లొంగిపోనున్న మావోయిస్టును కాల్చి చంపిన నాయకుడు

లొంగిపోనున్న మావోయిస్టును కాల్చి చంపిన నాయకుడు
మావోయిస్టుల అంతర్గత విభేదాలు మరోసారి రక్తాన్ని చిందించాయి. హింసను వీడి జనజీవన స్రవంతిలో కలవాలని నిర్ణయించుకున్న ఒక కీలక నేతను అతడి సొంత నాయకులే కిరాతకంగా హతమార్చిన ఘటన ఒడిశాలో వెలుగులోకి వచ్చింది. రూ. 22 లక్షల రివార్డు కలిగిన కమాండర్ అన్వేష్ అలియాస్ రేణును అతడి నాయకుడు, సహచరులు కలిసి హత్య చేసినట్లు ఒడిశా పోలీసులు ధృవీకరించారు.

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాకు చెందిన అన్వేష్ మావోయిస్టు పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. అతను మావోయిస్టు డివిజనల్ కమిటీ సభ్యుడిగా, అలాగే కలహండి-కంధమాల్‌-బౌధ్‌-నయాగఢ్‌ (కేకేబీఎన్) డివిజన్‌కు ప్లటూన్ కమాండర్‌గా ఉన్నాడు. అయితే గత కొంతకాలంగా మావోయిస్టు సిద్ధాంతాలపై విరక్తి చెందిన అన్వేష్  తన క్యాడర్‌లోని 12 మందితో  కలిసి ఒడిశా పోలీసుల ముందు లొంగిపోవాలని నిశ్చయించుకున్నాడు. 

 
ఈ విషయం పార్టీ అగ్రనేతలకు తెలియడంతో వివాదం మొదలైంది. లొంగిపోవద్దని వారు హెచ్చరించినా వినిపించుకోకుండా  అన్వేష్ లొంగిపోయే ప్రయత్నాలు చేయడం మావోయిస్టు రాష్ట్ర జోనల్ కమిటీ సభ్యుడు సుక్రుకు ఆగ్రహం తెప్పించింది. అన్వేష్ తన దళంతో సహా వెళ్లిపోతే ఆ ప్రాంతంలో పార్టీ ఉనికి దెబ్బతింటుందని భావించిన సుక్రు తన అనుచరులు సిలా, జగేష్‌లతో కలిసి కుట్ర పన్నాడు. గత నెల 29వ తేదీన అన్వేష్‌ను దారుణంగా హత్య చే మృతదేహాన్ని ఎవరికీ తెలియకుండా అడవిలో పాతిపెట్టారు. 
 
కంధమాల్ జిల్లా ఎస్పీ హరీష్ తెలిపిన వివరాల ప్రకారం దరింగాబాడీ పోలీస్ స్టేషన్ పరిధిలోని పకారీ రక్షిత అటవీ ప్రాంతంలో అన్వేష్ మృతదేహాన్ని ఖననం చేసినట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో బుధవారం నాడు ఎస్పీ నేతృత్వంలో పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లి మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్‌మార్టంకు పంపారు.  ఈ ఘటనపై యాంటీ నక్సల్ ఆపరేషన్ల ఉన్నతాధికారులు స్పందిస్తూ మావోయిస్టు పార్టీలో నాయకత్వం పట్ల కింది స్థాయి కేడర్‌లో తీవ్ర అసంతృప్తి ఉందని స్పష్టం అయిన్నట్లు తెలిపారు.
 
లొంగిపోవాలనుకునే వారిని భయపెట్టడానికే ఇలాంటి హత్యలకు పాల్పడుతున్నారని భావిస్తున్నారు. అన్వేష్ హత్యతో అడవుల్లో ఉన్న ఇతర మావోయిస్టుల్లో కూడా అభద్రత భావం పెరిగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం నిందితులైన సుక్రు, అతని అనుచరుల కోసం ఒడిశా పోలీసులు అటవీ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ముమ్మరం చేశారు.
 
జనవరి 2025 లో కంధమాల్ జిల్లాలో 127 మందికి పైగా మావోయిస్టులు చురుకుగా ఉన్నారు. నిరంతర ఆపరేషన్ల తర్వాత, ఆ సంఖ్య ఇప్పుడు 30 కంటే తక్కువకు తగ్గిందని పోలీస్ అధికారులు తెలిపారు.