‘మా కాశ్మీర్ బడ్జెట్ మీ ఐఎంఎఫ్ బెయిలౌట్ ప్యాకేజీ కంటే రెట్టింపు’

‘మా కాశ్మీర్ బడ్జెట్ మీ ఐఎంఎఫ్ బెయిలౌట్ ప్యాకేజీ కంటే రెట్టింపు’
ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి 61వ సెషన్‌లో భారత్ మరోసారి పాకిస్థాన్‌ను ఉతికి ఆరేసింది. జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిపై ఇస్లామాబాద్ చేస్తున్న దుష్ప్రచారాన్ని భారత ప్రతినిధి అనుపమ సింగ్ ధీటుగా తిప్పికొట్టారు. పాకిస్థాన్ చేస్తున్న ఆరోపణలు వింటుంటే జమ్ముకశ్మీర్‌లో అభివృద్ధిని చూడలేదంటే పాక్ కలల్లో (లా లా ల్యాండ్‌లో) విహరిస్తూ ఉండొచ్చని అనిపిస్తోందని ఆమె ఎద్దేవా చేశారు. 
 
అక్కడితో ఆగకుండా మా జమ్మూ కాశ్మీర్ బడ్జెట్ మీ ఐఎమ్ఎఫ్ బెయిలౌట్ ప్యాకేజీ కంటే రెట్టింపు అని చెప్పి అందరి ముందు పరువు తీసేశారు.
జమ్మూ కాశ్మీర్ పురోగతిని చూసి పాకిస్థాన్ అసూయతో రగిలిపోతోందని అనుపమ సింగ్ ఘాటుగా విమర్శించారు. ముఖ్యంగా ఆర్థిక అంశాలను ప్రస్తావిస్తూ పాక్‌ను చెడుగుడాడుకున్నారు. 
 
“జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి కోసం కేటాయించిన వార్షిక బడ్జెట్ పాకిస్థాన్ ఇటీవల అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్ఎఫ్) నుంచి అడుక్కున్న బెయిలౌట్ ప్యాకేజీ కంటే రెండు రెట్లు ఎక్కువ” అని ఆమె పేర్కొన్నారు. ఇది వినేందుకు పాకిస్థాన్‌కు కష్టంగా ఉండొచ్చు కానీ అదే వాస్తవమని ఆమె స్పష్టం చేశారు.
 
పాకిస్థాన్ ప్రచారానికి మద్దతు పలుకుతున్న ఇస్లామిక్ సహకార సంస్థ (ఓఐసీ) వైఖరిని కూడా భారత్ తప్పుబట్టింది. పాకిస్థాన్ ఇచ్చే తప్పుడు సమాచారానికి ఓఐసీ ఒక ‘ఎకో ఛాంబర్’లా మారిపోయిందని ఆమె విమర్శించారు. ఇతర దేశాల వేదికలను వాడుకుని భారత్‌పై బురద జల్లడం పాక్‌కు అలవాటుగా మారిందని ఆమె ధ్వజమెత్తారు. అలాగే జమ్మూ కాశ్మీర్‌లో ప్రజాస్వామ్య ప్రక్రియలపై పాక్ చేసిన విమర్శలకు భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది. 
 
..“సివీలియన్ ప్రభుత్వాలు కనీసం తమ పదవీ కాలాన్ని కూడా పూర్తి చేసుకోలేని దేశం నుంచి ప్రజాస్వామ్యం గురించి పాఠాలు వినాల్సిన అవసరం మాకు లేదు” అని అనుపమ సింగ్ ఎద్దేవా చేశారు. ఇటీవలే జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాశ్మీర్ ప్రజలు భారీ ఎత్తున ఓటు వేయడమే వారు ఉగ్రవాదాన్ని తిరస్కరించారని చెప్పడానికి నిదర్శనమని ఆమె తెలిపారు.
 
ఈ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రస్తావిస్తూ, గత సంవత్సరం జమ్మూ కాశ్మీర్‌లో ప్రారంభించిన ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెనగా వర్ణించబడిన చీనాబ్ రైలు వంతెన వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సింగ్ ఎత్తి చూపారు. అంతర్జాతీయ వేదికలపై ప్రగల్భాలు పలకడం మానేసి, పాకిస్థాన్ తన దేశంలో ముదురుతున్న ఆర్థిక, అంతర్గత సంక్షోభాలను పరిష్కరించుకుంటే మంచిదని ఆమె హితవు చెప్పారు.
 
తన వ్యాఖ్యలను ముగిస్తూ, పాకిస్తాన్ “నిరంతర ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం” ద్వారా ఈ ప్రాంతాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తోందని సింగ్ ఆరోపించారు, జమ్మూ కాశ్మీర్ రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందుతూనే ఉందని ఆమె నొక్కి చెప్పారు.