ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో బ్యాటింగ్ విభాగంలో గత నెల టాప్ -50లో కూడా లేని టీమ్ఇండియా యువ సంచలనం ఇషాన్ కిషన్ తాజా ర్యాకింగ్స్లో ఏకంగా టాప్ -5లోకి దూసుకొచ్చేశాడు. రెండేళ్ల తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్లో రీఎంట్రీలో న్యూజిలాండ్‌తో రెచ్చిపోయిన అతడు, ప్రస్తుత టీ20 వరల్డ్‌కప్‌లోనూ రాణిస్తున్నాడు. దీంతో లేటెస్ట్ ర్యాకింగ్స్లో ఇషాన్ మరో మూడు స్థానాలు మెరుగుపర్చుకొని ఐదో ర్యాంక్ దక్కించుకున్నాడు.
మరోవైపు యంగ్ బ్యాటర్ తిలక్ వర్మ టాప్ 5 నుంచి చోటు కోల్పోయాడు. టీ20 ప్రపంచ కప్ లో పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్న తిలక్ తాజా ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు దిగజారిపోయాడు. దీంతో ప్రస్తుతం అతడు ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక సౌతాఫ్రికా సెన్సేషన్ ప్లేయర్ డివాల్డ్ బ్రేవిస్ ఏకంగా 10 స్థానాలు ఎగబాకాడు. ఫలితంగా అతడు టాప్ 10లోకి ప్రవేశించాడు. ఇక టీమ్ఇండియా ఓపెనర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటివరకు పెద్దగా రాణించకపోయినా బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు.
రెండో స్థానంలో ఉన్న ఇంగ్లండ్ ఆటగాడు ఫిల్‌సాల్ట్ ఉన్నాడు. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన పాకిస్థాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ రెండు స్థానాలు మెరుగుపరుచుకుని మూడో ర్యాంకును అందుకున్నాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా మళ్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. భారత ఆల్‌రౌండర్ శివమ్ దూబే రెండు స్థానాలు మెరుగుపరుచుకుని ఏడో ర్యాంకుకు చేరాడు.
ప్రస్తుత వరల్డ్‌కప్‌లో తిలక్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. వన్‌డౌన్‌లో బరిలోకి దిగుతున్నా ఇప్పటిదాకా అతడి నుంచి పెద్ద ఇన్నింగ్స్ రాలేదు. మొత్తం 5 మ్యాచ్‌ల్లో అతడు కేవలం 107 పరుగులే చేశాడు. స్ట్రైక్ రేట్ కూడా 118 మాత్రమే ఉండడం గమనార్హం. దీంతో జింబాబ్వేతో సూపర్ 8 మ్యాచ్‌లో అతడి స్థానం ప్రమాదంలో పడింది. అతడిని పక్కన పెట్టేసి ఇంకో ఆటగాడికి అవకాశం ఇవ్వాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
బౌలింగ్ విభాగంలోనూ భారత ఆధిపత్యం కనిపించింది. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన నంబర్ వన్ ర్యాంకును నిలబెట్టుకున్నాడు. భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా తన ర్యాంకును మెరుగుపరుచుకుని ఎనిమిదో స్థానానికి చేరుకున్నాడు. మరోవైపు దక్షిణాఫ్రికా పేసర్ కార్బిన్ బాష్ ఏకంగా 21 స్థానాలు ఎగబాకి మూడో ర్యాంకుకు చేరుకున్నాడు.

More Stories
గ్రహ సరిహద్దులు దాటుతున్న వాతావరణ సంక్షోభం
నిరసన ప్రదర్శనలతో కేరళ ఆరోగ్యమంత్రికి గాయాలు
ఢిల్లీ పేరును కూడా ఇంద్రప్రస్థగా మార్చండి