ఎన్సీఈఆర్టీ 8వ తరగతి పాఠ్యపుస్తకంలో ‘న్యాయవ్యవస్థలోని అవినీతి’ గురించి ఒక అధ్యాయం చేర్చడంపై తలెత్తిన వివాదం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ వివాదాస్పద అంశాన్ని పిల్లల పాఠ్యాంశంగా రూపొందించిన వారిని బాధ్యులుగా చేస్తామని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ప్రభుత్వానికి న్యాయవ్యవస్థపై పూర్తి గౌరవం ఉందని, ఆ వ్యవస్థను అగౌరవపరిచే ఉద్దేశం ఏమాత్రం లేదని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తేల్చి చెప్పారు. న్యాయవ్యవస్థను అప్రతిష్ఠపాలు చేసే ఒక సంఘటిత కుట్ర జరిగినట్లు కనిపిస్తోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ఈ కీలక ప్రకటన చేయడం గమనార్హం.
“న్యాయవ్యవస్థ పట్ల మాకు చాలా గౌరవం ఉంది. న్యాయవ్యవస్థ చెప్పింది మేము అంగీకరిస్తాము, పాటిస్తాము. జరిగిన దానికి నేను చాలా బాధపడ్డాను. దానికి నేను నా విచారం వ్యక్తం చేస్తున్నాను. ఈ విషయం నా దృష్టికి రాగానే పుస్తకాలను ఉపసంహరించుకోవాలని నేను వెంటనే ఎన్సీఈఆర్టీని ఆదేశించాను, తద్వారా అవి మరింత వ్యాప్తి చెందవు” అని మంత్రి పేర్కొన్నారు.
“న్యాయవ్యవస్థను అగౌరవపరిచే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదు. మేము దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నాము. దీనిపై విచారణ జరుపుతాము. ఈ అధ్యాయాన్ని సిద్ధం చేయడంలో పాల్గొన్న వారిపై చర్యలు తీసుకుంటాము. ఈ తప్పు పునరావృతం కాదని మేము న్యాయవ్యవస్థకు హామీ ఇవ్వాలనుకుంటున్నాము” అని ఆయన స్పష్టం చేశారు.
రాజ్యాంగబద్ధమైన సంస్థల అధికారాన్ని ప్రశ్నించే ఉద్దేశం తమకు లేదని ఎన్సీఈఆర్టీ స్పష్టం చేసింది. ఈ అంశంపై సమీక్ష నిర్వహించి, సంబంధిత అధికారులతో సంప్రదించి ఆ అధ్యాయాన్ని తిరిగి రాస్తామని చెప్పింది. 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి సవరించిన పుస్తకాలను అందుబాటులోకి తెస్తామని వెల్లడించింది. సంస్థాగత పవిత్రతను కాపాడతామని పునరుద్ఘాటిస్తూ ఎన్సీఈఆర్టీ మరోసారి క్షమాపణలు చెప్పింది.
ప్రస్తుతం ఈ పొరపాటు ఏ దశలో జరిగిందనే అంశంపై ఎన్సీఈఆర్టీ ఆరా తీస్తోంది. ముఖ్యంగా పాఠ్యపుస్తకాల తయారీలో అనుసరించిన ప్రక్రియను నిశితంగా పరిశీలిస్తున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. అంతేకాదు ఈ వివాదాస్పద అంశాన్ని పాఠ్యపుస్తకంలో చేర్చడానికి బాధ్యులైన వ్యక్తులను గుర్తించే పనిలో కౌన్సిల్ నిమగ్నమైంది.
మరోవైపు బీజేపీ కూడా ఎన్సీఈఆర్టీ పుస్తకంలో న్యాయవ్యవస్థలో అవినీతి గురించి ఉన్న వివాదాస్పద అధ్యయాన్ని ‘సున్నితమైన అంశంగా’ అభివర్ణించింది. తాము దేశ న్యాయవ్యవస్థను గౌరవిస్తామని, దాని నిష్పాక్షిక పనితీరు పట్ల గర్విస్తున్నామని పేర్కొంది.
“ఇది చాలా సున్నితమైన అంశం. పార్టీ ప్రతినిధిగా నేను ఒక విషయం స్పష్టం చేయాలని అనుకుంటున్నాను. భారత్లోనే కాకుండా ప్రపంచం మొత్తంలో భారత న్యాయవ్యవస్థ అంత స్వతంత్రమైనది, అర్హత కలిగినది మరెక్కడా లేదని నేను చెబుతాను. భారత న్యాయవ్యవస్థ పట్ల మనందరికీ ఎంతో గౌరవం, గర్వం ఉన్నాయి. ఇది ప్రతి ఒక్కరి హృదయంలోని భావన” అని పార్టీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర తెలిపారు.
More Stories
టి-20లో జింబాబ్వేపై భారత్ భారీ విజయం
‘ది కేరళ స్టోరీ 2’ విడుదలపై కేరళ హైకోర్టు స్టే
ఎన్సీఈఆర్టీ పాఠ్యగ్రంధంపై సుప్రీంకోర్టు నిషేధం