దేశ రాజధాని ఢిల్లీ పేరు మార్పు అంశం ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో మరోసారి తెరపైకి వచ్చింది. కేరళ రాష్ట్రం తన పేరును అధికారికంగా కేరళమ్గా మార్చుకున్న వెంటనే ఇప్పుడు ఢిల్లీ పేరును కూడా ఇంద్రప్రస్థగా మార్చాలని చాందినీ చౌక్ బీజేపీ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. 1956లో కేంద్ర పాలిత ప్రాంతంగా ఢిల్లీ మారిన నవంబర్ 1 నాటికి ఈ విధంగా పేరు మార్చాలని ఆయన కోరారు
భారతదేశం ప్రపంచంలోనే అత్యంత పురాతన నాగరికతల్లో ఒకటని, మన రాజధాని పేరు మన ప్రాచీన సాంస్కృతిక మూలాలను ప్రతిబింబించేలా ఉండాలని ఎంపీ ఖండేల్వాల్ తెలుపుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఆయన ఒక సుదీర్ఘ లేఖ రాశారు. చారిత్రక గ్రంథాలు, పురావస్తు ఆధారాల ప్రకారం ప్రస్తుత ఢిల్లీ ఒకప్పుడు పాండవులు నిర్మించిన ఇంద్రప్రస్థం అని చెప్పుకొచ్చారు.
భారతదేశం ప్రపంచంలోనే అత్యంత పురాతన నాగరికతల్లో ఒకటని, మన రాజధాని పేరు మన ప్రాచీన సాంస్కృతిక మూలాలను ప్రతిబింబించేలా ఉండాలని ఎంపీ ఖండేల్వాల్ తెలుపుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఆయన ఒక సుదీర్ఘ లేఖ రాశారు. చారిత్రక గ్రంథాలు, పురావస్తు ఆధారాల ప్రకారం ప్రస్తుత ఢిల్లీ ఒకప్పుడు పాండవులు నిర్మించిన ఇంద్రప్రస్థం అని చెప్పుకొచ్చారు.
మహాభారత కాలంలో ఇది వైభవోపేతమైన నగరంగా ఉండేదని ఆయన గుర్తు చేశారు. ఢిల్లీ అనే పేరు మధ్యయుగ కాలంలో వాడుకలోకి వచ్చిందని, అది నగరపు అసలైన నాగరికతను ప్రతిబింబించదని ఆయన తన లేఖలో స్పష్టం చేశారు. కేవలం పేరు మార్పుతోనే సరిపెట్టకుండా ఢిల్లీ ప్రాచీన వైభవాన్ని చాటిచెప్పేలా మరికొన్ని చర్యలు తీసుకోవాలని కూడా ఖండేల్వాల్ కోరారు.
ఢిల్లీలోని చారిత్రక పురాణ ఖిల్లా వద్ద పాండవుల విగ్రహాలను ప్రతిష్టించాలని ఆయన సూచించారు. తద్వారా పర్యాటకులకు, వచ్చే తరాలకు మన ప్రాచీన వారసత్వం గురించి తెలిసే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా పాత ఢిల్లీ రైల్వే స్టేషన్ పేరును “ఇంద్రప్రస్థ జంక్షన్”గా, ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని “ఇంద్రప్రస్థ విమానాశ్రయం”గా మార్చాలని ఆయన సూచించారు.
ఢిల్లీ పేరు మార్పుకు మద్దతుగా ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు కూడా ఎంపీ ఖండేల్వాల్ ప్రత్యేకంగా లేఖ రాశారు. ఢిల్లీ అసెంబ్లీలో దీనిపై తీర్మానం ప్రవేశ పెట్టి, కేంద్రానికి పంపాలని ఆయన కోరారు. ఇటీవలి కాలంలో దేశంలోని అనేక నగరాలు తమ పాత పేర్లను పునరుద్ధరించుకున్నాయని, అదే బాటలో ఢిల్లీ కూడా తన మూలాలను వెతుక్కోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పేర్కొన్నారు.
ఢిల్లీ పేరు మార్పు ప్రతిపాదనపై ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయో, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. చరిత్ర ఆధారాల ప్రకారం మహాభారత కాలం (~3000 బిసీఈ)లో పాండవులు ఇంద్రప్రస్థాన్ని తమ రాజధానిగా నిర్మించారు. మౌర్య-గుప్త యుగంలో ఈ నగరం వాణిజ్యం, సంస్కృతికి కేంద్రంగా అభివృద్ధి చెందింది. రాజ్పుత్ కాలం (11వ–12వ శతాబ్దం)లో తోమర్ రాజులు దీనికి డిల్లికా అని పేరు పెట్టారు. దాని నుండి “ఢిల్లీ” ఉద్భవించింది.
సుల్తానేట్, మొఘల్ కాలాలలో పాలకులు అదే ప్రధాన ప్రాంతం చుట్టూ సిరి, తుగ్లకాబాద్, ఫిరోజ్ షా కోట్లా, షాజహానాబాద్ వంటి కొత్త నగరాలను నిర్మించారు. బ్రిటిష్ యుగం (1911)లో లుటియన్ల ఢిల్లీని పురాతన ఇంద్రప్రస్థ ప్రదేశం సమీపంలో రాజధానిగా నిర్మించారు.

More Stories
గ్రహ సరిహద్దులు దాటుతున్న వాతావరణ సంక్షోభం
రాష్ట్రపతి భవన్లో కొత్త విగ్రహంతో సి. రాజగోపాలాచారి
నిరసన ప్రదర్శనలతో కేరళ ఆరోగ్యమంత్రికి గాయాలు