం పైన, ధార్మిక సంస్థల స్వయంప్రతిపత్తి కోసం ఆయన చేసిన అలుపెరగని న్యాయపోరాటం చిరస్మరణీయం అని తెలిపారు. సామాన్యులకు భక్తిని చేరువ చేయడంలో, హిందూ ధర్మ ప్రచారంలో ఆయన పోషించిన పాత్ర స్ఫూర్తిదాయకమని చెప్పారు.  శ్రీ సౌందరరాజన్ మరణం భక్తులకు, హిందూ ధర్మ ప్రచారకులకు, ఆధ్యాత్మిక రంగానికి తీరని లోటు అని పేర్కొంటూ ఆయన పవిత్ర ఆత్మకు సద్గతులు ప్రసాదించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు  బర్ల సుందర్ రెడ్డి తెలిపారు. 
 డాక్టర్ సౌందరరాజన్ మృతి పట్ల తెలంగాణ ప్రాంత వి.హెచ్.పి అధ్యక్షులు భోజనపల్లి నరసింహమూర్తి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. చిలుకూరు బాలాజీ ఆలయానికి  దేశవ్యాప్త గుర్తింపు ఆయన కృషియే అన్ని తెలిపారు. దేవాలయాల స్వయంప్రతిపత్తి కోసం వారు చేసిన సేవలు చిరస్మరణీయమని గుర్తు చేశారు. హిందూ ధర్మ ప్రచారంలో వారు పోషించిన పాత్ర స్ఫూర్తిదాయకం అని పేర్కొంటూ  ప్రతి ఒక్కరు ఆయన మార్గాన్ని అనుసరించాలని కోరారు.
కాగా, చిలుకూరు బాలాజీ మందిర ప్రధాన అర్చకులు డాక్టర్ సౌందరరాజన్ పరమపదించారని తెలిసి కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం వారు తుదిశ్వాస వరకు చేసిన కృషి మనకు స్ఫూర్తిదాయకం అని, దేవాలయాల స్వయం ప్రతిపత్తికోసం వారు చేసి ఉద్యమాలు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయని కొనియాడారు.

డాక్టర్ సాందర్ రాజన్ గారు మరణించారన్న వార్త పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ భారతీయ సంస్కృతి ధర్మ పరిరక్షణ కోసం నిరంతరం పనిచేసిన వ్యక్తి అని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు ఘనంగా నివాళులు అర్పించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా,  చిలుకూరు బాలాజీ దేవాలయంలో భక్తులకు వివిధ సూచనలు ఇస్తూ ధర్మాన్ని రక్షించడం కోసం భక్తులలో వారిపై వారికి విశ్వాసం కలిగించేలా బోధనలు చేస్తూ శ్రీ శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి పూజకు అంకితమైన వ్యక్తి అని తెలిపారు.