ఢిల్లీ మద్యం పాలసీ కేసును కొట్టివేసిన సీబీఐ కోర్టు

ఢిల్లీ మద్యం పాలసీ కేసును కొట్టివేసిన సీబీఐ కోర్టు
* కేజ్రీవాల్‌, సిసోడియా, కవితలకు భారీ ఊరట
ఢిల్లీ లిక్క‌ర్ పాల‌సీ కేసు నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ నేత‌ల‌కు ఉప‌శమ‌నం క‌లిగింది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అర‌వింద్ కేజ్రీవాల్‌, మాజీ ఉప ముఖ్యమంత్రి మ‌నీష్ సిసోడియాలపై ఉన్న ఆరోప‌ణ‌ల‌ను కొట్టిపారేశారు. ఆ ఇద్ద‌రికీ ఆ కేసులో న‌మోదు అయిన అభియోగాల నుంచి విముక్తి ల‌భించింది. మ‌ద్యం విధానాన్ని రూపొందించే క్ర‌మంలో అవినీతి జ‌రిగిన‌ట్లు వ‌చ్చిన ఆరోప‌ణ‌ల్లో వాస్త‌వం లేద‌ని ఢిల్లీ కోర్టు పేర్కొన్న‌ది. 

ఎక్సైజ్ పాలసీలో ఎలాంటి కుట్ర లేదా నేరపూరిత ఉద్దేశ్యం లేదని న్యాయస్థానం పేర్కొంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న కల్వకుంట్ల కవిత సహా 23 మందికి విముక్తి కల్పిస్తూ తీర్పు ఇచ్చింది. వారిపై చర్యలు తీసుకోవడానికి తగిన సాక్ష్యాలను సమర్పించడంలో సీబీఐ విఫలమైందని పేర్కొంది.  ఈ కేసులో స్పెష‌ల్ జ‌డ్జి జితేంద్ర సింగ్ ఆదేశాలు ఇచ్చారు. కేజ్రీవాల్‌, సిసోడియాలతో పాటు మ‌రో 21 మందిని ఆ కేసు నుంచి డిశ్చార్జ్‌ చేస్తున్న‌ట్లు చెప్పారు.

సీబీఐ దాఖ‌లు చేసిన ఛార్జ్‌షీట్‌ను స్వీక‌రించేందుకు కోర్టు నిరాక‌రించింది. ఛార్జ్‌షీట్‌లో చాలా లోపాలు ఉన్నాయ‌ని, ఎటువంటి సాక్ష్యాలు లేని అంశాలు చాలా ఉన్న‌ట్లు కోర్టు చెప్పింది.నిందితులపై ప్రాథమిక కేసులు నమోదు చేయలేదని, సీబీఐ ఛార్జిషీట్‌లో అనేక లోపాలు ఉన్నాయని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఏ సాక్షి, వాంగ్మూలంతో చార్జ్‌షీట్‌లోని అభియోగాలు సరిపోవడం లేదని పేర్కొన్నారు. 

ఢిల్లీ మద్యం విధాన రూపకల్పన కేసులో “సౌత్ గ్రూప్” అనే పదాన్ని ఉపయోగించడంపై కోర్టు అభ్యంతరం వ్యక్తంచేసింది. అలాంటి వ్యక్తీకరణకు స్పష్టత, సరైన ఆధారాలు లేవని తెలిపింది. ఈ కేసులో ఉన్న 23 మంది నిందితుల‌పై సీబీఐ ప్ర‌త్య‌క్షంగా ఎటువంటి ఆధారాల‌ను చూపించ‌లేక‌పోయిన‌ట్లు కోర్టు పేర్కొన్న‌ది. కేవ‌లం అప్రూవ‌ర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేసును న‌మోదు చేసిన సీబీఐ వ్య‌వ‌హార శైలిని కోర్టు త‌ప్పుప‌ట్టింది. ఒక‌వేళ ఇలాంటి వ్య‌వ‌హారాన్ని అనుమ‌తిస్తే, అప్పుడు రాజ్యాంగ సూత్రాల‌ను ఉల్లంఘించిన‌ట్లు అవుతుంద‌న స్పష్టం చేసింది. 

నిందితుడికి క్ష‌మాభిక్ష పెట్టి, ఆ నిందిత వ్య‌క్తిని అప్రూవ‌ర్‌గా మార్చి, ఆ వ్య‌క్తి నుంచి వాంగ్మూలం తీసుకుని ద‌ర్యాప్తును కొన‌సాగించ‌డాన్ని, దాని ఆధారంగా వ్య‌క్తుల‌ను త‌ప్పుప‌ట్ట‌డాన్ని న్యాయ‌మూర్తి ఖండించారు. సీబీఐ అధికారుల‌పై శాఖాప‌ర‌మైన ద‌ర్యాప్తున‌కు ఆదేశించ‌నున్న‌ట్లు ఢిల్లీ కోర్టు పేర్కొన్న‌ది. 2022, జూలై 20వ తేదీన లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ వీకే స‌క్సేనా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీబీఐ త‌న కేసును న‌మోదు చేసింది.

కన్నీరు పెట్టుకున్న కేజ్రీవాల్

కోర్టు తీర్పు అనంతరం ఆవరణలో మీడియా ముందు మాట్లాడుతూ కన్నీటిపర్యంతమయ్యారు కేజ్రీవాల్‌. “ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన ఐదుగురు నేతలను జైలులో పెట్టారు. సీఎం, డిప్యూటీ సీఎం సహా ఐదుగురిని జైలులో పెట్టారు. కేజ్రీవాల్‌ ఏనాడూ అవినీతికి పాల్పడలేదు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడినవాళ్లం మేం. ప్రధాని మోదీ కేవలం విపక్షాలపైనే దృష్టి పెట్టారు” అని ఆరోపించారు. 

“ప్రజల సమస్యలను ప్రధాని మోదీ ఏమాత్రం పట్టించుకోరు. నిరుద్యోగం, ఢిల్లీలో కాలుష్యం గురించి మోదీ మాట్లాడరు. విపక్ష నేతలను రాజకీయంగా వేధించడం గురించి మోదీ ఆలోచిస్తారు” అని ధ్వజమెత్తారు. తాను, మనీశ్ సిసోదియా ఇద్దరూ నిజాయితీపరులు అని కోర్టు చెప్పిందని ఆయన పేర్కొన్నారు. కోర్టు తీర్పు నేప‌థ్యంలో మాజీ ఎమ్మెల్సీ క‌విత స్పందిస్తూ. త‌న ఎక్స్ అకౌంట్‌లో స‌త్య‌మేవ జ‌య‌తే అని పోస్టు చేశారు.

మరోవైపు డిల్లీ మద్యం కేసులో రౌజ్‌ అవెన్యూ కోర్టు తీర్పును డిల్లీ హైకోర్టులో సవాల్‌ చేస్తామని సీబీఐ వర్గాలు తెలిపాయి. ఈ కేసులో ఢిల్లీ మాజీ  కేజ్రీవాల్, సిసోడియాలను విడుదల చేయడాన్ని దిల్లీ హైకోర్టులో వెంటనే సవాలు చేస్తామని పేర్కొన్నాయి. దర్యాప్తులోని అనేక అంశాలను ట్రయల్ కోర్టు పరిగణించలేదని, అందుకే అప్పీల్ అవసరమని భావిస్తున్నట్లు తెలిపాయి.