దీర్ఘకాలిక ప్రాంతీయ ఉద్రిక్తతలు, పెరుగుతున్న సంఘర్షణ బెదిరింపుల తర్వాత, ఇజ్రాయెల్, అమెరికా శనివారం ఇరాన్‌పై ఒక ప్రధాన ఉమ్మడి దాడిని ప్రారంభించాయి. ఇస్లామిక్ రిపబ్లిక్ అంతటా అనేక లక్ష్యాలను ధ్వంసం చేశాయి. ట్రంప్ ఇరాన్ ప్రభుత్వాన్ని కూల్చడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తమ ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకోవాలని ఆయన ఇరాన్ ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈ దాడుల లక్ష్యాలలో ఇరాన్ సైన్యం, ప్రభుత్వ చిహ్నాలు, నిఘా లక్ష్యాలు ఉన్నాయి. ఇజ్రాయెల్, అమెరికా సైనిక దళాలు ఇరాన్‌పై మిస్సైళ్లతో విరుచుకుపడ్డాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని సుప్రీం లీడర్ 86 ఏళ్ల ఆయతుల్లా అలీ ఖమేనీ కార్యాలయాలు లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికా సైన్యాలు కలిసి ఈ దాడులు చేశాయి. ఆయా కార్యాలయాల సమీపంలోనే పేలుళ్లు జరిగాయి.
ఈ దాడులు జరిగిన సమయంలో కార్యాలయంలో ఖమేనీ ఉన్నారా లేదా అనేది తెలియరాలేదు. టెహ్రాన్‌లోని పాస్చేర్ జిల్లాలో పేలుళ్ల శబ్ధాలు వినిపించాయి. చాలా కట్టుదిట్టమైన కాంపౌండ్ ఉన్న నివాసం, ఆఫీసుపై అటాక్ జరిగింది. ఆ ప్రాంతంలోనే ఖమేనీ నివాసం ఉన్నది. ఫార్స్ న్యూస్ ఏజెన్సీ ప్రకారం సుమారు ఆ ప్రాంతంపై ఏడు మిస్సైళ్లతో దాడి చేసినట్లు తెలుస్తోంది.
అమెరికాతో సైనిక ఉద్రిక్తతల నేపథ్యంలో గత కొన్ని వారాలుగా ఆయన బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనడం మానేశారు. మరోవైపు టెహ్రాన్‌పై దాడి జరిగిన విషయాన్ని ఇరాన్ ప్రభుత్వ మీడియా సైతం ధ్రువీకరించింది. ప్రస్తుతం టెహ్రాన్ నగరమంతటా సైరన్లు మోగుతున్నాయని, బాంబు పేలుడు శబ్దాలను విన్నామని తమ కథనాల్లో పేర్కొంది.
కాగా, ఇరాన్‌పై దాడి చేసిన కొద్దిసేపటికే ఇరాన్ క్షిపణులను అడ్డుకునేందుకు ఉత్తర ఇజ్రాయెల్ ప్రయత్నిస్తుండగా పేలుళ్లు సంభవించాయి.ఇరాన్ కాల్పులను అణిచివేయడానికి ఇజ్రాయెల్ సైన్యం తన వైమానిక రక్షణ వ్యవస్థలను ఉపయోగిస్తుందని చెప్పిన వెంటనే పేలుళ్లు ప్రతిధ్వనించాయి.బహ్రెయిన్‌లో కూడా పేలుళ్లు సంభవించాయి.
అమెరికా నేవీ 5వ నౌకాదళ ప్రధాన కార్యాలయం క్షిపణి దాడికి గురైంది.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబిలో పెద్ద పేలుడు శబ్దం వినిపించిందని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. ఖతార్‌లో కూడా షెల్టర్ హెచ్చరికలు వినిపించాయి. ఇరాన్ క్షిపణిని పేట్రియాట్ రక్షణ వ్యవస్థ అడ్డగించిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ వెంటనే గగనతలాన్ని మూసివేసింది. దీంతోపాటు తమ దేశంలో మొబైల్ ఫోన్ సేవలను నిలిపివేసింది. అలాగే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సురక్షిత ప్రాంతానికి తరలించింది. తాము ఇరాన్‌పై దాడులు చేశామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ వెల్లడించారు. ఇజ్రాయెల్‌కు పొంచి ఉన్న ముప్పులను తొలగించేందుకే ఈ దాడి చేశామని స్పష్టం చేశారు.
మరో వైపు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇవాళ ఓ వీడియో సందేశాన్ని ట్రుత్ సోషల్‌లో పోస్టు చేశారు. ఇరాన్‌పై సైనిక ఆపరేషన్ చేపట్టినట్లు వెల్లడించారు. విషపూరిత ఇరానీ పాలకుల నుంచి అమెరికా ప్రజలను రక్షించాలన్నదే తమ ముఖ్య ఉద్దేశం అని పేర్కొన్నారు. అయితే ఇరాన్‌పై జరిపిన దాడులను ఇజ్రాయెల్ సహాయంతో చేపట్టినట్లు ఆయన ప్రత్యక్షంగా తన సందేశంలో వెల్లడించలేదు.
ఇరాన్‌లో చేపట్టిన మిలిటరీ ఆపరేషన్ వల్ల అమెరికా ప్రజలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని తన వీడియో సందేశంలో ట్రంప్ పేర్కొన్నారు. ఇరానీ పాలకులు చంపాలనుకుంటున్నారని, అయితే అమెరికా సాహసోపేత సైనికులు ఆ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉన్నదని, యుద్ధంలో ఇది సహజమే అని చెప్పారు. కానీ ఇది ఇప్పటి కోసం కాదు అని, భవిష్యత్తు కోసం అని, ఇదో ఉత్తమ కార్యమని తెలిపారు.
ఈనేపథ్యంలో యావత్ ఇజ్రాయెల్‌లో ఆయన అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఇజ్రాయెల్ దాడికి ప్రతిగా ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులు చేస్తుందనే ఆందోళనలతో ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో అత్యవసర పరిస్థితిని అమలు చేస్తున్నారు. అంతటా ఎయిర్ రైడ్ సైరన్లు మోగుతున్నాయి. బంకర్లలో దాక్కోవాలి అంటూ ప్రజలకు ఇజ్రాయెల్ ప్రభుత్వం ఎమర్జెన్సీ మెసేజ్‌లను పంపుతోంది.
ఇరాన్ – ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్‌లోని భారత ఎంబసీ ఇజ్రాయెల్‌లోని భారతీయులంతా సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని పిలుపునిచ్చింది. అత్యంత అప్రమత్తంగా, ముందుజాగ్రత్త చర్యలతో వ్యవహరించాలని వారికి సూచించింది. ఇజ్రాయెల్ అధికార వర్గాలు, హోం ఫ్రంట్ కమాండ్ ఎప్పటికప్పుడు జారీచేసే భద్రతా మార్గదర్శకాలను తు.చ తప్పకుండా పాటించాలని కోరింది.
More Stories
మొదటిసారి రంజీ ట్రోఫీ గెలుపొందిన జమ్మూ కాశ్మీర్
నోట్లు తరలిస్తుండగా కుప్పకూలిన విమానం.. 15 మంది మృతి
మారుతున్న వాతావరణం, ఆర్థిక అభద్రతతోయువతలో ఆందోళన