పశ్చిమ బెంగాల్ లో మంగళవారం ఒకేసారి రాష్ట్రంలోని జిల్లా కోర్టులతోపాటు మొత్తం ఆరు కోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ‘సర్’ కోసం జిల్లా జడ్జీలు పని చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన 48 గంటల్లోనే ఈ బెదిరింపులు రావడం గమనార్హం. మంగళవారం ఉదయం మెయిల్స్ ద్వారా ఈ బెదిరింపులు వచ్చాయి. కోల్‌కతా సిటీ సివిల్ కోర్ట్ జడ్జికీ మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది.
ఆ తర్వాత కొద్ది సేపట్లోనే బెర్హాంపూర్ (ముర్షీదాబాద్), చిన్సురా (హూగ్లీ)తోపాటు మొత్తం ఐదు కోర్టులను లక్ష్యంగా చేసుకుని బాంబు బెదిరింపులు వచ్చినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. దీనిపై సమాచారం అందుకున్న బాంబ్ డిస్పోజల్ బృందాలు, స్థానిక పోలీసులు కోర్టులకు చేరుకున్నారు. కోర్టు ప్రాంగణాలు మొత్తాన్ని అదుపులోకి తీసుకుని తనిఖీలు చేశారు. స్నైఫర్ డాగ్స్ కూడా ఈ సోదాల్లో పాల్గొన్నాయి.
కోర్టులు, పరిసరాలు అణువణువూ తనిఖీ చేశారు. సిటీ సివిల్ కోర్టుతోపాటు ఇతర కోర్టుల్లో సిబ్బందిని బయటకు పంపి సోదాలు నిర్వహించారు. ఫోరెన్సిక్ బృందాలు కూడా సహకారం అందించాయి. ఈ నేపథ్యంలో వివిధ కోర్టుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. దీంతో ఆయా కోర్టుల్లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. అయితే, ఎలాంటి అనుమానిత పేలుడు పదార్థాలు వంటివి గుర్తించలేదు.
కోర్టులతోపాటు జడ్జీలకు కూడా భద్రతను పెంచారు. ముఖ్యంగా ‘సర్’ విధులు నిర్వహిస్తున్న జడ్జీలకు పూర్తి భద్రత కల్పించాల్సిందిగా ఆదేశించారు. ఈ మెయిల్స్ ఎక్కడినుంచి వచ్చాయో తెలుసుకునేందుకు బెంగాల్ సైబర్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. మెయిల్స్‌కు సంబంధించిన ఐపీ అడ్రస్‌ల గురించి తెలుసుకుంటున్నారు. ఇక ఇప్పటికే ‘సర్’ విధుల్లో పాల్గొంటున్న సిబ్బందికి పలు బెదిరింపులు వచ్చాయి. వాటి విషయంలో కూడా సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. తాజాగా జిల్లా స్థాయి జడ్జీలు ‘సర్’ బాధ్యతలు పంచుకోవాలనే సుప్రీ ఆదేశాల నేపథ్యంలో బాంబు బెదిరింపులు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

More Stories
దేశవ్యాప్తంగా బాలికలకు ఉచితంగా హెచ్‌పీవీ టీకా
సరిహద్దుల్లో పాక్, అమెరికా కరెన్సీలతో బెలూన్లు
జార్ఖండ్ లో 450 `నిర్బంధంలో మరణాలు’పై వివరణ కోరిన హైకోర్టు