బొలివియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. కొత్తగా ముద్రించిన కరెన్సీ నోట్లను తీసుకెళ్తున్న సైనిక విమానం రాజధాని లా పాజ్ సమీపంలోని ఎల్ ఆల్టో నగరంలో కుప్పకూలింది. ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. బొలీవియా రక్షణ శాఖ మంత్రి మార్కెలో సాలినాస్ వెల్లడించిన వివరాల ప్రకారం బొలీవిమా ఎయిర్ఫోన్స్కు చెందిన సీ-130 హెర్క్యలస్ ట్రాన్స్‌ఫోర్ట్ విమానం శాంటాక్రూట్ నుంచి శుక్రవారం రాత్రి బయలుదేరింది.
ప్రతికూల వాతావరణ కారణంగా ల్యాండింగ్ అవుతున్న సమయంలో రన్‌వే నుంచి జారి పక్కనే ఉన్న పొలంలోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలోనే రద్దీగా ఉన్న రోడ్డుపై ఉన్న పలు వాహనాలను ఢీకొట్టింది. విమానం రెక్కలు విరిగిపోయాయి. విమానంలో మంటలు కూడా చెలరేగాయి. ఈ క్రమంలో రోడ్డుపైనా కనీసం 5 వాహనాలను ఢీకొంటూ వెళ్లింది. దీంతో ఈ ప్రమాదంలో 15 మంది మృతిచెందగా, 30 మంది గాయపడ్డారు.
మృతుల్లో విమానంలో ఉన్నవారితో పాటు రోడ్డుపై వెళ్తున్న సాధారణ ప్రజలు కూడా ఉన్నట్లు అధికారులు ధ్రువీకరించారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సెంట్రల్ బ్యాంక్ నుంచి కొత్తగా ముద్రించిన కరెన్సీని తరలిస్తుండగా ఈ ఘటన జరిగిందని బొలీవియా రక్షణ శాఖ మంత్రి మార్కెలో సాలినాస్ వెల్లడించారు. ఈ విమాన ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.
విమానం క్రష్ అయిన సమయంలో నేలపై చెల్లాచెదురుగా పడిపోయిన కరెన్సీ నోట్లను ప్రజలు ఏరుకునేందుకు పోటీ పడ్డారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయితే, ప్రమాదంలో చెల్లాచెదురైన కరెన్సీ నోట్లపై సీరియల్ నంబర్లు లేవని, ఆ నోట్లు ఇంకా చట్టబద్ధమైన కరెన్సీగా మారలేదని సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షుడు డేవిడ్ ఎస్పినోజా స్పష్టం చేశారు. ఆ కరెన్సీని చలామణీలోకి తీసుకొచ్చే ముందు లా పాజ్‌కు తరలిస్తున్నట్లుగా వెల్లడించారు.
ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తునకు బొలీవియా రక్షణ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. కాగా, ఇటీవల కొలంబియాలో విమానం ప్రమాదం జరిగింది. జనవరి 29న విమానం కుప్పకూలి పైలట్ సహా 15 మంది మృతి చెందారు. మృతుల్లో 13 మంది ప్రయాణికులు, ఇద్దు సిబ్బంది ఉన్నారు. కుకుటా నుంచి ఒకానాకు వెళ్తున్న విమానం ఈశాన్య కొలంబియాలోని నోర్టే డి శాంటాండర్ ప్రావిన్స్‌లోని పర్వత ప్రాంతంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పార్లమెంట్ సభ్యుడు ఒకరు ఉన్నారు.

More Stories
పాక్‌పై ఆత్మాహుతి దాడులకు సిద్ధమన్న ఆఫ్ఘనిస్తాన్
పాక్ ఎఫ్-16 కూల్చివేత, ఆఫ్ఘన్ తో ‘బహిరంగ యుద్ధం’
ఇజ్రాయెల్‌తో ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం