రూ. 3.7 వేల కోట్లు విలువైన అనిల్ అంబానీ నివాసం జప్తు!

రూ. 3.7 వేల కోట్లు విలువైన అనిల్ అంబానీ నివాసం జప్తు!
రిలయన్స్ ఏడీఏ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ‌(66) కి చెందిన ముంబయి నివాసం ‘అబోడ్’ను కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం జప్తు చేసింది. ఈ నివాసం విలువ దాదాపు రూ.3,716.83 కోట్లు ఉంటుంది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) ప్రకారం అనిల్ అంబానీ ఇంటిని జప్తు చేశామని ఈడీ అధికార వర్గాలు తెలిపాయి. ఈమేరకు ఈడీ నుంచి ఒక తాత్కాలిక ఆదేశం జారీ అయిందని చెప్పాయి. 
 
అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) సంస్థ బ్యాంకు మోసాలకు (మనీ లాండరింగ్) పాల్పడిందనే ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ జరుపుతోంది.  దీనిలో భాగంగా తాజాగా అనిల్ ఆస్తిని ఈడీ జప్తు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అత్యంత విలాసవంతమైన ఈ బిల్డింగ్ ముంబైలోని పాలి హిల్ ప్రాంతంలో ఉంటుంది. 
 
ఇది 66 మీటర్ల ఎత్తు, 17 ఫ్లోర్లు కలిగి ఉంది. అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్‌ సంస్థ బ్యాంకు మోసాలు, ఇతర ఆర్థిక అవకతవకలకు పాల్పడిందనే ఫిర్యాదుపై సుప్రీంకోర్టు ప్రత్యేక బృందాన్ని విచారణ కోసం నియమించింది. ఈ కేసులో మొత్తం ఇప్పటివరకు  దాదాపు రూ.15,700 కోట్లు విలువైన అనిల్ ఆస్తులను ఈడీ జప్తు చేసింది.  ఈ గ్రూపునకు చెందిన ఆర్‌కామ్ సంస్థ రూ.40,000 కోట్లను బ్యాంకులకు ఎగ్గొట్టి, డీఫాల్ట్‌గా ప్రకటించింది.
మనీ లాండరింగ్ కేసులో అనిల్ గురువారం ఈడీ విచారణకు కూడా హాజరుకావాల్సి ఉంది. ఈ అంశంపై ఇప్పటికే అతడికి ఈడీ సమన్లు జారీ చేసింది. ఇక బ్యాంకు అనుమతి లేకుండా అనిల్ విదేశాలకు వెళ్లడానికి కూడా అనుమతి లేదు.  అలాగే మరో కేసులో అనిల్ అంబానీ భార్య, నటి టీనా అంబానీకి కూడా ఈడీ గతంలో సమన్లు జారీ చేసింది. ఆమె న్యూయార్క్‌లో ఖరీదైన భవంతిని కొనుగోలు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇంతకుముందు తొలిసారిగా 2025 ఆగస్టులో ఆయన్ను ఈడీ అధికారులు ప్రశ్నించారు.