8వ తరగతి సోషల్ టెక్ట్స్‌బుక్‌లో ”న్యాయవ్యవస్థలో అవినీతి” అనే అధ్యాయాన్ని చేర్చినందుకు విద్యాశాఖ కార్యదర్శి, ఎన్‌సిఇఆర్‌టి డైరెక్టర్ దినేష్ ప్రసాద్ సక్లానీకి సుప్రీంకోర్టు గురువారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కోర్టు ధిక్కారం లేదా ఇతర చట్టాల కింద చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరించాలని నోటీసుల్లో పేర్కొంది. ఎన్‌సిఇఆర్‌టి 8వ తరగతి సోషల్ టెక్ట్స్‌బుక్‌లో ముద్రించిన వివాదాస్పద అధ్యాయాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది.
అభివృద్ధి బృందంలోని సభ్యులందరి పేర్లు, అర్హతలు, యోగ్యతా పత్రాలు సహా అధ్యాయాన్ని ఆమోదించిన టీచింగ్, లెర్నింగ్ మెటీరియల్స్ కమిటీ వివరణాత్మక రికార్డులను సమర్పించాలని ఎన్‌సిఇఆర్‌టిని ఆదేశించింది. ”వారు తుపాకీ పేల్చారు.. న్యాయవ్యవస్థ నేడు రక్తసిక్తమవుతోంది” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ అంశంలో చాలా లోతైన దర్యాప్తు చేపట్టాలని భావిస్తున్నామని, దీనికి కారణమైన వారిని గుర్తించాలని, వాళ్లు ఎవరో తాము తేల్చుతామని, నిశితంగా ఈ కేసును పరిశీలిస్తామని, ఈ కేసును మూసివేసే ప్రసక్తే లేదని సీజేఐ సూర్యకాంత్ స్పష్టం చేశారు.
ఎన్‌సిఇఆర్‌టి టెక్స్ట్ బుక్స్‌పై, డిజిటల్ విభాగంపై కూడా పూర్తి నిషేధం విధించింది. ఎన్‌సిఇఆర్‌టి క్షమాపణలు చెప్పినప్పటికీ సుమోటోగా విచారణను నిలిపివేసేందుకు ధర్మాసనం నిరాకరించింది. పాఠ్యపుస్తకాలు, డిజిటల్ విభాగంపై కూడా పూర్తి నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది. ఈ ఉత్తర్వులను మీరిన ఏ చర్య అయినా న్యాయపరిపాలనలో ప్రత్యక్ష జోక్యంగా పరిగణించబడుతుందని, కోర్టు ధిక్కారానికి దారితీస్తుందని హెచ్చరించింది.
మరోవైపు, కేంద్ర విద్యాశాఖ తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పాఠ్యాంశం వ్యవహారంలో సుప్రీం కోర్టుకు భేషరతుగా క్షమాపణలు చెప్పారు. ఈ వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్థించుకోవడం లేదని కోర్టుకు వెల్లడించారు. బాధ్యతాయుతమైన వ్యక్తులు అలాంటి పనిలో ఇకపై ఉండరని కోర్టుకు తెలిపారు. అది చాలా చిన్న పరిణామమని చెప్పిన సీజేఐ ప్రచురించిన పుస్తకం ఇప్పటికే మార్కెట్‌లో ఉందని, ఒక కాపీ తనకు కూడా వచ్చిందని తెలిపారు.
ఈ అంశాన్ని పట్టించుకోకుండా వదిలేస్తే న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతుందని పేర్కొన్నారు. ఈ అంశంలో మీడియా బాధ్యతాయుతమైన పాత్ర పోషించిందని సీజేఐ ధర్మాసనం అభినందించింది. తదుపరి విచారణను మార్చి 11కు వాయిదా వేసింది.

More Stories
గ్రహ సరిహద్దులు దాటుతున్న వాతావరణ సంక్షోభం
నిరసన ప్రదర్శనలతో కేరళ ఆరోగ్యమంత్రికి గాయాలు
టాప్ -5లోకియువ సంచలనం ఇషాన్ కిషన్