పాక్‌పై ఆత్మాహుతి దాడులకు సిద్ధమన్న ఆఫ్ఘనిస్తాన్

పాక్‌పై ఆత్మాహుతి దాడులకు సిద్ధమన్న ఆఫ్ఘనిస్తాన్

ఆఫ్ఘనిస్తాన్‌లోని కీలక స్థావరాలపై పాకిస్తాన్ వైమానిక దాడులు చేస్తూ నేరుగా ‘బహిరంగ యుద్ధం’ అంటూ ప్రకటించిన నేపథ్యంలో పాక్‌ను ధీటుగా ఎదుర్కొనేందుకు ఆఫ్ఘనిస్తాన్ ఆత్మాహుతి దాడులకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా సూసైడ్ స్క్వాడ్‌ను ఆఫ్ఘన్ సిద్ధం చేసిందని స్థానిక మీడియా పేర్కొంది. బెల్టు బాంబులు, కారు బాంబులతో తమ ఆత్మాహుతి దళం సిద్ధంగా ఉందని, పాక్‌లోని కీలక స్థావరాలపై దాడులు చేస్తామని వెల్లడించింది.

తాలిబన్ల అగ్రనేత హమ్దుల్లా ఫిత్రాత్ మాట్లాడుతూ పాకిస్తాన్ సరిహద్దులోని దురంద్ లైన్ వద్ద పక్తియా, పక్తికా, ఖోస్ట్ ప్రాంతాల్లో తమ సైన్యం దాడులు చేస్తోందని తెలిపారు.  మరోవైపు పాకిస్తాన్ కీలక పట్టణాలైన ఇస్లామాబాద్, అబోటాబాద్, నౌషేరా, జమ్రుద్ ప్రాంతాలపై తమ వాయుదళం వైమానిక దాడులు చేసిందని ఆఫ్ఘనిస్తాన్ రక్షణశాఖ వెల్లడించింది. శుక్రవారం రోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో దాడులు చేసినట్లు తెలిపింది. 

ఉదయం తమ దేశంలోని కాబూల్, కాందహార్ వంటి పట్టణాలపై దాడులు చేసినందుకు ప్రతీకారంగా తాము కూడా పాకిస్తాన్‌లోని స్తావరాలపై దాడులు చేసినట్లు ఆఫ్ఘన్ రక్షణ శాఖ పేర్కొంది. ఈ దాడులకు సంబంధించి 133 మంది ఆఫ్ఘన్ తాలిబన్లను అంతమొందించామని, 200 మందికిపైగా ఆఫ్ఘన్లు గాయపడ్డారని పాక్ పేర్కొంది. 

అయితే, తమ దాడుల్లో 55 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారని, 19 సైనిక పోస్టులను స్వాధీనం చేసుకున్నామని ఆఫ్ఘనిస్తాన్ ప్రకటించింది. ఇరువైపులా దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌లోని సైనిక స్తావరాలతోపాటు సాధారణ ప్రజలపై కూడా పాక్ దాడులు చేస్తోంది. 22 ఆఫ్ఘన్ మిలిటరీ క్యాంపులపై పాక్ దాడి చేసింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌తో చర్చలు జరపాలని ఆఫ్ఘనిస్తాన్‌ భావిస్తోంది.

కాగా, అఫ్గాన్లు తమ ప్రియమైన మాతృభూమిని కాపాడుకుంటారని అఫ్గానిస్థాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ స్పష్టం చేశారు. అఫ్గానిస్థాన్లోని నగరాలపై మళ్లీ పాకిస్థాన్ వైమానిక దాడులు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. శత్రువులు చేసే ఎలాంటి దాడులనైనా అఫ్గాన్లు ఐకమత్యం, సాహసాలతో ఎదుర్కొంటారని పేర్కొంటూ శుక్రవారం ఆయన ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ చేశారు.

మరోసారి కాబూల్, కాందహార్, పక్తియా నగరాలపై పాకిస్థాన్ యుద్ధ విమానం బాంబులు వేసిందని హమీద్ కర్జాయ్ తెలిపారు. ఇదే విధంగా వ్యవహరిస్తే హింసాకాండ, బాంబుదాడుల నుంచి పాకిస్థాన్‌కు ఎవరూ విముక్తిని కల్పించలేరని హెచ్చరించారు. ఈ సమస్యలన్నీ పాక్ చేతులారా సృష్టించుకున్నవేనని చెబుతూ ఇప్పటికైనా పాకిస్థాన్ తీరును మార్చుకొని, మంచి పొరుగుదేశంలా మసులుకోవాలని హితవు పలికారు. ఆఫ్ఘానిస్తాన్ తో గౌరవప్రదమైన నాగరిక సంబంధాలను బలోపేతం చేసుకోవాలని పాక్‌ను కర్జాయ్ కోరారు.