మాజీ ప్రధాని జస్టిన్‌ట్రూడో హయాంలో భారత్‌తో బలహీనపడిన సంబంధాలను కెనడా చక్కదిద్దుతోంది. ఆ దేశ ప్రస్తుత ప్రధాని మార్క్ కార్నీ భారత్ పర్యటన వేళ కెనడా కీలక వ్యాఖ్యలు చేసింది. తమ దేశంలో జరిగిన హింసాత్మక నేరాలతో భారత్‌కు ఎలాంటి సంబంధం లేదని నమ్ముతున్నామని పేర్కొంది. ఒట్టావా, ఢిల్లీ మధ్య దౌత్య సంబంధాలు పురోగతి సాధించాయని కెనడా ప్రభుత్వం పేర్కొంది.
జాతీయ భద్రతా సలహాదారుల స్థాయితో పాటు బలమైన దౌత్య సంబంధాలలో భారత్-కెనడా నిమగ్నమై ఉన్నాయని వివరించింది. గతంలో భారత్‌పై చేసిన ఆరోపణలపై విచారణలు, ఇతర కార్యకలాపాలను కొనసాగించడం లేదని ఓ సీనియర్ అధికారి తెలిపారు. “జాతీయ భద్రతా సలహాదారులతో సహా మాకు చాలా బలమైన దౌత్య సంబంధాలు ఉన్నాయి. ఆ కార్యకలాపాలు కొనసాగడం లేదని మేము ఖచ్చితంగా చెప్పగలమని నేను భావిస్తున్నాను” అని పేరు చెప్పకూడదనే షరతుపై మాట్లాడిన సీనియర్ అధికారి ఒకరు స్పష్టం చేశారు.
ఇలా ఉండగా, కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ గురువారం భారత్ పర్యటనకు వస్తున్నారు. భారత్ లో ఆయనకిది తొలి పర్యటన. ముంబై నుంచి మొదలయ్యే కార్నీ పర్యటన మార్చి 7 వరకు కొనసాగుతుంది. మార్చి 2న ప్రధాని మోదీని కలిసేందుకు ఢిల్లీ వెళ్లనున్నారు. దీంతోపాటు ఆర్థిక సంబంధాలు బలోపేతం కోసం పలువురు వ్యాపార వేత్తలతో సమావేశం కానున్నారు.
ఇరు దేశాల సంబంధాలపై ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. క్లీన్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రక్షణ, అధునాతన సాంకేతిక సహకారాన్ని బలోపేతం చేయడం వంటి పలు కీలక రంగాలకు సంబంధించి చర్చలు జరపనున్నారు. ఖలిస్థాన్ ఉగ్రవాది హర్‌దీప్‌సింగ్ నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల హస్తం ఉందని 2023లో అప్పటి ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు చేశారు. ఫలితంగా రెండు దేశాల సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
రెండు దేశాలు దౌత్యవేత్తలను బహిష్కరించుకోవడంతో దౌత్య వివాదం పెద్దదైంది. మార్క్‌కార్నీ అధికారంలోకి వచ్చాక సంబంధాలు మళ్లీ గాడినపడ్డాయి. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్లు పాల్గొన్నారని 2023 సెప్టెంబర్‌లో ట్రూడో చేసిన ఆరోపణలను భారతదేశం పదేపదే “అసంబద్ధం, ప్రేరేపితం” అని తిరస్కరించింది.
“కెనడాలో ఆశ్రయం పొందుతున్న ఖలిస్తానీ ఉగ్రవాదులు, తీవ్రవాదులు, భారతదేశ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను బెదిరిస్తూనే ఉన్నారు” అనే వారి నుండి దృష్టిని మరల్చడానికి ప్రయత్నించారని ట్రూడోకు భారతదేశం కూడా ఎదురుదాడి చేసింది. “ఈ విషయంపై కెనడా ప్రభుత్వ నిష్క్రియాత్మకత చాలా కాలంగా, నిరంతర ఆందోళన కలిగిస్తుంది” అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

More Stories
ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అది మానవాళికి ప్రమాదకరమే
మూడింట రెండు వంతుల జర్నలిస్టుల హత్యలు ఇజ్రాయిల్ లోనే!
ఓ భారత పారిశ్రామికవేత్తను బలవంతంగా గెంటేస్తోన్న స్వీడన్