ఆప‌రేష‌న్ సింధూర్‌లో ఎస్‌-400 ఫైరింగ్‌

ఆప‌రేష‌న్ సింధూర్‌లో ఎస్‌-400 ఫైరింగ్‌
ఎస్‌-400 ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ సిస్ట‌మ్‌ కు చెందిన లైవ్ యాక్ష‌న్ వీడియోను భార‌తీయ వైమానిక ద‌ళం విడుదల చేసింది. గ‌త ఏడాది పాకిస్థాన్‌తో జ‌రిగిన ఆప‌రేష‌న్ సింధూర్ స‌మ‌యంలో ఎస్‌-400 మిస్సైల్ వ్య‌వ‌స్థ కీల‌క పాత్ర పోషించిన విష‌యం తెలిసిందే. అయితే తొలిసారి ఈ క్షిప‌ణి ఫైరింగ్‌కు చెందిన వీడియోను రిలీజ్ చేస్తున్న‌ట్లు ఐఏఎఫ్ పేర్కొన్న‌ది.
 
 సైనిక చ‌రిత్ర‌లోనే ఈ మిస్సైల్ వ్య‌వ‌స్థ ఓ రికార్డును స్థాపించిన‌ట్లు పేర్కొన్నది. చాలా దూరం నుంచి గ‌గ‌న‌త‌లంలోనే విమానాన్ని షూట్ చేసిన‌ట్లు ఐఏఎఫ్ త‌న వీడియో ద్వారా వెల్ల‌డించింది. ర‌ష్యా త‌యారీకి చెందిన ఎస్-400 డిఫెన్స్ సిస్ట‌మ్‌ ఆప‌రేష‌న్ సింధూర్ స‌మ‌యంలో పాకిస్థాన్ వైమానిక ద‌ళానికి చెందిన ఓ యుద్ధ విమానాన్ని నేల‌కూల్చింది. 
 
సుమారు 300 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను ఎస్‌-400 క్షిప‌ణి కూల్చిన‌ట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ భూభాగంలో ఆ విమానాన్ని కూల్చివేసిన‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. అయితే ఆ ఘ‌ట‌న‌కు చెందిన రేడార్ దృశ్యాల‌ను ఈ వీడియో ద్వారా రిలీజ్ చేశారు. శ‌త్రువు చాలా దూరం ఉండ‌వ‌చ్చు, కానీ కంటికి చిక్క‌కుండా ఉండ‌లేడ‌న్న‌ టైటిల్‌తో వైమానిక ద‌ళం ఈ వీడియోను విడుదల చేసింది.ఓ జెట్ స‌మీపిస్తున్న దృశ్యాల‌ను రేడార్ ఇమేజ్ గుర్తిస్తున్న‌ట్లు ఈ వీడియోలో ఉన్న‌ది. ఆ త‌ర్వాత ఎయిర్ డిఫెన్స్ వ్య‌వ‌స్థ యాక్టివేట్ అయిన‌ట్లు ఆ వీడియోలో చూపించారు. వాస్త‌వానికి ఈ వీడియోలో ఉన్నది ఆప‌రేష‌న్ సింధూర్‌కు చెందిన ఒరిజిన‌ల్ మిస్సైల్ ఫూటేజ్ కాదు అని, కానీ వాయు శ‌క్తి విన్యాసాల ప్ర‌మోష‌న్ కోసం ఈ వీడియోను రూపొందించిన‌ట్లు తెలుస్తోంది. 

రాజ‌స్థాన్‌లోని పోక్రాన్‌లో ఫిబ్ర‌వ‌రి 27వ తేదీ నుంచి వాయు శ‌క్తి విన్యాసాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేప‌థ్యంలో ఈ ప్ర‌మోష‌న‌ల్ వీడియోను  విడుదల చేశారు. ఆప‌రేష‌న్ సింధూర్ స‌మ‌యంలో పాకిస్థాన్‌కు చెందిన డ‌జ‌న్ విమానాల‌ను కూల్చిన‌ట్లు గ‌త అక్టోబ‌ర్‌లో ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్ష‌ల్ ఏపీ సింగ్ పేర్కొన్న విష‌యం తెలిసిందే. 

సుమారు 300 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న ఓ టార్గెట్‌ను కూల్చిన విష‌యాన్ని ఆయ‌న క‌న్ఫ‌ర్మ్ చేశారు. బ‌హుశా అది పీఏఎఫ్ సిగ్న‌ల్ ఇంటెలిజెన్స్ విమానం అయి ఉంటుంద‌ని, దాంతో పాటు ఎఫ్‌-16, జే-17 యుద్ధ విమానాల్లో కొన్ని ఉంటాయ‌ని త‌మ సిస్ట‌మ్ అంచ‌నా వేసిన‌ట్లు ఆయ‌న చెప్పారు. మ‌న స‌ర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్‌తో పాక్ భూభాగంలో కూడా ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించిన‌ట్లు ఆయ‌న పేర్కొన్న విష‌యం తెలిసిందే.