టి-20లో జింబాబ్వేపై భారత్‌ భారీ విజయం

టి-20లో జింబాబ్వేపై భారత్‌ భారీ విజయం
టి-20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత జట్టు జూలు విదిల్చింది. సెమీస్‌ రేసులో నిలవాలంటే భారీ విజయం అవసరమైన వేళ చెన్నైలోని  చిదంబరం స్టేడియంలో జరిగిన గ్రూప్‌-1 సూపర్‌-8 మ్యాచ్‌లో జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించి ఆ ఆశలను సజీవంగా ఉంచుకుంది. బ్యాటర్లు సమిష్టిగా బాదడంతో ప్రత్యర్థి ఆహ్వానం మేరకు మొదట బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా 20 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 256 పరుగుల రికార్డు స్కోరు చేసింది.
తొలిగా బ్యాటింగ్‌కు దిగిన భారతజట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 256పరుగుల భారీస్కోర్‌ నమోదు చేసింది. టి20 ప్రపంచకప్‌ చరిత్రలో ఇది రెండో అత్యధిక స్కోర్‌. భారీ ఛేదనలో జింబాబ్వే నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 184 పరుగులే చేసింది. ఓపెనర్‌ బెన్నెట్‌(97నాటౌట్‌; 59బంతుల్లో 8ఫోర్లు, 6సిక్స ర్లు)కి తోడు కెప్టెన్‌ సికిందర్‌ రాజా(31) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించారు. 
 
చివరకు కొండంత లక్ష్యాన్ని ఛేదించలేక జింబాబ్వే 184పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో ఆర్ష్‌దీప్‌ సింగ్‌కు మూడు, వరుణ్‌ చక్రవర్తి, అక్షర్‌ పటేల్‌, దూబేకు ఒక్కో వికెట్‌ దక్కాయి. ఈ గెలుపుతో భారతజట్టు గ్రూప్‌-1లో 2వ స్థానానికి ఎగబాకింది. మార్చి 1న ఆదివారం వెస్టిండీస్‌పై భారతజట్టు గెలిస్తేనే సెమీస్‌ బెర్త్‌ దక్కనుంది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ హార్దిక్‌ పాండ్యాకు దక్కింది.
 
టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత ఓపెనర్లు శుభారంభమిచ్చారు. అభిషేక్‌కు జతగా ఇన్నింగ్స్‌ ఆరంభించిన సంజు శాంసన్‌(24) క్రీజ్‌లో ఉన్నంతసేపు తనదైన స్టయిల్‌లో చెలరేగి ఆడాడు. రెండోబంతినే సిక్సర్‌గా మలిచిన సంజు.. ఆ తర్వాత మపోస ఓవర్లు ఫోర్‌ కొట్టాడు. భారతజట్టు స్కోర్‌ 46పరుగుల వద్ద సంజు శాంసన్‌(24) ఔటయ్యాడు. 
ఆ తర్వాత అభిషేక్‌(55), ఇషాన్‌ కిషన్‌(38) కూడా అదే జోరును కొనసాగించారు. పవర్‌ ప్లే చివరి బంతిని అభిషేక్‌ సిక్సర్‌గా మలిచాడు. 
కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌(33) కూడా అదే స్థాయిలో బ్యాటింగ్‌ చేశారు. చివర్లో హార్దిక్‌ పాండ్యా(50నాటౌట్‌; 23బంతుల్లో 2ఫోర్లు, 4సిక్సర్లు), తిలక్‌ వర్మ(44నాటౌట్‌; 16బంతుల్లో 3ఫోర్లు, 4సిక్సర్లు) ధనా ధన్‌ ఇన్నింగ్స్‌తో మెరిసారు. దీంతో భారతజట్టు నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 256పరుగుల భారీస్కోర్‌ నమోదు చేసింది. జింబాబ్వే బౌలర్లలో నరవా, ముజరబ్బాని, మపోసా, సికిందర్‌ రాజాలకు ఒక్కో వికెట్‌ దక్కాయి.