స్కూల్స్, ఇతర విద్యాసంస్థలు, దేవాలయాల పరిసరాల్లో అన్నిరకాల మాంసం విక్రయాలు నిలిపివేయాలని బీహార్ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఇటీవల బిహార్ ఉపముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి విజయ్ కుమార్ సిన్హా ఆదేశాలు జారీ చేశారు. దీని ప్రకారం ఇకపై విద్యాసంస్థలు, దేవాలయాల పరిసరాల్లో మాంసం, చేపలు, గుడ్లు వంటివి అమ్మడానికి వీల్లేదు.
ఈ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విజయ్ కుమార్ హెచ్చరించారు. ఇటీవల తాను వివిధ ప్రాంతాల్లో పర్యటించిన సందర్భంగా వచ్చిన ఫిర్యాదులు, సలహాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ‘‘ప్రజలు మాంసం తినడానికి మేం వ్యతిరేకం కాదు. కానీ, వాటి నుంచి వచ్చే వాసనతో అటు విద్యార్థులు, ఇటు దేవాలయాల్లో భక్తులు ఇబ్బంది పడుతున్నారు” అని చెప్పారు.
“ముఖ్యంగా దేవాలయాలకు వచ్చే భక్తుల మనోభావాలకు ఇబ్బంది కలుగుతుంది. అలాగే, మాంసం షాపుల కారణంగా విద్యార్థుల హింసాత్మక ధోరణి పెరగొచ్చు. అందుకే స్కూల్స్, ఇతర విద్యాసంస్థలు, దేవాలయాలు, వాటి పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, సామాజిక సామరస్యానికి దోహదపడాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని ఆయన తెలిపారు.
జిల్లా అధికారులు ఈ నిబంధనల్ని అమలు చేయాలని పేర్కొంటూ ఒకవేళ నిబంధనలు అతిక్రమిస్తే బిహార్ మున్సిపాలిటీ యాక్ట్ 2007 ప్రకారం చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అయితే, ఈ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి. వీటి వెనుక దురుద్దేశాలున్నాని విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో జంతువులను వధించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదని, అలాగే మాంసం విక్రయించేందుకు ప్రత్యేక స్థలాలు కూడా లేవని మండిపడ్డారు. వీటన్నింటినీ పరిష్కరించిన తర్వాత ఇలాంటి నిర్ణయాలు అమలు చేయాలని ప్రతిపక్ష నేతలు సూచిస్తున్నారు.

More Stories
ఎన్సిఇఆర్టి పాఠ్యపుస్తకంలో “న్యాయవ్యవస్థలో అవినీతి”
కేరళమ్గా మారనున్న కేరళ
ఏఐ సమ్మిట్ లో నిరసనపై యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అరెస్ట్