అమెరికాతో పీయూష్ గోయల్ ఫలప్రదమైన చర్చలు

అమెరికాతో పీయూష్ గోయల్ ఫలప్రదమైన చర్చలు
అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్‌ లుట్నిక్‌, భారత్‌లోని యుఎస్‌ రాయబారి సెర్గియో గోర్‌లతో ఫలప్రదమైన చర్చలు జరిగాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. గురువారం హోవార్డ్‌ లుట్నిక్‌, సెర్గియో గోర్‌లతో పియూష్‌ సమావేశమయ్యారు. భారత్‌-అమెరికా మధ్య ఆర్థిక, వాణిజ్య భాగస్వామ్యాన్ని మరింత విస్తరించడంపై ఈ సమావేశంలో ఫలప్రదమైన చర్చలు జరిగినట్లు గోయల్‌ ఎక్స్‌లో వెల్లడించారు. 
 
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విధించిన టారిఫ్‌లను అక్కడి సుప్రీంకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో కుదుర్చుకున్న ప్రాథమిక ఒప్పందం ప్రకారం  భారత ఎగుమతులపై అమెరికా టారిఫ్‌లను 50 శాతం నుండి 18 శాతానికిి తగ్గించాలని, ప్రతిగా భారత్‌ ఐదేళ్లలో 500 బిలియన్‌ డాలర్ల విలువైన అమెరికన్‌ వస్తువులను కొనుగోలు చేయాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి. 
 
తాజా కోర్టు తీర్పుతో చర్చలకు మరింత అవకాశం లభించిందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. యుఎస్‌ అంబాసిడర్‌ గోర్‌ స్పందిస ఇది అత్యంత ఉత్పాదకతతో కూడిన లంచ్‌ అని, భారత్‌-అమెరికా మధ్య సహకారానికి చాలా రంగాలు ఉన్నాయని తెలిపారు. ఇటీవలి యుఎస్‌ సుప్రీంకోర్టు తీర్పుపై భారత ప్రభుత్వం స్పందిస్తూ. ఆ పరిణామాలను. వాటి ప్రభావాలను అధ్యయనం చేస్తున్నామని తెలిపింది. 
 
అయితే ఒప్పందంపై పునరాలోచన చేస్తున్నట్లు ఎక్కడా పేర్కొనకపోవడం గమనార్హం. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పుతో సంబంధం లేకుండా తాము టారిఫ్‌లు విధించబోతున్నామని లుట్నిక్‌ ఒక వార్తా సంస్థతో పేర్కొనడం ఆందోళకరం. టారిఫ్‌లపై గత ఏడాది కాలంగా భాగస్వామ్య దేశాలకు చెబుతూనే ఉన్నామని పేర్కొన్నారు. 
 
అందుకే కేసు పెండింగ్‌లో ఉన్నప్పటికీ వారు ఈ ఒప్పందాలపై సంతకం చేశారని స్పష్టం చేశారు. ఈ ఒప్పందాలు మంచివని వారు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నామని తెలిపారు. తాము వాటికి కట్టుబడి ఉంటామని, తమ భాగస్వాములు కూడా కట్టుబడి ఉంటారని ఆశిస్తున్నామని చెప్పారు. ఒప్పందం రద్దయిందని ఇప్పటివరకు ఎవరూ తనతో చెప్పలేదనడం గమనార్హం.