హిసాత్మకంగా మారిన జెఎన్‌యు విద్యార్థుల లాంగ్‌ మార్చ్‌

హిసాత్మకంగా మారిన జెఎన్‌యు విద్యార్థుల లాంగ్‌ మార్చ్‌
కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖకు జెఎన్‌యు విద్యార్థులు చేపట్టిన లాంగ్‌ మార్చ్‌ గురువారం సాయంత్రం హింసాత్మకంగా మారింది.  జరిగిన హింసాత్మక ఘర్షణల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు జెఎన్‌యుఎస్‌యు మాజీ అధ్యక్షుడు నితీష్ కుమార్, ప్రస్తుత అధ్యక్షురాలు అదితి మిశ్రా, ఉపాధ్యక్షురాలు గోపికా బాబు, సంయుక్త కార్యదర్శి డానిష్ అలీలతో సహా 14 మందిని అరెస్టు చేశారు. 
 
అల్లర్లు చెలరేగిన వ్యక్తులు కర్రలు, బూట్లు విసిరి, భౌతిక దాడులకు పాల్పడ్డారని, ఎసిపి వేద్ ప్రకాష్, ఎసిపి సంఘమిత్ర, ఎస్‌హెచ్‌ఓ అతుల్ త్యాగి, ఎస్‌హెచ్‌ఓ అజయ్ యాదవ్ వంటి సీనియర్ అధికారులు సహా దాదాపు 25 మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారని పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఘర్షణలో కొంతమంది పోలీసులను కూడా కరిచినట్లు సమాచారం.
 
కాగా, దొరికిన వారిని దొరికినట్టు లాఠీలతో చితకబాదారని, పదుల సంఖ్యలో  విద్యార్థులు గాయపడ్డారని విద్యార్థులు ఆరోపించారు. కుల వివక్షను తొలగించడానికి యుజిసి నిబంధనలను అమలు చేయాలని, రోహిత్‌ వేముల చట్టం అమలు చేయాలని, దళిత వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన వైస్ ఛాన్సలర్  శాంతిశ్రీ పండిట్‌ రాజీనామా చేయాలని, ప్రభుత్వ విద్యాసంస్థలకు నిధులు పెంచాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు. నిరసన తెలిపిన జెఎన్‌యు విద్యార్థి సంఘం ఆఫీస్‌ బేరర్లపై వేసిన బహిష్కరణ వేటును వెనక్కి తీసుకోవాలని పెద్దపెట్టున నినాదాలు చేశారు.
 
యూనివర్శిటీలోని సబర్మతి హాస్టల్‌ నుండి ప్రారంభమైన లాంగ్‌ మార్చ్‌ ప్రధాన ముఖద్వారం వైపు సాగింది. విద్యార్థి సంఘాల జెండాలు, ప్లకార్డులు, అంబేద్కర్‌, పూలే, భగత్‌ సింగ్‌ వంటి నేతల చిత్ర పటాలు చేబూని విద్యార్థులు కదంతొక్కారు. ప్రధాన ముఖద్వారం వద్ద గేట్లకు తాళాలు వేసి పోలీసులు అడ్డుకున్నారు. యూనివర్శిటీ కి తాళాలు వేయడానికి మీరెవరని ప్రశ్నిస్తూ విద్యారులు తాళాలను పగలగొట్టి ముందుకు సాగారు. అప్పటికే ఏర్పాటు చేసిన బారికేడ్లతో పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లను దాటి ముందుకు సాగినప్పుడు, పోలీసులు, భద్రతా దళాలతో ఘర్షణకు పాల్పడ్డారు. 
 
సోషల్ మీడియాలో వెలువడిన హింసాత్మక సంఘటనల వీడియోలు  జెఎన్‌యుఎస్‌యుతో సంబంధం ఉన్న విద్యార్థులు పోలీసు సిబ్బందిని ఎదుర్కోవడం, అధికారులను చెంపదెబ్బ కొట్టడం, దుర్భాషలాడడం,  భద్రతా దళాలపై కర్రలు విసరడం వంటివి చూపిస్తున్నాయని పోలీస్ అధికారులు ఆరోపించారు.
 
ఒక క్లిప్‌లో, పీహెచ్‌డీ విద్యార్థి నితీష్ కుమార్ విశ్వవిద్యాలయం గోడ ఎక్కి విద్యార్థులను రెచ్చగొడుతున్నట్లు కనిపిస్తుండగా, మరొక వీడియోలో శ్రేయ్ అనే విద్యార్థి పోలీసు అధికారిని చెంపదెబ్బ కొట్టడాన్ని చూపిస్తుంది. ఒక ప్రత్యేక క్లిప్‌లో విద్యార్థులు భద్రతా సిబ్బందిని దుర్భాషలాడుతూ, క్యాంపస్ వెలుపల మోహరించిన రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఎఎఫ్) జవాన్‌పై కర్రలు విసురుతున్నట్లు చూపిస్తుంది.