తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఒకే విడతలో నిర్వహించాలని పలు పార్టీలు సూచించినట్టు సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తెలిపారు. వారి విజ్ఞప్తులను వివిధ కోణాల నుంచి పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పుడే దీనిపై ఒక స్పష్టత ఇస్తామని పేర్కొన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ఏర్పాట్లపై సమగ్ర సమీక్ష నిర్వహించిన జ్ఞానేశ్ కుమార్ రాష్ట్ర రాజకీయ పార్టీలతో కీలక సమావేశం నిర్వహించారు.
చెన్నైలో జరిగిన ఆ సమావేశంలో గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీల ప్రతినిధులు పాల్గొని పలు సూచనలు చేశారు. ముఖ్యంగా ఎన్నికలను ఒకే దశలో నిర్వహించాలని ఎక్కువ పార్టీలు కోరినట్టు అధికారులు తెలిపారు. డబ్బు, బహుమతుల ప్రలోభాలకు కట్టడి విధించాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశాన్ని భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. కమిషనర్‌లతో పాటు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అర్చనా పట్నాయక్, ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు.
ఎన్నికల నిర్వహణ, భద్రత, సిబ్బంది శిక్షణ, ఈవీఎంల నిర్వహణ, చట్టవ్యవస్థ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఇటీవల రాష్ట్రంలో జరిపిన ఎస్ఐఆర్ ప్రక్రియ దేశానికే ఒక మోడల్‌గా నిలిచిందని, విజయవంతంగా ఈ ప్రక్రియ పూర్తయిందని చెప్పారు. ఎస్ఐఆర్‌తో పెద్ద ఎత్తున ఓటర్లను జాబితా నుంచి తొలగించనున్నట్టు కొన్ని రాజకీయల పార్టీలు విమర్శించినప్పటికీ, ఓటర్ల జాబితా ప్రక్షాళన విషయంలో ఈసీ అధికారులు ఎంతో ప్రొఫెషనలిజం కనబరిచారని ప్రశంసించారు.
ఇటీవల కాలంలో ఏమాత్రం పొరపాట్లకు తావీయకుండా బీహార్ ఎన్నికలు జరిగాయని, అంతకు మించి మరింత మెరుగ్గా తమిళనాడులో ఎన్నికలు నిర్వహిస్తామని, సరికొత్త రికార్డు సృష్టిస్తామని తెలిపారు. రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలను సమీక్షించారు.
రాజకీయ పార్టీలు ఎన్నికల్లో డబ్బు ప్రభావం, ఉచిత పథకాల పంపిణీ వంటి అక్రమాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరాయి.
అక్రమాల నివారణకు ఫ్లయింగ్ స్క్వాడ్ల సంఖ్యను పెంచాలని కూడా సూచించాయి. దీనిపై స్పందించిన సీఈసీ జ్ఞానేశ్ కుమార్, ఎన్నికలు ఎప్పటికీ చట్టబద్ధంగా, స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ప్రలోభాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజాస్వామ్య సంప్రదాయాల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. తమిళనాడుకు ప్రజాస్వామ్యంలో గొప్ప చరిత్ర ఉందని, ప్రాచీన కాలంలోనే కుడవోలై విధానం అమల్లో ఉండేదని గుర్తుచేశారు. ఇది ప్రపంచానికి ఆదర్శమని చెప్పారు.
ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయిన ఏడు రోజుల వరకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నమోదైన ఓట్లతో వీవీపాట్ల స్లిప్పులను వెరిఫై చేసుకోవడానికి అభ్యర్థులను అనుమతిస్తామని సీఈసీ తెలిపారు. అయితే ఇందుకు కొంత మొత్తం చెల్లించాలని అన్నారు. ఈవీఎం రౌండ్లకు ముందు పోస్టల్ బ్యాలెట్లను రెండు రౌండ్లు కౌంటింగ్ జరుపుతామని చెప్పారు.

More Stories
సంస్కరణలపై కార్యాచరణకు అజెండా
లొంగిపోయిన మావోయిస్ట్ నేతలతో రేవంత్ రెడ్డి భేటీ
లొంగిపోనున్న మావోయిస్టును కాల్చి చంపిన నాయకుడు