కాంగ్రెస్ ప్రభుత్వపు బలవంతపు కూల్చివేతలకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ చేపట్టిన “మూసీ గోస – బీజేపీ భరోసా” పరామర్శ యాత్ర మూసీ పరివాహక ప్రాంతాల్లో గురువారం కొనసాగింది. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామ్ చందర్ రావు బాపూఘాట్ వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి యాత్రను ప్రారంభించారు.
అనంతరం మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్ వాసులతో ముఖాముఖి సమావేశమై, మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి కార్యక్రమం పేరుతో ఇళ్లు కోల్పోతున్న బాధిత కుటుంబాల ఆవేదనను తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే బలవంతపు చర్యలను నిలిపివేసి, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. యాత్ర గంధంగూడ, విఘ్నేశ్వర కాలనీ, కేకే కాలనీ ప్రాంతాల్లో కొనసాగింది.
ఇళ్లను కోల్పోతామన్న భయంతో ఉన్న కుటుంబాలను పరామర్శిస్తూ, బీజేపీ వారి పక్షాన నిలబడుతుందని రాష్ట్ర అధ్యక్షుడు భరోసా కల్పించారు. అలాగే గండి మైసమ్మ ఆలయ సమీపంలో మూసీ నది పరివాహక ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ, ప్రభుత్వ చర్యలపై వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేశారు. మూసీ శుద్ధి పేరుతో పేద ప్రజల ఇళ్లను కూల్చివేయడం అన్యాయమని, అభివృద్ధి ప్రజల కన్నీళ్లపై నిర్మించకూడదని బీజేపీ స్పష్టం చేసింది.
బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు. లోటస్ నేషనల్ స్కూల్ వద్ద ఉన్న భూమిని, చుట్టుపక్కల ఉన్న అపార్ట్‌మెంట్‌లను పరిశీలించి, స్థానిక ప్రజలతో మాట్లాడి, ప్రాజెక్ట్ ప్రభావం ఎలా ఉండబోతోందో క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారు. గాంధీ సరోవర్ పేరుతో పేదల ఇళ్లు, జవాన్ల ఫ్లాట్లను కూలగొడుతున్నారని రామచందర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. పేదల ఇండ్లు కూల్చితే ఊరుకోబోమని హెచ్చరించారు.
గుజరాత్‌లో సర్దార్ సరోవర్ ప్రాజెక్టు కోసం పేదల ఇళ్లను కూల్చలేదని గుర్తు చేశారు. శాస్త్రీయబద్ధంగా, పర్యాటకం అభివృద్ధి చేసేలా, ఉపాధి కల్పించేలా చేయడం జరిగిందని చెప్పారు. పేదల ఇళ్లను కూల్చి బఫర్‌జోన్‌ను పెంచాల్సిన అవసరం లేదని, రైతులు, పేదలు కూరగాయలు సాగు చేసుకుంటున్న భూములు లాక్కోవద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మూసీ సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేస్తూ మూసీ నది శుద్ధి కావాలని, కాలుష్యం పోవాలని, దుర్వాసన లేని ప్రవాహం ఉండాలని చెప్పారు.
కానీ సుందరీకరణ పేరుతో పేద ప్రజలను ఇళ్ల నుంచి తరిమేయడం, భూములు లాక్కోవడం, భయపెట్టే పాలన చేయడం సరికాదని ఆయన హెచ్చరించారు. పేదల భూములను బలవంతంగా లాక్కోవడాన్ని మాత్రమే తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఆదిత్య ఎన్ క్లేవ్ ను సందర్శించామని చెబుతూ అక్కడ ఇండ్లు బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో లేవని చెప్పారు.
రాష్ట్రం చేపట్టిన గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు కేంద్రం సహకరిస్తోందనేది అవాస్తవమని పేర్కొంటూ ఈ ప్రాజెక్టును పూర్తిగా రాష్ట్రప్రభుత్వమే చేపట్టిందని స్పష్టం చేశారు. అన్ని అనుమతులు తీసుకుని నిర్మించిన ఇళ్లు, అపార్ట్‌మెంట్లను కూల్చుతున్నారని మండిపడ్డారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం పేదల ఇళ్లను కూల్చాలని చూస్తున్నారని బిజెపి నేత ఆరోపించారు
అందుకే రేవంత్ ప్రభుత్వం మూసీ సుందరీకరణకు ముందు చేపట్టవలసిన పనులు ఎన్నో ఉన్నాయని పేర్కొంటూ మూసీ నీటిని శుద్ధి చేయడానికి అవసరమైన ప్లాంట్లు నెలకొల్పాలని చెప్పారు. పరిశ్రమల నుంచి వెలువడుతున్న రసాయనాలు, వ్యర్థాలు, డ్రైనేజీ కలవకుండా నియంత్రించాలని తెలిపారు.

More Stories
ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అది మానవాళికి ప్రమాదకరమే
గ్రహ సరిహద్దులు దాటుతున్న వాతావరణ సంక్షోభం
రాష్ట్రపతి భవన్లో కొత్త విగ్రహం… సి. రాజగోపాలాచారి